బుద్ధుని బోధనల్లో “శ్రద్ధ” అనే భావన చాల కీలకమైంది. శ్రద్ధ అంటే ఆసక్తి, జాగ్రత్త, గౌరవం అనే అర్థాలు వాడుకలో ఉన్నాయి: శ్రద్ధగా వినటం అంటే, ఆసక్తితో జాగ్రత్తగా వినటం; శ్రద్ధాంజలి అంటే గౌరవంతో నమస్కరించటం. కాని, ధార్మిక విషయాల్లో “శ్రద్ధ” అంటే బలమైన ‘విశ్వాసం’ లేదా ‘నమ్మకం’ అనే అర్థం వాడుకలోవుంది. అటువంటప్పుడు, ఇది దేని మీద నమ్మకం లేదా ఎవరి మీద నమ్మకం? అనే ప్రశ్న తలెత్తటం సహజం. ఈ ప్రశ్నకు బుద్ధవచనం చెబుతున్న సమాధానం ఏమిటో తెలుసుకుందాం.

మన జీవితంలో ఎదురవుతున్న దుఃఖాన్ని లోతుగా అర్థంచేసుకోటానికి, దాన్ని సమూలంగా నివారించటానికి, ధర్మమే సరైన సాధనం అనే గట్టి విశ్వాసం కలగాలి. అటువంటి ధర్మాన్ని కనుగొని, మనకు సుబోధకంగా అందించిన వ్యక్తి (బుద్ధుని) పట్ల నమ్మకం కుదరాలి; ఆయన ధర్మాచరణకు ప్రతిరూపంగా జీవించాడని, అలాంటి జీవితం ధర్మాచరణకు ఒక ప్రమాణం లేదా ఆదర్శం అనే బలమైన విశ్వాసం పెంపొందాలి. దీని కొనసాగింపుగా, ధర్మానికి ప్రతినిధిగా జీవిస్తున్న శ్రావక ‘సంఘం’ పట్ల కూడా తగిన నమ్మకం కలగాలి. క్లుప్తంగా చెప్పాలంటే బుద్ధ, ధమ్మ, సంఘం – ఈ మూడింటి పట్ల సుస్థిరమైన విశ్వాసం నెలకొనటమే శ్రద్ధ అని బుద్ధవచనం చెబుతుంది.

అయితే, నమ్మకం, విశ్వాసం అనే మాటలు వినగానే కొందరికి, ముఖ్యంగా హేతు దృష్టిని అనుసరించే వారికి, ప్రముఖ మతాలు చెబుతున్న ‘శుద్ధ-విశ్వాసం’ గుర్తుకొస్తుంది. అంటే, సరైన ఆలోచన లేదా తగిన పునాది లేకుండా, కేవలం భయంతో లేదా భక్తితో కలిగే విశ్వాసం ఇది. దీన్ని గుడ్డినమ్మకం లేదా అంధవిశ్వాసం అని పిలవటం పరిపాటి. అయితే, బుద్ధుడు చెప్పిన శ్రద్ధ ఇటువంటి అంధవిశ్వాసం కాదు. ఎందుకంటే, అహేతుకమైన శ్రద్ధను (అమూలికా-సద్ధ) బుద్ధుడు తిరస్కరించాడు [మధ్యమనికాయ 95.13]; శ్రద్ధ హేతుబద్ధంగా (ఆకారావతి-సద్ధ) ఉండాలని చెప్పాడు [మ.ని. 60.4]; అలాగే, సంప్రదాయం పేరుతో చాలమంది అనుసరిస్తున్నారని, లేదా ప్రసిద్ధ గ్రంథాల్లో చెప్పబడిందని, లేదా కేవలం గురువు మీద గౌరవంతో ఒక విషయాన్ని సత్యంగా స్వీకరిచటం సరికాదని బుద్ధుడు బోధించాడు [కాలామసుత్తం, అంగుత్తరనికాయ 3:65].

