రచన: వల్పోల రాహుల

[శ్రీలంకకు చెందిన బౌద్ధభిక్షువు మాననీయ వల్పోల రాహుల, 1933-34 మధ్య, సింహళ భాషలో కొన్ని వ్యాసాలు రాశారు. మొదట వాటిని కరపత్రాలుగా ప్రచురించి ఉచితంగా పంచారు. దాదాపు అరవై సంవత్సరాల తరువాత, 1992లో, అవి “సత్యోదయ” అనే పేరుతో ఒక సంకలనంగా వెలువడ్డాయి. మరో ఇరవయ్యేడు సంవత్సరాల తరువాత, 2019లో నిరంజన్ సెల్వదురై అనే రచయిత, దీన్ని Truth Awakening అనే పేరుతో ఇంగ్లీషులోకి అనువదించారు. ఈ సంకలంలో గల Conflicting Views అనే వ్యాసానికి డి. చంద్రశేఖర్ చేసిన తెలుగు అనువాదాన్ని ఇక్కడ అందిస్తున్నాం.]  

ప్రపంచంలో స్వేచ్ఛాలోచన గలవారిలో బౌద్ధులు అగ్రగణ్యులని అనుకోవచ్చు. ధార్మిక సంప్రదాయాలను స్థాపించినవారిలో, ‘స్వేచ్ఛాలోచన’ విలువను నొక్కిచేప్పిన మొదటి వ్యక్తి బుద్ధుడు. సత్యాన్ని దర్శించగల సమర్ధతను ఆయన బోధనలు ధైర్యంగా, సూటిగా నొక్కిచెప్పాయి.

అంగుత్తర నికాయలోని కాలామసుత్తం, ప్రపంచానికి ఒక  ‘స్వేచ్ఛాలోచన ప్రణాళిక’ను అందించింది. అది ఇలా చెబుతున్నది:

“కాలాములారా, తరతరాలుగా వింటున్నామని, లేదా సంప్రదాయమని, లేదా ఎవరో చెప్పారని, లేదా గ్రంథాల్లో చెప్పబడిందని, లేదా తర్కసహితంగా ఉందని, లేదా హేతుబద్ధంగా ఉందని, లేదా తర్కవితర్కంతో గాని, లేదా ఆమోదించిన దృష్టిని పోలివుందని, లేదా ఆకర్షణీయంగా ఉందని, లేదా మీరు గౌరవించే గురువు చెప్పినదని దేనినీ అనుసరించవద్దు. కాలాములారా, ‘ఇవి అకుశలమైనవి, ఇవి నిందించదగినవి; ఇవి విజ్ఞులు గర్హించేవి; వీటిని ఆమోదించి ఆచరిస్తే హాని, దుక్ఖం కలిగిస్తాయ’ని మీరు స్వయంగా తెలుసుకున్న వాటిని విడనాడండి.”

ఈ బోధన ప్రపంచ ధార్మిక చరిత్రలో ఒక విప్లవాత్మకమైన మలుపు. సత్యాన్ని తెలుసుకోటానికి సంప్రదాయం, మతగ్రంథాలు, గురువుల అభిప్రాయాల వంటి సుస్థిరమైన పీఠాలను ప్రశ్నించవలసిన అవసరముందని బుద్ధుడు గుర్తించాడు. భారతదేశంలో గాక, మరోదేశంలో ఇటువంటి ప్రకటన చేసివుంటే, ఆయనకు మరణశిక్ష విధించబడేదేమో. ఇతరదేశాల్లో, వారి భావాల కారణంగా ధార్మిక గురువులకు శిక్షలు విధించారనే విషయం మనకు తెలుసు. తన అభిప్రాయాలను సూటిగా ప్రకటించినందుకు, బుద్ధుని మీద దాడులు చెయ్యటానికి చాలమంది ప్రయత్నించారు. అటువంటి ప్రయత్నాలన్నీ విఫలమవటం, నిజంగా మన అదృష్టం అనుకోవాలి.

