రచన: డి. చంద్రశేఖర్        

“బుద్ధుని బోధనలు: మానవ విలువలు” అనే విషయాన్ని లోతుగా పరిశీలించే ముందు, ‘మానవ విలువలు’ అనే మాటలకు సరైన నిర్వచనం చెప్పుకోవటం అవసరం. సాధారణంగా, మానవ విలువలు అంటే “ప్రత్యేకంగా మనిషి జీవితానికి సంబంధించిన విలువలు” అని నిర్వచిస్తారు. మరింత నిర్దిష్ట అర్థంలో, వ్యక్తిగతంగా మరియు సామాజికంగా మానవుని ఔన్నత్యానికి దోహదం చెయ్యగల విలువలను మానవ విలువలు అని చెప్పటం సబబు. ఒక మనిషి సాటి మనుషులతో ఎలా ప్రవర్తించాలి అనే విషయం, మానవ విలువలను నిర్దేశించే ప్రధాన సూత్రం అనేది నిస్సందేహం. దీనికితోడు, మనిషి ఇతర జీవులతో, ప్రకృతితో ఎలా వ్యవహరించాలి అనేది కూడా మానవ విలువల్లో అంతర్భాగమని ఈనాడు చాల మంది అంగీకరిస్తున్నారు. లోతుగా పరిశీలిస్తే, ఇవన్నీ “మనిషికి గల సహజ గుణాల”ని కొందరు చెబుతున్నారు.

అయితే, కొంతకాలంగా ‘మానవ’ అనే పదం ఒక సరికొత్త తాత్విక అర్థాన్ని సంతరించుకుంది. ఈ నూతన అర్థంలో, తాము చెబుతున్న విలువలు ‘దేవుడు ప్రసాదించినవి లేదా దేవుని ఆజ్ఞలు’ కావని నొక్కి చెప్పటానికి ‘మానవ విలువలు’ అనే పదాలను కొందరు ఉపయోగిస్తున్నారు. అంటే, మానవుడు తన జీవిత అనుభవంపై ఆధారపడి, దాన్ని పరిశోధించి, పరిశీలించి రూపొందించిన విలువలు కనుక, అవి మానవ విలువలు. ఈ ఆధునిక నిర్వచనం ప్రకారం, మానవ విలువలు హేతుబద్ధమైనవి, శాస్త్రీయమైనవి. అంతేకాదు, అవి సార్వజనీనమైనవి కూడా. అంటే, జాతి, మత, కుల, ప్రాంత, లింగ తదితర భేదాలు లేకుండా, మానవ విలువలు మనిషిగా పుట్టిన ప్రతిఒక్కరికి వర్తించాలి, అందరికి ప్రయోజనం కలిగించాలి.

ప్రపంచంలో అనేక గుణాలు మానవ విలువలుగా పరిగణించ బడుతున్నాయి: సత్యవాక్కు, నిజాయితి, విశ్వసనీయత, న్యాయం, శాంతి, సహనం, సహకారం, సమానత్వం, సంయమనం, నిస్పక్షపాతం, క్షమత, దయ, కనికరం, బాధ్యత, గౌరవం, ఆత్మవిశ్వాసం, ధీరత్వం – ఈ జాబితాకు ఇంకా చాల అంశాలను జోడించవచ్చు. ఇప్పుడు, బుద్ధుడు బోధించిన మానవ విలువలు ఏమిటి? అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం.

బుద్ధుని దృక్పథంలో మానవ విలువలు            

ప్రపంచ చరిత్రలో మానవ విలువలు బుద్ధునితో ప్రారంభం కాలేదు. బుద్ధునికంటే ముందు, బుద్ధుని కాలంలో, అటుతరువాత కూడ, అనేకమంది ప్రవక్తలు, తత్వవేత్తలు, సంస్కర్తలు అనేక రూపాల్లో మానవ విలువల గురించి బోధించారు. వాటిలో కొంత భిన్నత్వం ఉన్నప్పటికి, ముఖ్యమైన అంశాల్లో వాటిమధ్య సారూప్యత ఉన్నమాట వాస్తవం. అటువంటప్పుడు, బుద్ధుడు బోధించిన మానవ విలువలను ప్రత్యేకంగా అధ్యయనం చెయ్యవలసిన అవసరం ఏమిటి? … అనేది సహజంగా తలెత్తే ఒక మంచి ప్రశ్న. బుద్ధుని బోధనల్లోని మానవ విలువలను, వాటిని రూపొందించటంలో బుద్ధుడు అనుసరించిన జీవిత దృక్పథాన్ని లోతుగా పరిశీలిస్తే, ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది.