అంతేకాదు, ఈ విషయాన్ని మరింత నొక్కి చెబుతూ, తనను కూడ నిశితంగా పరిశీలించమని బుద్ధుడు తన శిష్యులను కోరాడు. “తథాగతుని (బుద్ధుని) ప్రవర్తన ద్వారా లేదా మాటల ద్వార, అతనిలో రాగ ద్వేష మొహాలు వ్యక్తమౌతున్నాయేమో పరిశీలించమ”ని బుద్ధుడు భిక్షువులకు సూచించాడు [మ.ని. 47.4]. మనకు తెలిసిన చరిత్రలో, బుద్ధుడు తప్ప వేరొక ప్రవక్త ఎవరూ ఇలాంటి ప్రేరణ ఇవ్వలేదని ప్రముఖ బౌద్ధ పండితుడు వల్పోల రాహుల అన్నారు.

ఇవన్నీ శ్రద్ధ గురించి బుద్ధుని వైఖరిని తెలియజేసే విషయాలు.

*          *          *

ఆధునిక కాలంలో, శ్రద్ధ లేదా విశ్వాసం గురించి తరచూ రెండు పరస్పర విరుద్ధమైన వైఖరులు కనిపిస్తాయి. ఒకటి: శ్రద్ధ అంటే కేవలం విశ్వాసం లేదా నమ్మకం అనుకుని, పరిశీలన లేకుండా గుడ్డిగా అనుసరించే వైఖరి; ఇది వివిధ మతాలకు చెందిన ప్రజలు అవలంబించే ఆచారాలు, పూజలు, తంతులు, తాయెత్తులు, భజనలు, ముహూర్తాలు, వాస్తు, జాతకాలు మొదలైన వాటిలో కనిపిస్తుంది. రెండవది: శ్రద్ధ అంటే అంధవిశ్వాసం మాత్రమే అనుకుని, దానిని పూర్తిగా ఖండించి నిరాకరించే వైఖరి; ఇది సాధారణంగా నాస్తికులు, హేతువాదులు, మానవవాదులు, మార్క్సువాదులు అనుసరించే వైఖరి.

ఈ రెండు అతివాదాలకు భిన్నంగా బౌద్ధం, మనిషికి శ్రద్ధ చాల అవసరమైన గుణమని, అయితే దానికి హేతుబద్ధ పునాది ఉండాలని చెబుతుంది. ఇటీవలి కాలంలో బౌద్ధం పట్ల ఆసక్తి చూపుతున్న వారికి, ఏదో ఒక రూపంలో హేతుబద్ధ వైఖరి నేపధ్యంగా ఉండటం ఒక వాస్తవం. ఇందుకు కారణం, బుద్ధుని బోధనల్లో హేతుబద్ధత ఉందని వారు అనుకోవటం. అయితే, ఇలా బౌద్ధం వైపు వచ్చినవారు, చాలమంది, బుద్ధుని ధర్మంలో శ్రద్ధకు గల ప్రాధాన్యతను సరిగా గుర్తించటం లేదనిపిస్తుంది. అంతేగాక, బౌద్ధం చెప్పే శ్రద్ధను స్థూలంగా అంగీకరించేవారు సయితం, దాని అంతరార్థాన్ని లోతుగా గ్రహించటం అవసరం. అప్పుడు మాత్రమే మనం దాన్నుండి సరైన ప్రయోజనం పొందగలం. కనుక, ధర్మాచరణలో శ్రద్ధకు గల ప్రాధాన్యతను కొంచెం వివరంగా తెలుసుకుందాం.

ప్రతిరోజు అనేక విషయాలు మనకు తారసపడుతుంటాయి; అయితే, వాటన్నిటిని మనం లోతుగా పరిశీలించే పనికి పూనుకోం. వాటిలో ఎంతో కొంత ఆసక్తి కలిగించే, లేదా ఏదో రకంగా విలువైనదని భావించే విషయాలను మాత్రమే మనం పరిశీలిస్తాం. ఒక విషయం పట్ల మనకు ఆసక్తి కలగటానికి లేదా దాని విలువను గుర్తించటానికి వెనుక, అస్పష్టంగానైనా ఒక కారణం ఉంటుంది. దానిపై మనసు నిలిపి కొంత ఆలోచన చేసినప్పుడు, అది నిజంగా విలువైనదని భావిస్తే, ఆ విషయాన్ని పరిశీలించి, లోతుగా అర్థంచేసుకోటానికి ప్రయత్నిస్తాం. అంటే సదరు విషయంలో మనకు శ్రద్ధ కలిగిందన్నమాట. శ్రద్ధతో పరిశీలించిన విషయంపై అవగాహన పెంపొందుతుంది. అప్పుడు, అలా పొందిన జ్ఞానాన్ని మన జీవితంలో ఉపయోగించటానికి, దానికి అనుగుణంగా మన ప్రవర్తనను మలచుకోటానికి ప్రయత్నిస్తాం. మనిషి తన జీవితంలో బుద్ధిపూర్వకంగా నేర్చుకునే ప్రతి విషయంలోనూ ఈ ప్రక్రియను మనం గమనించవచ్చు. (తగిన ఆలోచన, పరిశీలన లేకుండా కలిగే విశ్వాసం ఇందుకు పూర్తిగా భిన్నమైనది).

పైన వివరించిన శ్రద్ధ గురించి బుద్ధుడు ఏమి చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక సందర్భంలో, కాపఠిక అనే యువకునితో చర్చిస్తూ బుద్ధుడు ఇలా అన్నాడు: “ఒక గృహస్తుడు ఒకానొక గురువు వద్దకు వెళ్ళి, అతనిలో ‘దురాశ, ద్వేషం, మోహం మూలకంగా తలెత్తిన గుణాలు ఏవైనా ఉన్నాయేమో’నని నిశితంగా గమనిస్తాడు. ఎందుకంటే, ఇటువంటి గుణాలు కలిగిన గురువు, తనకు తెలియని విషయాలను ‘నాకు తెలుసు’ అని, తాను దర్శించని విషయాలను ‘నేను దర్శించాను’ అని చెబుతాడు; అటువంటి గురువు దీర్ఘకాలం హాని, దుఃఖం కలిగించే పనులు చెయ్యమని ప్రేరేపించవచ్చు; ఇందుకు భిన్నంగా – తనలో దురాశ, ద్వేషం, మోహం మూలకంగా తలెత్తిన గుణాలు లేని గురువు, దీర్ఘకాలం హిత సుఖాలను కలిగించే సద్ధర్మాన్ని బోధిస్తాడు. కనుక, దుర్గుణాలను త్యజించిన గురువు చెప్పే బోధనలు విన్నప్పుడు, ఆ గురువు పట్ల గృహస్తునికి శ్రద్ధ కలుగుతుంది. అప్పుడు అతడు, ఆ గురువు బోధించిన ధర్మాన్ని చక్కగా ఆలకించి, మనసులో ధరిస్తాడు. అలా ధరించిన ధర్మాన్ని లోతుగా పరిశీలిస్తాడు. అలా పరిశీలించిన మీదట, అతనిలో ధర్మం పట్ల అవగాహనతో కూడిన ప్రీతి జనిస్తుంది. ….”    

పైన ఉటంకించిన ఉపదేశంలో – శ్రద్ధ వలన ధర్మాన్ని ఆలకించటం, ఆలకించిన ధర్మాన్ని మనసులో ధరించటం, దాని ద్వారా పరిశీలన, పరిశీలనతో ప్రయత్నం, ప్రయత్నం వలన నిశిత పరిశీలన, తద్వారా ఉత్సాహం, ఉత్సాహం వలన గాఢమైన అభిలాష, అభిలాష వలన ధర్మనిరతి మొదలైన సోపానాలను బుద్ధుడు వివరించాడు [మ.ని. 95]. దీనిప్రకారం, ధర్మాన్ని అవగాహన చేసుకొని ఆచరించే క్రమంలో శ్రద్ధ తొలిమెట్టు అని తెలుస్తుంది.

ఇలా ధర్మాచరణలో (లేదా మనం చేసే మరొక పనిలో గాని) శ్రద్ధ నిర్వహించే కీలక పాత్ర గురించి స్థూలంగా తెలుసుకున్నాక, దాని ప్రాముఖ్యత గురించి బుద్ధవచనం చెబుతున్న ఇతర విషయాలను ఒకసారి పరికించి చూద్దాం.

అత్యున్నత జ్ఞానమైన “బోధి”ని పొందటానికి ఉపకరించే ఐదు మానసిక శక్తుల్లో మొదటిది శ్రద్ధ అని బుద్ధవచనం చెప్పింది; మిగతా నాలుగు: వీర్య, సతి, సమాధి, ప్రజ్ఞ [సంయుక్త నికాయ 48:51]. అంటే, ప్రజ్ఞ అనే శిఖరాన్ని చేరటానికి చేసే ప్రయత్నంలో తొలిమెట్టు శ్రద్ధ అని తెలుస్తుంది. అలాగే, సాధకుడు తొలగించుకో వలసిన ఐదు మానసిక బలహీనతల్లో మొదటిది శంక లేక సంశయం అని బుద్ధుడు చెప్పాడు [మ.ని. 16]. సంశయాన్ని తొలగించటం అంటే శ్రద్ధను వృద్ధి చెయ్యటమే. ఇక, “శ్రద్ధ సాధకుని సహవాసి కాగా, ప్రజ్ఞ శ్రద్ధకు మార్గదర్శి” అని చెప్పబడింది [సం.ని. 1:58]. ఇవన్నీ ధర్మాచరణలో శ్రద్ధకు గల ప్రాధాన్యతను నొక్కిచెప్పే విషయాలు.

అయితే, శ్రద్ధ అనేది ఒక్కసారిగా పొందే స్థిరమైన ధాతువు లేక మానసిక స్థితి కాదు; అది సాపేక్షం. అంటే, అది క్రమంగా ఎదిగే లక్షణం కలది;  అందుకే బుద్ధవచనంలో శ్రద్ధ జనించటం, శ్రద్ధ వృద్ధి చెందటం, శ్రద్ధ స్థిరపడటం అనే భావనలు వాడుకలో ఉన్నాయి; అత్యంత ఉన్నతమైన శ్రద్ధను బౌద్ధ గ్రంథాలు ‘అచంచల విశ్వాసం’ (అవేచ్చప్పసాద) అని పిలిచాయి. మరో కోణంలో చూస్తే, ఒక వ్యక్తిలో ఒకసారి కలిగిన శ్రద్ధను వృద్ధి చెయ్యటానికి, దాన్ని పరిపూర్ణం చెయ్యటానికి తగిన ప్రయత్నం జరగకుంటే, తరువాత అది క్రమంగా బలహీనపడి, పూర్తిగా అడుగంటిపోయే స్థితి కూడ తలెత్తవచ్చని తెలుస్తుంది.    

కనుక, మనలో ఒకసారి శ్రద్ధ కలిగినంత మాత్రాన, అది పూర్తిస్థాయి శ్రద్ధ అనుకుని ఉపేక్ష వహించటం సరికాదు. ధర్మాన్ని ఆచరించేవారు శ్రద్ధను వృద్ధి చేసుకోటానికి నిరంతర ప్రయత్నం అవసరం. మరి, అలాంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు, మనలో శ్రద్ధ వృద్ధి చెందుతుందనే విషయాన్ని గుర్తించటం ఎలా? అనేది ఒక జటిలమైన సమస్య. కాని, కొద్దిపాటి గమనికతో, అభ్యాసంతో మనం ఈ సమస్యకు సమాధానం తెలుసుకోవచ్చు. అదెలాగో చూడండి.

ఆధునిక మనోవిజ్ఞాన రంగానికి చెందిన ‘గెస్టాల్ట్ థెరపీ’ అనే విధానం, మనం చర్చిస్తున్న సమస్యకు ఒక పరిష్కారాన్ని సూచించింది: మనం ఒక విషయాన్ని అధ్యయనం చేస్తున్న సమయంలో లేదా ఒక అనుభవాన్ని పొందుతున్న సమయంలో, మన హృదయపు లోతుల్లో “ఆ…హా…” అనే ప్రగాఢమైన అనుభూతి కలిగితే, సదరు అంశం లేదా అనుభవం మన అవగాహనలో అంతర్భాగం అయిందని అనుకోవచ్చు. అంటే, ఆ అనుభవం చాల విలువైనదనే భావన మనలో స్థిరంగా పాదుకొన్న దనటానికి అలాంటి ‘ఆహా’ అనుభూతి ఒక చక్కటి సంకేతం. సరిగ్గా ఇదే రీతిలో శ్రద్ధను వ్యక్తం చేసిన సందర్భాలు బౌద్ధ గ్రంథాల్లో చాల కనిపిస్తాయి. ఈ విషయమై కొన్ని ఉదాహరణలు చూద్దాం.

కోసల రాజు ప్రసేనజిత్ భార్య మల్లికాదేవికి బుద్ధుని పట్ల గాఢమైన శ్రద్ధ ఉండేది. ఈ విషయం తెలిసిన ప్రసేనజిత్, ‘బుద్ధుడు ఏమి చెప్పినా గుడ్డిగా తలాడించే’ శిష్యురాలని ఆమెను గెలిచేసేవాడు. అయితే, ఒక రోజు మల్లికాదేవి ‘ప్రియమైన వాటి కారణంగానే దుఃఖం కలుగుతుంద’ని బుద్ధుడు చెప్పిన విషయాన్ని, మహారాజుకు హేతుబద్ధంగా వివరిస్తుంది. అప్పుడు ప్రసేనజిత్, “ఆశ్చర్యం మల్లికా, అద్భుతం! భగవానుడు ఈ విషయాన్ని ప్రజ్ఞతో ఎంత లోతుగా దర్శించాడు!” అంటూ, వెంటనే తన ఆసనం నుండి లేచి నిలబడి, బుద్ధుడు బసచేసివున్న జేతవనం వైపు తిరిగి, చేతులు జోడించి, “నమోతస్స భగవతో అరహతో సమ్మాసంబుద్ధస్స” అంటూ మూడుసార్లు వందనం ఆచరించాడు [మ.ని. 87.29]. ఇది శ్రద్ధను వ్యక్తంచేసే ఒక పద్ధతి.             

ఇంకొక ఉదాహరణ – శ్యాక్య వంశస్తుడైన రాకుమారుడు భద్దియ, తాను భిక్షువుగా మారిన తొలిరోజుల్లో, తరచూ “అహో సుఖం … అహో సుఖం” అంటూ గట్టిగా పలవరించేవాడు. ఈ పలవరింతలు విని అతని తోటి భిక్షువులు, భద్దియ ‘ గతంలో తాను పొందిన రాజరికపు సుఖాలను తలుచుకుని అలా పలవరిస్తున్నాడ’ని అనుకున్నారు. వారు బుద్ధుని వద్దకు వెళ్ళి, ఆ విషయం తెలియజేశారు; అప్పుడు బుద్ధుడు భద్ధియను పిలిచి, దాని గురించి ప్రశ్నించాడు. అప్పుడు భద్దియ, “నేను రాజకుమారునిగా ఉన్నప్పుడు, నా నివాసం చుట్టూ రాజభటులు ఆయుధాలతో కాపలా ఉండేవారు, అయినా, శత్రువులు దాడిచేసి చంపుతారనే ఆందోళనతో నేను నిద్రలేని రాత్రులు గడిపేవాడిని. కాని, ఇప్పుడు (భిక్షువునై) ఆరుబైట చెట్లకింద ఒంటరిగా జీవిస్తున్నా, నాకు ఎటువంటి భయము ఆందోళన కలగటంలేదు. నాకు కలిగిన ఈ శుభ పరిణామాన్ని తలచుకుని నేను ‘అహో సుఖం … ఆహో సుఖం’ అని పలవరిస్తున్నాను” అంటూ బదులిచ్చాడు. దీనినిబట్టి, ‘అహో సుఖం’ అని పలికిన సందర్భాల్లో, భిక్షువు భద్దియకు ధార్మిక జీవితం పట్ల శ్రద్ధ ఇనుమడించిందని చెప్పవచ్చు.

మరో ఉదాహరణ – బుద్ధుని ఉపదేశాలను వినిన శ్రోతలు, “అద్భుతం భంతే, అద్భుతం! తలకిందులైన దానిని నిటారుగా నిలిపినట్లు, మరుగున పడినదాన్ని బహిర్గతం చేసినట్లు, దారితప్పిన వానికి దోవ చూపినట్లు, చూపున్నవారు చూడగల విధంగా అంధకారంలో వెలుగుదివ్వె పట్టినట్లు – పరిపరి విధాలుగా భగవానుడు ధర్మాన్ని వివరించారు” అంటూ తమ అభినందనను తెలియజేసినట్లు బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి. అంటే, వారిలో బుద్ధుని పట్ల, ప్రత్యేకించి, ఆయన బోధించిన విషయం పట్ల శ్రద్ధ జనించిందని చెప్పటానికి ఇదొక ప్రబల నిదర్శనం. ధర్మాన్ని వినిన శ్రోతలు బుద్ధుని పట్ల, ధర్మం పట్ల తమకు కలిగిన శ్రద్ధను ఇలా వ్యక్తం చేసిన వందలాది సందర్భాలు బౌద్ధ గ్రంథాల్లో నమోదయ్యాయి.

పరిశీలించి చూస్తే, ఆధునిక మనోవిజ్ఞానం చెబుతున్న “ఆ…హా…” భావన, శ్రద్ధను వ్యక్తం చెయ్యటానికి బౌద్ధ గ్రంథాల్లో కనిపించే “అహో సుఖం”, “అద్భుతం” అనే భావనలు దాదాపు ఒకటేనని తెలుస్తుంది.  

ఇంతవరకూ చెప్పుకున్న విషయాలను బట్టి, ధర్మాచరణలో శ్రద్ధ ఎంత కీలకమైన పాత్ర నిర్వహిస్తుందో అర్థం చేసుకోవచ్చు. శ్రద్ధ లేకుండా ధర్మాన్ని అవగాహన చేసుకోవటం, సరైన ఫలితం పొందగలిగే రీతిలో ధర్మాన్ని ఆచరించటం సాధ్యంకాదని తెలుస్తున్నది. మనలో ఒకసారి ఏర్పడిన శ్రద్ధ, అలాగే నిలిచిపోయే స్థిరమైన ధాతువు కాదని కూడ చెప్పుకున్నాం. కనుక, శ్రద్ధను వృద్ధి చెయ్యటానికి మనం నిరంతరం ప్రయత్నించాలి. అందుకోసం ఒక సరళమైన దినచర్యను పాటించటం అవసరం. శ్రద్ధ పెంపొందటానికి, ధమ్మవచనాన్ని చదవటం (లేదా వినటం), వీలైన సమయంలో దానిపై మిత్రులతో చర్చించటం, ఏకాంత సమయాల్లో ధమ్మాన్ని మననం చేసుకోవటం, క్రమబద్ధమైన ధ్యానసాధన, ప్రతి పనిని ధమ్మం వెలుగులో చెయ్యటానికి చిత్తశుద్ధితో ప్రయత్నించటం – అనేవి సాధకుని దినచర్యలో అంతర్భాగంగా ఉండాలని బుద్ధవచనం చెబుతున్నది.

పైన పేర్కొన్న వాటిని ఆచరించే సందర్భాల్లో, మనలో ఎప్పుడైనా ‘ఆ…హా… అద్భుతం’ అనే భావన కలిగితే, అప్పుడు మనలో శ్రద్ధ ఒక ముందడుగు వేసిందని గుర్తించాలి. మనం కొత్తగా ఒక విషయాన్ని తెలుసుకున్న కారణంగా, లేదా మనకు తెలిసిన ఒక విషయంలోని సత్యాన్ని సాక్షీభూతంగా దర్శించిన కారణంగా, మనలో ఉల్లాసంతో కూడిన ప్రీతి జనిస్తుంది; అది సహజంగానే మనలో శ్రద్ధను వికసింపజేస్తుంది. కనుక, అటువంటి అనుభవం కలిగినప్పుడు, అది వెంటనే చెదిరిపోకుండా దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ, తగినంత సమయం ఆ అనుభూతిలోనే గడపటానికి ప్రయత్నించాలి. మనలో ఇటువంటి అనుభూతి పట్ల సతి (గమనిక, జ్ఞాపకం) బలపడేకొలది, మనం అటువంటి అనుభవాలను తరచూ పొందగల అవకాశాలు పెరుగుతాయి. అంటే, మనలో శ్రద్ధ వృద్ధి చెందటానికి గల అవకాశాలు మెరుగౌతాయి. ఈ క్రమంలో, శ్రద్ధ ఒక మంచి సహవాసిగా స్నేహితునిగా మన వెన్నంటి నడుస్తుంది.         

రచన: డి. చంద్రశేