అజాన్ బుద్ధదాస భిక్ఖు

[అజాన్ బుద్ధదాస (1906-93) థాయిలాండ్ దేశానికి చెందిన బౌద్ధభిక్షువు. ఆయన కొన్ని దశాబ్దాల క్రితం థాయి భాషలో అందించిన ఒక ఉపన్యాసాన్ని, 2019లో, అమెరికాకు చెందిన Donald K. Swearer అనే పండితుడు, The Right Action to be Truely Fully Human అనే శీర్షికతో ఇంగ్లీషులోకి అనువదించారు. దాని తెలుగు అనువాదమే మీరు చదవబోతున్న ఈ వ్యాసం. ఈ వ్యాసం చదివేవారు, ఇదొక ఉపన్యాస పాఠమని, దీనిలోని విషయాలు బౌద్ధంతో కొంత పరిచయమున్న విద్యావంతులను ఉద్దేశించి చెప్పబడ్డాయనే విషయాన్ని గమనించటం అవసరం.]       

ధర్మం అనే పదం చాల విలువైంది, దీని గురించి విస్తృతమైన చర్చ జరుగుతున్నది. ధర్మం సర్వోన్నతమైంది అనే భావం చాలమందిలో ఉంది. ధర్మం గొప్పది, అత్యున్నతమైంది, అత్యంత విలువైందని అనుకోకపోతే, దాని గురించి ఇంత విస్తృతమైన చర్చ జరగదు.

ధర్మాన్ని మీ జీవితంలో ముఖ్యమైన విషయంగా పరిగణించండి; అంటే, గానుగెద్దులా దాని చుట్టూ తిరగటం గాక, ఒక క్రమపద్ధతిలో ముందుకు సాగటానికి ప్రయత్నించండి. మనం ధర్మాన్ని అర్థంచేసుకోకుండానే సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మనం వాటిని లెక్కబెట్టుకుంటూ గడిపేస్తున్నాం. కాబట్టి, మీరు ధర్మం చుట్టూ గిరగిరా తిరిగటానికి మారుగా, దాన్ని మరింత స్పష్టంగా అర్థంచేసుకుని, ధర్మజ్ఞానంలో ముందుకు వెళ్ళగల విధంగా మీకు ధర్మం గురించి వివరిస్తాను.

ధర్మం అంటే ఏమిటి?

ధర్మం అంటే – మన జీవితపు అన్ని దశల్లో పరిపూర్ణ మానవునిగా ఉండటానికి మనం ఎటువంటి పనులు చెయ్యాలో, అటువంటి పనులు చెయ్యటం; ధర్మమంటే, ఒక మనిషిగా మనకున్న యోగ్యత లేక సమర్థతను సంపూర్ణంగా అందుకోవటం. గతంలో మీరు విన్నదానితో లేక నమ్మిన దానితో పోల్చిచూస్తే, ధర్మం గురించి ఇటువంటి అవగాహన మీకు వింతగా తోచవచ్చు. ధర్మాన్ని గ్రహించటం అంటే దాని గురించి “తెలుసుకోటం” మాత్రమే కాదు, సంపూర్ణమైన మనిషిగా జీవించటం అనే అర్థంలో, ధర్మాన్ని “ఆచరించటం” అంత్యంత ముఖ్యమైన విషయం. అంటే, అవగాహనకు ఆచరణను జోడించటం. మనిషి పురోగమించే ప్రతిదశలో, తన మానవతను అత్యున్నత స్థితికి చేర్చగల విధంగా ధర్మాన్ని ఆచరించటానికి అధ్యయనం అవసరం.

మన జీవితాన్ని బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే దశలుగా విభజించవచ్చు. మన జీవితపు ప్రతిదశలోను పూర్తి మానవ సామర్థ్యాన్ని అందుకోటానికి ప్రయత్నించాలి. “ధర్మం అంటే ఏమిటి?” అనే ప్రశ్నకు సరైన సమాధానం ఇదే. ముఖ్యమైన సూత్రం ఏమిటంటే, మనం ముందుకుసాగే ప్రతిదశలోను, పూర్తిస్థాయి మానవునిగా రూపొందటానికి మనం ప్రయత్నించాలి. మీరు మీ జీవితం గురించి సమీక్షిస్తూ, “జీవితపు ప్రతిదశలో పూర్ణ మానవునిగా వికసించే మార్గంలో పురోగతి సాధించానా, లేదా?” అని ఆలోచించండి; మీ బాల్యం నుండి పది, పదిహేను, ఇరవై, ముప్ఫై, యాభై లేదా అరవై ఏళ్ల వయసులో – ఇలా వివిధ దశల్లో మరింత వివరంగా పరిశీలించండి.

నిజాయితీగా, పరిశుద్ధమైన మనసుతో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. స్వార్ధంతో ఉండటం, స్వార్థపరుడిగా జీవించటం ధర్మం కాదు. ఊహలతో లేదా ఎవరో చెప్పారని గాక, మీరు ధర్మాన్ని ఒక మౌలిక జీవన సూత్రంగా అర్థంచేసుకోవాలి. ధర్మం విషయంలో “సరైన” అవగాహన గురించి ఎడతెగని వాదనలు జరుగుతున్నాయి. మనకు, ఇతరులకు ఉపయోగపడేదే “సరైనది” అనే గీటురాయితో ఇటువంటి చర్చలు ముగియాలి. అటువంటి ఉపయుక్తత లేకపోతే, మనం ధర్మాన్ని సరిగా అర్థంచేసుకున్నట్లు కాదు. “ఉపయోగం” అంటే, సంతోషం కలిగించటం, దుఖాన్ని పరిహరించటం, శాంతిని పెంపొందించటం.

సంతోషం అనేది ప్రశాంతమైన స్థితా లేక అలజడితో కూడినదా? …. ఒక్కక్షణం ఆగి ఆలోచించండి. సంతోషం అనేది, మనకు సరిపడా ఉన్నప్పుడు కలిగే సంతృప్తి వల్ల కలుగుతుందా, లేదా, ఇంకా ఇంకా కావాలనే ఆరాటం వల్ల లభిస్తుందా? ఇటువంటి ఆరాటం, అదుపులేకుండా రగులుతున్న దురాశ, ద్వేషం, భయం, అసూయ అనేవి పరితాపం (తీవ్రమైన మంట) కాదా? మనకు కలుగుతున్నది సంతోషమా లేక పరితాపమా? మీరు స్వయంగా పరిశీలించి నిర్థారించుకోండి.

వ్యక్తులు మరియు సమూహాల మధ్య పోటీ, పగ, ప్రతీకారం, అసూయ, ద్వేషం వల్ల నేటి ప్రపంచం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని కోణాల్లో నలిగిపోతున్నది. నేటి ప్రపంచంలో ఆనందం కరువైంది. మన వార్తాపత్రికలు ప్రపంచ వ్యాపితంగా పెచ్చరిల్లుతున్న యుద్ధాలు, ఘర్షణలు, పేదరికం, ఆందోళనతో కూడిన కథనాలతో నిండిపోతున్నయ్. వ్యక్తిగత స్థాయిలో ఇటువంటి పరిస్థితికి కారణం మానసిక రుగ్మత. అంటే, చిత్తశుద్ధి, బుద్ధికుశలత, ప్రశాంతత లేకపోవటం. ఇది భయం, ఆందోళనతో కూడిన తీవ్రమైన మానసిక రోగం. ఈ అలజడి, అశాంతి అనేవి మానసిక రోగాలతోపాటు, దీర్ఘకాలికమైన శారీరక రోగాలను కూడ తెచ్చిపెడతాయి.

మానసికంగా ఎదురయ్యే ఒడిదుడుకులకు, శారీరక రోగాలకు మధ్యగల సంబంధాన్ని మనం గుర్తించటంలేదు. ఆతురత, మానసిక వత్తిడి, తపన, ఆరాటం కారణంగా రక్తంలో కలిగే ఆటుపోట్లు, మన రోగనిరోధక శక్తిని కుంటుపరుస్తాయి. మానసిక జాడ్యాలే శారీరక రోగాలకు ప్రధానకారణం. అందుకు కారణం మనం ధర్మంతప్పి జీవించటమే. ధర్మజీవనం అలజడి, భయం, వత్తిడి తదితర మానసిక రుగ్మతలను దూరంచేస్తుంది; మానసిక సమతుల్యత వాటిని తొలగిస్తుంది.

ధర్మం అనేది మనసుకు మాత్రమే పరిమితమైన సంగతి కాదని, మనసు, శరీరం, వాటితో మనం సంపర్కం జరిపే విషయాలు అన్నీ ధర్మంలో భాగమనే విషయాన్ని మనం గుర్తించాలి. క్లుప్తంగా, ధర్మం అంటే జీవితంలోని అన్ని విషయాలతో సరైన రీతిలో వ్యవహరించటం, అదొక సంపూర్ణ జీవనశైలి: మనం తినే ఆహారం, కట్టుకునే బట్టలు, మాట్లాడే మాటలు, నివసించే పధ్ధతి … మొదలైనవి. అయితే, ధర్మాన్ని తెలుసుకోటం, ధర్మయుతంగా జీవించటం ఎలా?

మరోసారి గుర్తుచేస్తున్నాను – ధర్మం అంటే, మన జీవితంలోని ప్రతిదశలో, శరీరము, మాటలు, మనసుకు సంబంధించిన అన్ని విషయాల్లో అత్యున్నత మానవధర్మానికి అనుగుణంగా జీవించటం. కాని, ఆ మానవధర్మం ఏమిటో తెలుసుకోవటం ఎలా? …. ఎవరో చెబితే విని, దాన్ని అంగీకరించటం కాదు. దాన్ని ఆమోదించే ముందు, మనం ధర్మాన్ని నిశితంగా పరీక్షించాలి.

మానవధర్మం: ఐదు సూత్రాలు

ఇప్పుడు, ధర్మయుత జీవనానికి సంబంధించి ఆచరణ యోగ్యమైన ఐదు సూత్రాల గురించి మీకు వివరంగా చెబుతాను. అవి: 1) ఆత్మజ్ఞానం 2) ఆత్మవిశ్వాసం 3) ఆత్మనిగ్రహం 4) ఆత్మసంతృప్తి 5) ఆత్మగౌరవం. [ఇక్కడ, ఆత్మ అనే పదాన్ని, జీవాత్మ లేక పరమాత్మ అనే భావంలో కాకుండా, “వ్యక్తిగత” లేక “తన” లేక “స్వీయ” అనే భావంలో అర్థంచేసుకోవాలి.]

ఆత్మజ్ఞానం: మొదటి సూత్రం, తనగురించి తాను తెలుసుకోటం. నిజంగా మన (జీవితపు వివిధ దశల) గురించి మనకు తెలుసా? జీవిత చరమాంకానికి చేరిన పెద్దలకు తామేమిటో, తమ జీవితపు విలువ ఏమిటో తెలుసా? సతి-ప్రజ్ఞ లేకపోతే, ఎనభై  ఏళ్ళు పైబడిన వారికి కూడ (తమ గురించి తమకు) లోతైన అవగాహన ఉండదు. ఏ వయసులో ఉన్నాసరే, మన స్థితిని తెలుసుకోటానికి మనం గతంలోకి తొంగిచూడాలి. మన గతజీవితం నిరాశాపూరితంగా, మంచి చెడుల మధ్య సంఘర్షణగా కనిపిస్తుందా? మన జీవిత పరమార్థం గురించి, దాని దిశ గురించి ముందుచూపుతో ఆలోచిస్తున్నామా?