ముందుగా బుద్ధుడు బోధించిన విలువల గురించి తెలుసుకుందాం.

అత్యంత మౌలిక విలువలు: గొంకు, జంకు

బౌద్ధంతో పరిచయమున్న వారందరికి తెలిసిన విషయం పంచశీల (వివరణ కింది పేరాల్లో ఉంది). సాధారణంగా, పంచశీలలో గల ఐదు సూత్రాలు, బుద్ధుడు చెప్పిన మౌలిక విలువలని భావించటం కద్దు. కాని, మానవ జీవితంలో ఇంతకంటే మౌలికమైన రెండు విలువలు ఉన్నాయని బుద్ధుడు ప్రకటించాడు. వాటిలో మొదటిది గొంకు (హిరి), రెండవది జంకు (ఓత్తప్ప). ఈ సంగతి కొందరికి వింతగా తోచవచ్చు. కాని, ఇది మూల బౌద్ధగ్రంథాలు చెబుతున్న అక్షరసత్యం. వీటి గురించి కొంత వివరంగా తెలుసుకుందాం.     

గొంకు అంటే, నైతికంగా తప్పు చేస్తున్న వ్యక్తి, ఆత్మగౌరవంతో లేదా దానిపట్ల కలిగే అపరాధ భావంతో సిగ్గుచెందటం. అంటే, తాను చేసే చెడుపని ఇతరులకు తెలుస్తుందనే భీతి లేకపోయినా, తనకుతాను ఆత్మాభిమానంతో  సిగ్గుచెంది సదరు పనిని విరమించే గుణమే గొంకు. ఇక, జంకు అంటే, తప్పుడుపని చేస్తున్న వ్యక్తిలో కలిగే భయం; తాను తప్పుచేస్తే ఇతరులు తనను నిందిస్తారని లేదా దండిస్తారని లేదా తద్వారా భవిషత్తులో తనకు దుష్ఫలితం కలగవచ్చనే భయంతో (పాపభీతితో) ఆ పనిని విరమించటం. గొంకు, జంకు అనే వాటి మధ్య గల భేదం చాల సున్నితమైంది. అయినా, కొద్దిపాటి పరిశీలనతో వీటిమధ్య గల భేదాన్ని అర్థంచేసుకోవచ్చు.

పైన వివరించిన గొంకు, జంకు అనే గుణాలు మానవ జీవితానికి అవసరమైన అత్యంత మౌలిక విలువలని బుద్ధుడు ప్రకటించాడు; ఈ రెండు గుణాలు అడుగంటిన సమాజంలో, ఇతర మానవ విలువలన్నీ ధ్వంసమై, జీవితం దుర్భరంగా మారుతుందని ఆయన చెప్పాడు. బుద్ధుడు చెప్పిన ఈ విషయం వాస్తవమా, కాదా? అని నిర్ధారించటానికి కొద్దిపాటి పరిశీలన చాలు. నేటి సమాజంలో పెచ్చరిల్లుతున్న నేరాలు, అత్యాచారాలు, కుంభకోణాలు, కుట్రలు, ఘర్షణలు, మానవ సంబంధాలు విచ్ఛిన్నం కావటం వంటి సమస్యలను పరిశీలిస్తే, వీటి వెనుక గొంకు-జంకు అనే గుణాలు పూర్తిగా పతనమైన నేపథ్యం కనిపిస్తుంది. అందుకే, బుద్ధుడు వీటిని “లోకాన్ని రక్షించే రెండు ధర్మాల”ని అన్నాడు.

పంచశీల: ఐదు నైతిక నియమాలు

మానవీయ సమాజానికి అవసరమైన ఐదు ప్రాథమిక నియమాలను బుద్ధుడు బోధించాడు. అవి: (1) జీవహింస విరమించటం (2) తప్పుడుమాటలు విరమించటం (3) కామదురాచారాన్ని విరమించటం (4) దొంగతనాలు విరమించటం (5) మత్తుకలిగించే పానీయాలు పదార్థాల వాడకాన్ని విరమించటం. ఈ ఐదు నియమాలు మౌలికమైనవి మాత్రమే కాదు, వాటి మధ్య పరస్పర సంబంధం కూడ ఉంది. అంటే, పంచశీలలో ఒక నియమాన్ని అతిక్రమించిన వ్యక్తి, ఇతర నియమాల విషయంలో సులభంగా దారితప్పే అవకాశముంది. ఇందుకు భిన్నంగా, ఒకరు పంచశీలను పాటిస్తే అది ఆ వ్యక్తికే గాక, ఇతరులకు కూడ అపారమైన మేలు చేస్తుందని బుద్ధుడు చెప్పాడు.                       