సెయింట్ ఫ్రాన్సిస్ మానవసేవకు అంకితమైన ఒక గొప్ప సాధువు. అతన్ని రెండవ క్రీస్తుగా భావిస్తారు. ఒకానొక సందర్భంలో సెయింట్ ఫ్రాన్సిస్, ఇద్దరు శిష్యులను పిలిచి, కాబేజీ మొక్కలు నాటమని చెప్పాడు. వారు నాటే మొక్కల వేర్లు పైకి, ఆకులు భూమిలోకి ఉండాలని వారికి ప్రత్యేకంగా సూచించాడు. ఒక శిష్యుడు గురువుగారి ఆదేశాన్ని పాటిస్తూ, ఆయన చెప్పినట్లే చేశాడు. కాని, రెండో శిష్యుడు అలా చెయ్యటం సరికాదని, వేర్లు నేలలో ఆకులు పైన ఉండాలని అన్నాడు. అప్పుడు సెయింట్ ఫ్రాన్సిస్ ఆ శిష్యునితో, “నువు గురువును మించిన శిష్యుడివి కావాలని ప్రయత్నిస్తున్నావా?” అని అన్నాడు. ఈ కథనుబట్టి, గొప్ప దయామయుడైన సెయింట్ ఫ్రాన్సిస్ సయితం స్వేచ్ఛాలోచన విలువను గ్రహించలేదేమో అనిపిస్తుంది.

ఈ వృత్తాంతం, నేడు మనదేశంలో బుద్ధుని బోధనల పట్ల బౌద్ధులు అనుసరిస్తున్న సాధారణ వైఖరిని ప్రతిబింబిస్తుంది. ధర్మాన్ని నేర్చుకునే విద్యార్థులు సంప్రదాయాన్ని, ధర్మగ్రంథాలను లేదా గురువుల అభిప్రాయాలను ప్రశ్నించటం చాల అరుదయింది. గురువులు కూడ తమ శిష్యులను సేవకులుగానే చూస్తున్నారు. సాధారణంగా, వారు భిన్నమైన అభిప్రాయాలను, వివిధ దృక్పథాలను సహించరు. విద్యార్థులు బుద్ధవచనాన్ని నిశితంగా విమర్శనాత్మకంగా పరిశోధించే అధ్యయనానికి, ఇటువంటి వైఖరి ఆటంకంగా మారింది.

ఏవిషయం మీద అయినా భిన్నమైన అభిప్రాయాలు తలెత్తటం సహజం. ధర్మం ఇందుకు మినహాయింపు కాదు. భిన్నాభిప్రాయాల పట్ల ఎవరైనా అతిగా ఆందోళనకు లోనైతే, అది ఆ వ్యక్తి యొక్క సంకుచిత స్వభావాన్ని సూచిస్తుంది. పోప్ అయినా లేదా ఒక సాధారణ క్రైస్తవుడైనా, క్రైస్తవం గురించి తన అభిప్రాయాలను వ్యక్తంచేసే హక్కు ఉంటుంది. వారిలో ఎవరూ క్రీస్తును కలవటం లేదా ఆయనతో మాట్లాటం జరగలేదు. వారిరువురూ బైబిలు చదవటం ద్వారానే తమ అభిప్రాయాలు ఏర్పర్చుకున్నారు. అదేరీతిలో, ఒక ప్రధాన బౌద్ధభిక్షువుకు, బౌద్ధాన్ని అధ్యయనం చేసిన ఒక సాధారణ బౌద్ధుడి అభిప్రాయాన్ని రద్దుచేసే హక్కు లేదు. ఇద్దరూ త్రిపిటకాలను చదివినవారే, వీరిలో ఎవరికీ బుద్ధునితో చర్చించే అవకాశం కలగలేదు. తాను మరణించబోయే ముందు బుద్ధుడు, ఒక గురువుగా, ధర్మం విషయంలో తాను దాచింది ఏమీ లేదని ప్రకటించాడు. ఆయన వివరించకుండా గుప్తంగా వదిలేసిన విషయాలేవీ లేవు.