ఇటువంటి ఆలోచనల్ని మరీ సంక్లిష్టం చేసుకోవద్దు. “నేను ఎవరు?”, “పరిపూర్ణ మానవత అంటే ఏమిటో నాకు తెలుసా?” – ఇటువంటి సరళమైన ప్రశ్నలు తీసుకోండి. ఆడవారైనా లేక మగవారైనా, పిల్లలైనా లేక పెద్దలైనా, అందరూ ఆలోచించ దగిన మౌలిక ప్రశ్నలివి. మనం ఎవరమైనా సరే, పరిపూర్ణ మానవతను అందుకోవలసిన బాధ్యత మనదే. ధర్మయుతంగా, పరిపూర్ణ మానవునిగా జీవించే అవకాశాన్ని మనం జారవిడుచుకోవద్దు. ఈ అర్థంలో ధర్మాన్ని స్పష్టంగా గ్రహించటానికి సమున్నతమైన బుద్ధి, హృదయం అవసరం [దీని గురించి మరింత వివరణ కింది పేరాల్లో ఉంది]. ఇటువంటి మానసిక స్థితిని అందుకోలేని వ్యక్తి దుఃఖానికి లోనవుతాడు. కాని, దాన్ని అందుకున్న వ్యక్తి బుద్ధునివలె దుఃఖం నుండి విముక్తుడవుతాడు.

“బుద్ధుడు” అంటే “జ్ఞానోదయం పొందినవాడు”, “మేలుకున్నవాడు”, “అమితమైన ఆనందం పొందినవాడు” అనే అర్థాలున్నాయి. మేలుకోవటం అనేది శరీరాన్ని కుదపటం లేదా పెద్దశబ్దం వల్ల భయంతో ఉలిక్కిపడి లేవటం వంటిది కాదు. అజ్ఞానమనే నిద్ర నుండి మేలుకుని కళ్ళుతెరవటం. సాధారణ భాషలో నిద్రించటం, మేలుకోవటం అనే పదాలను భౌతిక భావంలో అర్థంచేసుకోటం పరిపాటి. కాని, ధమ్మభాషలో కళ్ళు మూసుకోవటం లేదా నిద్రించటం అంటే, అజ్ఞానంతో జీవించటం. అజ్ఞానం తొలగిపోవటమే మేలుకోవటం, జ్ఞానోదయం కలగటం. ఈ భావంలో మేలుకోవటం అనేది ప్రశాంతతకు, ఆనందానికి దోహదం చేస్తుంది.

ధార్మిక అర్థంలో మనం నిద్రనుండి మేల్కొని, మన అంతరంగం గురించి లోతైన సరైన పరిజ్ఞానం పొందితే, దుక్ఖాన్ని అధిగమించగలం, అపరిమితమైన ఆనందాన్ని సంతృప్తిని పొందగలం. బుద్ధత్వాన్ని పొందటమంటే – మేలుకొని, జ్ఞానోదయం కలిగి, పరిపూర్ణమైన ఆనందాన్ని పొందటమే.

ధర్మయుతంగా జీవించాలంటే ఆత్మజ్ఞానం (తన గురించి తాను తెలుసుకోవటం), ప్రజ్ఞ, సరైన దృక్పథం అవసరం. సరైన మనిషిగా ఎదగటం అంటే ఇదే. కనుక, మొట్టమొదటి విషయం – పరిపూర్ణ మానవునిగా రూపొందటం అనేది ఆత్మజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది.

ఆత్మవిశ్వాసం: రెండవది, మనం ఆత్మవిశ్వాసం కలిగివుండాలి. “తనపై తనకు విశ్వాసం ఉండటం” అనేది జటిలమైందే. బౌద్ధంలో “విశ్వాసం” లేక “నమ్మకం” అనేమాట తరచూ సూచించే అర్థం ఇది: “కర్మల ద్వారా తగిన పర్యవసానాలు కలుగుతాయి”, “బుద్ధుడు సంపూర్ణ జ్ఞానోదయం పొందాడు” అని విశ్వసించటం. కాని, ఇవి మాత్రమే చాలవు, వీటికి ఆత్మవిశ్వాసం అనేదాన్ని జోడించాలి. తనపై తనకు విశ్వాసం లేకపోతే, కర్మలోను, బుద్ధుని సంబోధిలోను విశ్వాసం కలగదు. సంపూర్ణ మానవునిగా ఎదగటం అనేదానిలో, తనపై తనకు నమ్మకం ఉండటమనేది ఒక మౌలిక అంశం. మనలోని మానవతను వృద్ధిచెయ్యటానికి ఆత్మవిశ్వాసం అవసరం, అంటే, “మనం పూర్తిస్థాయి మానవునిగా ఎదగగలమ”నే విశ్వాసం అవసరం. సందిగ్ధత, ఊగిసలాట, అస్పష్టత, అయోమయం – వీటన్నిటిని అధిగమించిన ఆత్మవిశ్వాసం మానవ వికాసానికి పునాదివంటిది.

ఆత్మనిగ్రహం: మూడవ అంశం, మనం ఆత్మనిగ్రహం, అంటే, స్వీయనియంత్రణ కలిగివుండాలి. ఆచరణ లేని ఆత్మవిశ్వాసం అసంపూర్ణం. క్రియాశీలమైన ఆచరణ లేకపోవటం ఒక మానసిక రుగ్మత. అత్యున్నత మానవ సామర్థ్యాన్ని పొందటానికి మనం చేసే ఆచరణలో, ప్రజ్ఞ ఉదయించి మానసిక రుగ్మత నిరోధమౌతుంది. ఆత్మనిగ్రహం, క్రమశిక్షణ అనేమాటల అర్థం ఇది: మానవ వికాసానికి ఆటంకమైన ప్రతికూల మానసిక రుగ్మతలను, సతి, ప్రజ్ఞ అనే సానుకూల శక్తులతో నిరోధించటం. ధర్మం అంటే, సంపూర్ణ మానవ సామర్ధ్యాన్ని పొందటం కోసం సంబోధి ద్వారా మానసిక రుగ్మతలను నిరోధించే ఆత్మనిగ్రహం. ఇక్కడ, ధర్మం అంటే మాలిమి చెయ్యటం లేక అదుపు చెయ్యటం. బుద్ధుడు మనకు ధర్మమార్గాన్ని బోధించాడు. అంతేకాదు, ఆ ధర్మాన్ని పొందటానికి అవసరమైన ఆత్మనిగ్రహానికి తానొక ఆదర్శంగా నిలిచాడు. ఆయన “మానవులను మాలిమిచెయ్యటం”లో అసమానమైన ప్రజ్ఞ కలవాడని చెబుతారు. అయినా, మనల్ని మనమే అదుపుచేసుకోవాలి, నిగ్రహించుకోవాలి. [ఈ పని బుద్ధుడు చేస్తాడని భావించటం సరికాదు].

మనం ప్రతిరోజు ప్రతిక్షణం మనల్ని మనం నిగ్రహించుకోవాలి. లేకపోతే మనం అనివార్యంగా తప్పులు చేస్తాం, అజాగ్రత్తతో దారితప్పుతాం, పతనావస్తకు చేరతాం. క్రమశిక్షణలో మజా లేదని అనుకోకండి, అది సంతృప్తిని కలిగిస్తుందని తెలుసుకోండి. క్రమశిక్షణతో మెలగకపోతే, మనం మందుకొట్టటం, పొగతాగటం వంటి రకరకాల హానికరమైన పనులు చేస్తాం. ఇవి మన శక్తిసామర్ధ్యాలను ధ్వంసం చేస్తాయి. క్రమశిక్షణతో మనపై మనం అదుపు సాధిస్తే, మనకు అవసరమైనవన్నీ లభిస్తాయి, మన జీవితాలు మెరుగవుతాయి, మనం సరైన దిశలో పయనిస్తాం.

మనల్ని మనం అదుపులో ఉంచుకోటం కష్టమైన, బాధాకరమైన పని అనుకోటం కద్దు. ఇష్టమొచ్చిన రీతిలో సరదాగా గడపకుండా, క్రమశిక్షణతో ఆత్మనిగ్రహం పాటించాలని నిర్ణయించుకోటానికి ఓర్పు, సహనం కావాలి. చాలామంది, పొగతాగే అలవాటు మానటం కోసం ఇక్కడికి [సుఆన్-మోక్ఖ ఆరామానికి] వస్తారు. కాని, ఆత్మనిగ్రహం లేకుండా ఎవరూ ఈ వ్యసనాన్ని వదల్లేరు. పొగతాగాలనే తపన రేకేత్తినప్పుడు, దాన్ని నిగ్రహించటానికి గట్టిగా ప్రయత్నించాలి. అప్పుడు, త్వరలోనే పొగతాగాలనే తపన చల్లారి, ఆ ఆరాటం నుండి విముక్తి లభిస్తుంది. పొగతాగటం, తాగి తందనాలాడటం, జూదమాడటం వంటి వ్యసనాలను మానటానికి, సోమరితనాన్ని, చెడు సహవాసాలను వదలటానికి ఆత్మనిగ్రహం చాల అవసరం. పరిపూర్ణ మానవునిగా వికసించటానికి, మన శక్తిసామర్థ్యాలను అందుకోటానికి అవరోధమయ్యే దురలవాట్లను మార్చాలంటే, క్రమశిక్షణతో కూడిన ఆత్మనిగ్రహం అవసరం. పరిపూర్ణ మానవతను పొందగలమని మనం బలంగా విశ్వశించాలి, ఆ విశ్వాసంతో పనిచెయ్యాలి.

మానసిక రుగ్మతల నుండి బయటపడటం కష్టమైన పనే, అందుకు తీవ్రమైన ప్రయత్నం అవసరం. కనుక, నిరంతరం నిలకడగా ప్రయత్నిస్తే, మనసును మాలిమి చెయ్యొచ్చు, మనల్ని మనం నిగ్రహించవచ్చు.

ఆత్మసంతృప్తి: ఆత్మజ్ఞానం, ఆత్మవిశ్వాసం, ఆత్మనిగ్రహం అనేవి ఆత్మసంతృప్తికి దోహదంచేస్తాయి. ఇక్కడ “సంతృప్తి” అంటే, ఆరాటం సమసిపోయి ప్రశాంతత నిండిన మానసికస్థితి అని అర్థం. ఈ అర్థంలో సంతృప్తి అనేది మనిషిగా పుట్టిన ప్రతిఒక్కరికి అవసరం.

సంతృప్తి స్వభావం ఏమిటి, సంతృప్తి కలిగించేది ఏమిటి? అనే విషయాలను పరిశీలిద్దాం. సంతృప్తి అంటే, మనలో ఎటువంటి సుగుణాలు లేకపోయినా, ఇంకా చెప్పాలంటే, మనలో రోతపుట్టించే గుణాలు ఉన్నాసరే, మనల్ని మనం ప్రేమించటం వల్ల కలిగేదా? …. ఇటువంటి బూటకపు ప్రేమ వలన కలిగే సంతృప్తి ఒకరకమైన మానసిక రుగ్మత. ఆత్మనిగ్రహం, చిత్తశుద్ధి ద్వారానే నిజమైన సంతోషం, సంతృప్తి కలుగుతాయి.

మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఎటువంటి తప్పు చెయ్యకుండా, దోషరహితంగా లేదా పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనలో సంతృప్తి అనే భావన కలిగినట్లు గుర్తించవచ్చు. అలాగే, సరైన కృషి వల్ల కలిగే సంతోషం సంతృప్తి కలిగిస్తుంది. సంతృప్తి కలిగించని సంతోషం ఒక భ్రమ. మనకు కోట్లకొలది డబ్బులున్నా, అది సంతృప్తిని కలిగించదు. సంతృప్తి, లేదా “ఉన్నదిచాలు” అనే భావన లేనప్పుడు, మనం ఇంకా ఇంకా కావాలనే ఆరాటంతో ఉంటాం. మన విషయంలో గాని, మన పిల్లలు, మన భార్య లేదా భర్త, మన ఆస్తులు లేదా మరో విషయంలో గాని, సంతృప్తి అనేది లేనప్పుడు మనం సంతోషంగా ఉండలేం. సంతోషం కోసం మరెక్కడో వెదకటం ఒకరకమైన మానసిక రుగ్మత. ఇది తప్పుడు పనులకు దారితీస్తుంది. తాగుడు, జూదం వంటి వ్యసనాలతో సంతోషం లభిస్తుందని భావించటం పిచ్చితనం; కోరికలతో, ఆరాటంతో రగిలిపోవటాన్ని సంతోషంగా భ్రమించినదువల్ల కలిగే ఫలితమిది. పరిపూర్ణ మానవునిగా జీవించటమంటే, సంతృప్తి ద్వారా లభించే సంతోషాన్ని పొందటమే. సంతృప్తి ఉన్నప్పుడు సంతోషం దానంతటదే జనిస్తుంది. దీనిగురించి చర్చలు వాదోపవాదాలు చెయ్యవలసిన అవసరం లేదు.

మనం చేసేపని ఏదైనా – వీధులు ఊడ్చటం, అంట్లుతోమటం, బట్టలు ఉతకటం లేక మరేదైనా – దాన్ని తృప్తితో చేసినప్పుడు, అప్పటికప్పుడే మనలో ఆనందం జనించే అవకాశముంది. ఇటువంటి తృప్తికరమైన భావన, హృదయంలో జనించే సంతృప్తి మానవ జీవితపు మౌలికసూత్రం. ఈ సూత్రానికి లేదా ధర్మానికి అనుగుణంగా నడుచుకుంటే, మనం పరిపూర్ణ మానవునిగా జీవిస్తున్నట్లు.                          

ఈ సమావేశంలో చాలమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. చదువు చెప్పటం ఒక గౌరవమైన వృత్తి, అదొక పుణ్యకార్యం. ఎందుకంటే, ఉపాధ్యాయులు సమాజాన్ని నిర్మిస్తారు. సమాజ భవిషత్తు ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంటుంది. వారు విద్యార్థులకు నిజాయితిని, న్యాయాన్ని, ధర్మాన్ని బోధిస్తే, వారు మంచి పౌరులుగా ఎదుగుతారు; మేలైన, సుఖసంతోషాలతో కూడిన సమాజాన్ని నిర్మిస్తారు. ఉపాధ్యాయులు ఇందుకు విరుద్ధంగా నడుచుకుంటే సమాజం పతనావస్తకు చేరుతుంది.

ఆత్మగౌరవం: ధర్మయుత జీవనానికి ఉపకరించే ఐదవ సూత్రం ఆత్మగౌరవం. ఇక్కడ కూర్చున్న ప్రతిఒక్కరు, దయచేసి, మీకుమీరే గౌరవంతో నమస్కరించండి. ఇలా సూటిగా అడుగుతున్నందుకు మరోవిధంగా భావించొద్దు, నిజంగా మీకు మీపై తగిన గౌరవం ఉందా? ఈ విషయంలో మీకు సందేహం ఉన్నట్లయితే, మీరు మనిషిగా వికసించలేరు. కాని, సావధానంగా జాగ్రత్తగా ఆలోచించండి, మీరు నిజంగా గౌరవ వందనానికి అర్హులనే సంగతి మీకు బోధపడుతుంది. ఆత్మగౌరవం వలన కలిగే సంతృప్తి సంతోషానికి, మానవ వికాసానికి దోహదంచేస్తుంది.