సంఘీభావ సాధనాలు:

సమాజంలో మనుషుల మధ్య సంఘీభావం లేదా ఐకమత్యం పెంపొందటానికి అవసరమైన నాలుగు సాధనాలను బుద్ధుడు సూచించాడు. అవి: (1) దానగుణం (2) ప్రియమైన సంభాషణ (3) అర్థవంతమైన జీవనం (4) సమతాభావం. ఈ మాటల అర్థాలను క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిది – దానం అంటే కేవలం డబ్బు లేదా వస్తువులను ఇతరులకు దానంచెయ్యటం కాదు; మనుషుల మధ్య పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి సయితం దానగుణమే. ఇక, ఇతరులకు ధర్మం గురించి బోధించటం అన్నిటి కంటే గొప్ప దానమని బౌద్ధం చెబుతుంది. రెండవది – ప్రియమైన సంభాషణ అంటే, ఘర్షణకు దారితీసే రీతిలో గాక, మనుషుల మధ్య  స్నేహం సఖ్యత పెంపొందే రీతిలో మాట్లాడుకొనటం. మూడవది – అర్థవంతమైన జీవనం అంటే, ఎందుకూ కొరగాని విధంగా గాక, తనకు, ఇతరులకు ప్రయోజనం చేకూరే విధంగా జీవించటం. ఇక నాలుగవదైన సమతాభావం అంటే, మనుషుల మధ్య ఎటువంటి తారతమ్యాలు పాటించక, అందరూ సమానమే అనే భావంతో మెలగటం.      

పైన వివరించినవే గాక నిజాయితి, ధీరత్వం, ప్రజ్ఞ అనేవి కూడ మనిషికి అవసరమైన గుణాలని బుద్ధుడు చెప్పాడు. ఈ మౌలిక విలువల ఆధారంగా, ఆయన అనేక ఇతర మానవ విలువలను బోధించాడు. వాటన్నిటిని వివరించటం ఈ వ్యాసం పరిధికి మించిన విషయం. అసలు ‘మానవ విలువలు’ అనే అంశమే చాల విస్తృతమైన విషయం. అలాంటి విలువలను సంగ్రహంగా, సమగ్రంగా క్రోడీకరించి, ఆచరణకు అనువైన ప్రాధాన్యతా క్రమంలో కూర్పుచేసి ప్రజలకు అందించటంలో బుద్ధుడు అసమానమైన ప్రతిభను కనబర్చాడు. కనుక, మనం మానవ విలువల్ని అర్థంచేసుకోవాలన్నా, వాటిని ఆచరించాలన్నా, తద్వారా సరైన ప్రయోజనం పొందాలన్నా, వాటిని రూపొందించటంలో బుద్ధుడు అనుసరించిన దృక్పథాన్ని లోతుగా అర్థంచేసుకోవాలి.

బుద్ధుడు (పైన ఉదాహరించిన) మానవ విలువల్ని విడివిడిగా బోధించటానికి మాత్రమే పరిమితం కాలేదు. వాటిమధ్య గల పరస్పర సంబధాన్ని ఆయన పదేపదే నొక్కిచేప్పాడు. అంతేకాదు, మనిషిలో పరివర్తన కోసం పైపైన చేసే ప్రయత్నాలు సఫలం కావని, అందుకోసం హానికరమైన (అకుశల) మానసిక మూలాలను – దురాశ, ద్వేషం, అవిద్యలను – సమూలంగా తొలగించటం అవసరమని బుద్ధుడు చెప్పాడు.