‘ధర్మగ్రంథాల్లో రాయబడిన ప్రతిదీ అంగీకరించవలసిందే’ అనటం ఒక తప్పుడు దృష్టి. బుద్ధుడు ‘మా పిటక-సంపదానేన’ అని చెప్పాడు, అంటే, ‘గ్రంథాల్లో ఉన్నదనే కారణంతో ఆమోదించవద్దు’ అని. క్రైస్తవంలో బైబిలు పవిత్రగ్రంథం, ఇస్లాంలో ఖురాన్. బౌద్ధులకు త్రిపిటకాలు అటువంటివే. బుద్ధుని పరినిర్వాణం జరిగిన చాలకాలం తరువాత రాయబడిన అనేక బౌద్ధగ్రంథాలు, మూల గ్రంథాల్లోని బోధనలతో సరిపోలటం లేదనేది ఒక బహిరంగ రహస్యం. వ్యాఖ్యాన గ్రంథాల్లోని సత్యాన్ని నిర్ధారించటానికి జరిగే ప్రయత్నంలో విరుద్ధమైన వైఖరులు తలెత్తవచ్చు. మూల గ్రంథాల విషయంలో సయితం, సత్యాన్ని నిర్ధారించి అర్థంచేసుకోటానికి స్వేచ్ఛాన్వేషణ అవసరం. మూల గ్రంథాలపై రాసిన ప్రాచీన వ్యాఖ్యానాల్లో కూడ భిన్నమైన వైఖరులను చర్చించటం జరిగింది. బుద్ధుని బోధనల్లోని కొన్ని అంశాలపై, ఆకాలంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే విషయాన్ని ఇది నిరూపిస్తుంది.

ఈనాడు శ్రీలంకలో తంతులు, ఆచారాలు పాటించటం (సీలబ్బత-పరామాస) అనేది ఒక బౌద్ధసంప్రదాయంగా స్థిరపడిపోయింది. తగిన పరిశీలన, అభిశంసన లేకుండా, బౌద్దేతరమైన భావనను తరతరాలుగా అనుసరించిన ఫలితమే ఇది. తరతరాలుగా వస్తున్న ఒక సంప్రదాయం ముందు గుడ్డిగా తలవంచటం అనేది, పరిణితిలేని మనసు యొక్క మౌలికమైన బలహీనత. మనం అనుసరించవలసిన విలువైన ఆచారాలు ఉన్నప్పటికి, పాతకాలంనాటి ప్రతి తంతును ఆచరించటం తెలివైనపని కాదు. పురాతనమైన ఆచారాలను గౌరవించాలని చాలమంది అంటుంటారు. కాని, సత్యము, అవగాహన అనేవి సంప్రదాయంపై ఆధారపడి ఉండవు. మనం ఇప్పుడు ఎటువంటి ఆచారాలను మొదలెట్టినా, అవి మరో వందేళ్ళ తరవాత సంప్రదాయంగా భావించబడతాయి. మరి, భావితరాల ప్రజలు ‘పాతకాలపు సంప్రదాయమ’నే పేరుతో వీటిని నిరభ్యంతరంగా అంగీకరించాలా?

ఒక విహారలో ప్రధాన భిక్షువు, ప్రతిరోజూ భిక్షకు వెళ్ళేముందు, తన భిక్షపాత్రను సూర్యుని వైపుగా పైకెత్తి  పట్టుకునేవాడు. త్వరలోనే ఆయన శిష్యులంతా ఇదేవిధంగా చెయ్యసాగారు. ఈ సంప్రదాయం ఏడు తరాలపాటు కొనసాగింది. ఆ ప్రధాన భిక్షువు అలా చెయ్యటానికి కారణం ఏమిటంటే, అతని భిక్షపాత్రకు చిన్న రంధ్రం ఉండేది. అది సరిగ్గా ఎక్కడుందో తెలుసుకోటానికి అతను భిక్షపాత్రను సూర్యుని వైపు ఎత్తిపట్టి చూసేవాడు. తరువాత, పాత్రలో వేసే పదార్ధాలు కారిపోకుండా, రంధ్రానికి వేలు అడ్డుపెట్టి భిక్షకు వెళ్ళేవాడు. ఈ విషయం తెలుసుకోకుండా శిష్యులు అతణ్ణి అనుకరించారు. కారణాలు తెలుసుకోకుండా గురువును, సంప్రదాయాన్ని గుడ్డిగా అనుసరించటం అనేదానికి ఇదొక ఉదాహరణ. దురదృష్టంకొద్ది, ఈనాడు మనం ఇటువంటి అనేక ఆచారాను పాటిస్తున్నాం. పురాతన ప్రభువుల కాలం నుండి కొనసాగుతున్న సంప్రదాయాలను కూడ గౌరవించటానికి మనం అలవాటుపడ్డాం. అదెలావున్నా, ధార్మిక అధ్యయనం కోసం రాజులను ఆదర్శంగా ఎంచుకునే విషయంలో మనం జాగ్రత్తగా వ్యవహరించాలి.