ముగింపు:

నిజమైన మానవతకు దోహదంచేసే ఐదు సూత్రాలను మరోసారి గుర్తుచేసుకుందాం. 1) ఆత్మజ్ఞానం 2) ఆత్మవిశ్వాసం 3) ఆత్మనిగ్రహం 4) ఆత్మసంతృప్తి 5) ఆత్మగౌరవం. ఈ ఐదూ బుద్ధుని ధర్మంలో మౌలిక సూత్రాలు. వీటిని పాలి భాషలో చెప్పొచ్చు. కాని, పాలి పదాలను గుర్తుంచుకోటం కష్టం కనుక, నేను వాటిని వాడటంలేదు.

ఇక్కడున్న విద్యార్థులను ఉపాద్యాయులను నేను కోరేదేమంటే, విద్యను కేవలం ఒక సాంకేతిక శిక్షణగా చూడవద్దు, దాన్ని మానవజాతి వికాసానికి దోహదంచేసే “ధర్మ-అధ్యయనం”గా పరిగణించండి. మీకు చాల పుస్తకజ్ఞానం ఉండొచ్చు, మంచి ఉద్యోగం రావచ్చు, మీరు గొప్ప ధనవంతులు కావచ్చు. కాని, మీలోవున్న లోతైన మానవతను అందుకోటంలో విఫలమైతే, మీకు నిజమైన విలువ ఉండదు. గంభీరమైన, ధార్మిక విలువ కలిగిన విద్య ఆత్మజ్ఞానం, ఆత్మవిశ్వాసం, ఆత్మనిగ్రహం, ఆత్మసంతృప్తి, ఆత్మగౌరవం అనే ఐదు సూత్రాలను నేర్పుతుంది. తమ విద్యార్థుల్లో ఈ విలువల్ని పెంపొందించే ఉపాధ్యాయులు నిజంగా ప్రశంసకు యోగ్యులే. వారు బుద్ధుని ప్రతిరూపాలు. అందరూ తమ సంపూర్ణ మానవతను అందుకోవాలనే ఉద్దేశంతో బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు. తమ విద్యార్థులు ఈ లక్ష్యాన్ని చేరుకోటానికి సహకరిస్తున్న ఉపాధ్యాయులు బుద్ధుని ఋణం తీర్చుకుంటున్నట్లే.

ఈ ఐదు సూత్రాలు మనం ధర్మాన్ని చేరుకొనే సాధనాలు. ఈ ప్రసంగం ప్రారంభంలో, “ధర్మం అంటే ఏమిటి? అని మిమ్మల్ని అడిగాను. ఆ ప్రశ్నకు ఇప్పుడు మనం సమాధానం చెప్పగలం. ధర్మం అంటే ఈ ఐదు సూత్రాలను ఆచరించటం, తద్వారా మనం నిజమైన మానవతను అందుకోవటం. మానవులుగా మనలోని సంపూర్ణ సామర్థ్యాన్ని అందుకోవటం అంటే బుద్ధునిగా మారటమే.

బుద్ధుడు ఇలా చెప్పాడు: “ఎవరు ధర్మాన్ని దర్శిస్తారో వారు తథాగతుణ్ణి (బుద్ధుణ్ణి) దర్శిస్తారు; ఎవరు తథాగాతుణ్ణి దర్శిస్తారో వారు ధర్మాన్ని దర్శిస్తారు.” ఈనాడు మనకు ధర్మం ఉంది, అంటే బుద్ధుడు ఉన్నాడు. మనం ఎవరిమైనా సరే, ధర్మాన్ని అందుకోగలిగితే మనమే బుద్ధుని ప్రతిరూపాలం; మనలోని పరిపూర్ణ మానవతను అందుకోవటం అంటే బుద్ధత్వాన్ని పొందటమే.

(మిసిమి, మే 2021, బుద్ధజయంతి సంచిక సౌజన్యంతో)                                            

తెలుగుసేత: డి. చంద్రశేఖర్