పైపైన చూస్తే, బుద్ధుడు ‘మనిషి విరమించ వలసిన’ లేదా ‘మనిషిలో తొలగించ వలసిన’ ప్రతికూల ధర్మాల గురించి మాత్రమే బోధించినట్లు కనిపిస్తుంది. కాని, ఆయన ‘మనిషి ఆచరించ వలసిన’, ‘మనిషిలో పెంపొందించ వలసిన’ సానుకూల ధర్మాలను కూడ బోధించాడు. ఉదాహరణకు, దురాశకు మారుగా ఉదారత్వాన్ని, ద్వేషానికి మారుగా మైత్రిని, అవిద్యకు మారుగా వాస్తవిక జ్ఞానాన్ని పెంపొందించటం అవసరమని బుద్ధుడు నిరంతరం నొక్కిచెప్పాడు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, బుద్ధుని దృక్పథాన్ని లోతుగా గ్రహించని వారికి, ఆయన బోధించిన విలువలు ‘మామూలు నీతి సూత్రాల్లా’ కనిపించవచ్చు. వాస్తవానికి, బుద్ధుని దృష్టిలో మానవ విలువలు కేవలం ఒక ఆదర్శం కాదు. మానవ సమాజం దుర్భరం కాకుండా, మనుషులు నిజమైన సుఖసంతోషాలతో జీవించటానికి ఈ విలువలు నిరాకరించలేని ఒక అవసరంగా బుద్ధుడు భావించాడు. మరో రకంగా చెప్పాలంటే, వ్యక్తుల్లో మొదలయ్యే విలువల పతనం, అంతిమంగా సమాజంలో, మన అంచనాలకు అందని స్థాయిలో అభద్రతకు, భయానికి, విరోధానికి, ఘర్షణలకు, దుఃఖానికి దారితీస్తుందని బుద్ధుడు చెప్పాడు. అందుకే ఆయన, “మీకు, ఇతరులకు, ఇరువురికీ హాని చేస్తాయని తెలుసుకున్న ధర్మాలను తిరస్కరించండి; మీకు, ఇతరులకు, ఇరువురికీ మేలు చేస్తాయని తెలుసుకున్న ధర్మాలను అంగీకరించి, ఆచరించండి” అని పదేపదే నొక్కిచెప్పాడు.              

తన బోధనల్ని వినేవారి ప్రవర్తనలో, క్రమంగా, నిజమైన పరివర్తన కలిగే రీతిలో ఆయన బోధనలు సాగాయి.              

అచ్చమైన మానవ విలువలు:

మనం ఇంతవరకూ, బుద్ధుడు బోధించిన విలువల గురించి సంగ్రహంగా చెప్పుకున్నాం. మరి, వాటిని ఆధునిక అర్థంలో “మానవ విలువలు” అనటం సమంజసమేనా? అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

మొదటి విషయం: బుద్ధుని బోధనల్లో సృష్టికర్త లేదా దేవుని ప్రసక్తి లేదు. తాను బోధించిన విలువలు, మానవ జీవిత ధర్మాల అధ్యయన ఫలితమని బుద్ధుడు చెప్పాడు. కనుక, ఈ కోణంలో వాటిని “మానవ విలువలు” అనటం సబబే.

రెండో విషయం: బుద్ధుడు బోధించిన విలువలు, వాస్తవ జీవిత అనుభవాన్ని కార్య-కారణ సూత్రం ఆధారంగా శోధించి కనుగొన్నవని చెప్పబడ్డాయి. వాటిని మనం అనుభవమనే గీటురాయి మీద పరీక్షించి, వాటిలోని సత్యాన్ని నిర్ధారించటానికి అవకాశముంది. కనుక, అవి హేతుబద్ధమైనవి, శాస్త్రీయమైనవి. ఈ రకంగా కూడ వాటిని “మానవ విలువలు” అనటం సరైనదే.

మూడో విషయం: బుద్ధుడు బోధించిన విలువలు జాతి, మత, కుల, లింగ, ప్రాంతీయ భేదాలతో నిమిత్తం లేకుండా, మనిషిగా పుట్టిన అందరికి ఒకే రకంగా వర్తిస్తాయి. అందుకే, బుద్ధుని ధర్మాన్ని అన్ని కులాలకు, అన్ని జాతులకు చెందిన ప్రజలు ఆదరించారు; ఈ కారణంగానే, బౌద్ధం ప్రపంచంలోని అనేక దేశాలకు వ్యాపించి, నిజమైన విశ్వజనీన ధర్మం కాగలిగింది. కనుక, బుద్ధుడు బోధించినవి సార్వజనీన విలువలని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఈ కోణంలో కూడ బుద్ధుడు బోధించిన విలువలు “మానవ విలువలు” అని పిలవటానికి అర్హమైనవే.

పైన చెప్పుకున్న మూడు కారణాల ఆధారంగా, బుద్ధుడు బోధించిన విలువలను, ఆధునిక నిర్వచనం ప్రకారం, “అచ్చమైన మానవ విలువలు” అని పిలవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కనుక, వీటిని ఆచరించటం ద్వారా మనకు, ఇతరులకు, సమాజంలోని అందరికీ అమూల్యమైన ప్రయోజనం లభిస్తుందని ఆశించవచ్చు.   

[ఈ వ్యాసం 2022 బుద్ధజయంతి సందర్భంగా మిసిమి మాసపత్రికలో అచ్చయింది.]