రాజకీయాలు, చట్టాలు, ఉద్యోగాలు, పన్నులు వంటి విషయాలల్లో ప్రజాభిప్రాయానికి విలువ ఉంటుంది. కాని, ధార్మికజ్ఞానం కోసం ప్రజాభిప్రాయం మీద లేదా సామాజిక దృక్పథాల మీద ఆధారపడకూడదు. నైతికత, ధార్మికప్రజ్ఞ అనేవి మెజారిటి అభిప్రాయంతో నిర్ణయించబడేవి కావు. అజ్ఞానులైన సాధారణ ప్రజలు లోతైన ధర్మాన్ని గ్రహించలేరనే సంగతి బుద్ధునికి ముందే తెలుసు. కోపం, అసూయ, మోసం, అహంకారం, అజ్ఞానం వంటి గుణాలతో నిండిన ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. పుణ్యకార్యాలు చేసి, వాటి ప్రతిఫలంగా నిర్వాణాన్ని కోరుకోవటం అనేది, స్వార్థంతో కూడిన ఒక అకుశలమైన ఆలోచన. ఇలాంటి బోధన అధికశాతం జనానికి కలవరం కలిగించొచ్చు. కాని, ప్రజ్ఞావంతుడైన వ్యక్తి దీన్ని అభినందిస్తాడు. కేవలం మెజారిటి ప్రజలు దీన్ని అర్థంచేసుకోలేరని, అంగీకరించరని, వ్యతిరేకిస్తారని, మనం గంభీరమైన ధర్మాన్ని దాచకూడదు.

ప్రజల నుండి వ్యతిరేకత ఎదురయ్యే సంఘటనలంటే చాలమంది భయపడతారు. ఒక వ్యక్తి పట్ల కలిగే భయానికి, ప్రజాభిప్రాయం పట్ల కలిగే భయానికి పెద్దతేడా లేదు. నిజాయితీతో కూడిన స్పష్టమైన నీ అభిప్రాయాలను, ప్రజలు వ్యతిరేకిస్తారనే భయంతో వ్యక్తం చెయ్యలేకపోతే, అదొక తీవ్రమైన బలహీనత అవుతుంది. వ్యక్తిగత లాభం, కీర్తి, పొగడ్తలు, అధికారం, ఆశించేవారు, ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా తమ నిజమైన అభిప్రాయాలను వ్యక్తం చెయ్యటానికి జంకుతారు.

అపరిచితమైన లేదా ప్రజలకు ఇచ్చగించని ఒక భావాన్ని ప్రకటిస్తే, సమాజం దాన్ని ప్రతిఘటిస్తుంది. అయిష్టమైన పనులు లేదా భావాల కారణంగా తలెత్తిన ఆకస్మిక తిరుగుబాట్లు చరిత్రలో తరచూ కనిపిస్తాయి. బుద్ధుని కాలంలో, అతని భావాలను వ్యతిరేకించినవారు చాలమంది ఉన్నారు. అతన్ని చంపటానికి రకరకాల ప్రయత్నాలు జరిగాయి.

ఒక సందర్భంలో, ఒక గుట్టమీద నుండి పెద్ద బండరాయిని బుద్ధునిపైకి దొర్లించాలనే ప్రయత్నం జరిగింది. మరో సందర్భంలో, బుద్ధుణ్ణి బాణాలతో చంపటానికి కిరాయి వేటగాళ్ళను పంపారు. వేరొక సందర్భంలో, బుద్ధుడు భిక్షువులతో కలిసి భిక్షకు వెళుతుండగా, ఒక మదపుటేనుగును ఆయనపైకి ఉసిగొలిపారు. అంతేకాదు, మచ్చలేని బుద్ధుని వ్యక్తిత్వాన్ని కించపర్చాలనే ప్రయత్నాలు కూడ జరిగాయి. బుద్ధునికి లభించిన ప్రజాదరణ పట్ల అసూయచెందిన కొందరు, ఇతర ధార్మిక శాఖలకు చెందిన గురువులు, ఆయన ప్రతిష్టను దిగజార్చాలని కుట్రలు పన్నారు. బుద్ధునిపై తప్పుడు ఆరోపణ చెయ్యటానికి, వారు చించా అనే సన్యాసినిని పంపించారు. ఆమె గర్భవతి వేషం ధరించి, తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి బుద్ధుడేనని ఆరోపించింది. మరో సందర్భంలో, బుద్ధుని ప్రత్యర్ధులు సుందరి అనే సన్యాసినిని చంపి, ఆమె శవాన్ని బుద్ధుడు విడిదిచేసిన విహారకు సమీపంలో పాతిపెట్టారు. తరువాత, ఆమెకోసం వెదుకుతున్నట్లు నాటకమాడి, శవాన్ని తవ్వితీశారు. అప్పుడు వారు, “శ్రమణ గౌతముడు సుందరిని చంపి, ఎవరికీ తెలియకుండా శవాన్ని పూడ్చిపెట్టాడు” అంటూ ప్రచారం చేశారు. ఈ సంఘటన ప్రజల్లో తీవ్రమైన దుమారం లేపింది. ఒక వారంరోజుల తరువాత, ప్రజలకు వాస్తవం తెలియటంతో బుద్ధునిపై చేసిన అపవాదు సమసిపోయింది.

ప్రసిద్ధిచెందిన ఇతర ధార్మిక ప్రవక్తలు కూడ, తమ నిజమైన భావాలను వ్యక్తం చేసినందుకు, తీవ్రమైన విరోధాన్ని ఎదుర్కొన్నారని చెప్పే అనేక ఉదాహరణలు చరిత్రలో కనిపిస్తాయి.  

నిశ్శబ్దంగా ఉండే బండరాయి ప్రశాంతతకు చిహ్నం. ప్రాణంలేని శవం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కాని అటువంటి ప్రశాంతత వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? రాత్రివేళ జనమంతా నిద్రించే సమయంలో నగరం ప్రశాంతంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితి దొంగలకు అనువైన సమయం. ప్రజలు నిద్రలేచి పనులు చేసేటప్పుడు విభేదాలు, కలతలు తలెత్తవచ్చు. ఇటువంటి పరిస్థితి క్రియాశీలమైన పనుల్లో ఒక అంతర్భాగం. ఎవరైనా విభేదాలు కలతల గురించి భయపడితే, వారు మరణించే వరకు నిద్రపోతూ ఉండాల్సిందే.

సోమరిపోతు నిద్రనుంచి మేల్కొనటానికి ఇష్టపడడు. తనను నిద్రలేపే వారిని అతను కసురుకుంటాడు. మానసిక జడత్వం దీనికంటే జటిలమైంది. మానసికంగా సోమరియైన వ్యక్తి, తన మనసును మేలుకోల్పే ప్రయత్నాలను ప్రతిఘతిస్తాడు. కాని, నిద్రమత్తు నుండి లేపగలిగితే, అతనికి మేలు జరుగుతుంది, అతడు స్వతంత్రంగా ఆలోచించటం ప్రారంభిస్తాడు. భిన్నమైన దృక్పథాల గురించి తెలుసుకుంటే, ప్రజలు పక్కదోవ పట్టి గందరగోళానికి లోనవుతారని భావించే కొందరు, ఇటువంటి ‘మేలుకోలుపు’ను వ్యతిరేకిస్తారు. అయినప్పటికి, చీకటిలో ఉన్న వ్యక్తి వెలుగును చూడగలిగితే, అతను మంచిపని చెయ్యాలనే ఉత్తేజం పొందగలడు.

నేటి శ్రీలంక సమాజం, సత్యాన్ని అన్వేషించి పరిశోధించే విషయంలో విధేయతను ఆశ్రయించిన స్థితిలో ఉంది. జ్ఞానసంపన్నులైన పండితులు మొదలు సామాన్య పౌరుల వరకు, దాదాపు అందరూ, సంప్రదాయాన్ని, పుస్తకాల్లో రాసిన ప్రతి విషయాన్ని వినమ్రంగా అంగీకరిస్తారు. సత్యాన్ని సరైన ప్రమాణాలతో నిర్ధారించటానికి జరుగుతున్న ప్రయత్నం కొంచెమే. వ్యక్తిగతంగా నష్టం జరుగుతుందని భావిస్తే తప్ప, సత్యాన్వేషణ అనేది విలువైన పనిగా తోచటంలేదు. పాలిలో రాయబడింది ఏదైనాసరే, చర్చలేకుండా దాన్ని బుద్ధవచనంగా అంగీకరించటం జరుగుతుంది. మన ఆచారాలు, అభిప్రాయాలు ధర్మానికి అనుగుణంగా ఉంటున్నాయా? అనే విషయాన్ని ఎవరూ పరిశీలించటంలేదు. ‘మహోన్నత’ సంప్రదాయాలు ఉన్నప్పటికి, మన (దేశంలో) నైతిక విలువలు ఎందుకు దిగజారాయని ఎవరూ ఆలోచించటంలేదు.

కాలంచెల్లిన ఆచారాలను తొలగించి, వాటిస్థానంలో మెరుగైన విధానాలను ప్రవేశపెట్టే సాంఘిక సంస్కరణల దిశగా ఎటువంటి ప్రయత్నం జరగటంలేదు. ప్రగతిశీలమైన మార్పు సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది, అందుకు మారుగా, తిరోదకమైన మార్పు సమాజ పతనాన్ని సూచిస్తుంది. ఈనాడు తయారుచేసే ఎద్దులబండి అనేక శతాబ్దాల నాటి నమూనాలోనే ఉంటున్నది. దురదృష్టంకొద్ది, ఒక విద్యార్థి గురువు కంటే సృజనాత్మకంగా, భిన్నంగా ఆలోచించటం అపరాధంగా భావించబడుతుంది.

ధర్మోపదేశాలు జరిగే సందర్భాల్లో వెలువడుతున్న అభిప్రాయాలు, ఇంకా ఉత్తరాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి, ఇటీవ దేశంలోని బౌద్ధసంఘాల్లో ఒకవిధమైన చైతన్యం లేదా ‘అలజడి’ రేకెత్తుతున్నట్లు కనిపిస్తున్నది. ఇది నిజంగానే ఒక శుభవార్త. ఆలజడి, ఆందోళన లేకుండా సరైన సాంఘిక సంస్కరణ జరగదు.

పైన వెల్లడించిన మన అభిప్రాయాలను కొందరు తప్పుగా వ్యాఖానించటం విచారకరం. వారు మనతో నేరుగా చర్చించకపోవటం, అవగాహన కొరవడిన భావాలు అభిప్రాయాలు విస్తృతంగా ప్రచారమవటం ఇందుకు కారణం. సమాజం మొత్తం నిజమైన ధర్మాన్ని తెలుసుకోవాలనేది మన లక్ష్యం. మనం చెప్పినవాటిలో ఏవైనా తప్పులుంటే, సహేతుకమైన సంభాషణ, చర్చల ద్వారా మన తప్పులను సంతోషంగా అంగీకరిద్దాం. సత్యాన్ని నిగ్గుతెల్చే పరిశోధనలో ‘ఆ పుస్తకంలో అలా ఎందుకు రాయబడింది?’ లేదా ‘ఆ ప్రముఖ గురువు ఆ అభ్యాసాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు?’ అని మాత్రమే ప్రశ్నించటం నిరర్థకమైన వైఖరి. సదరు విషయాల మరియు అభ్యాసాల గుణదోషాలను సవివరంగా పరిశీలించి, వాటిపై విజ్ఞతతో సరైన నిర్ణయానికి రావటం అవసరం. మీరు విభేదించే అభిప్రాయాల పట్ల అసహ్యత, కోపం కలగటం ఒక మానసిక రుగ్మత; ధర్మం గురించి సరైన అవగాహనతో దీన్ని పరిహరించాలి.

మన అభిప్రాయాలన్నిటిని ఆమోదించాలని లేదా మన అభిప్రాయాల్లో ఎటువంటి దోషాలు లేవని మనం వాదించటంలేదు. అంతేకాదు, ప్రస్తుతానికి సరైనదిగా కనిపించే అభిప్రాయం, కొన్నాళ్ళ తరువాత పునరాలోచించి మార్చుకోదగిందిగా తోచవచ్చు. కేవలం ఒకరు చెప్పింది తప్పని నిరూపించే పనిమీద గురిపెట్టటం సత్యాన్ని నిరూపించే మార్గం కాదు. సత్యం విశ్వజనీనం, అది ఒకరి సొంత ఆస్తి కాదు. సత్యం అనేది మనకు తెలినదానికి, మనం అంగీకరించిన దానికి పూర్తిభిన్నంగా ఉండవచ్చు. మనకు కావలసింది, ప్రతిదానికి ‘అవును’ అని తలాడించే మనుషులున్న సమాజం కాదు; పరిశీలనత్మకంగా సత్యాన్ని శోధించే ప్రజలున్న సమాజం కావాలి.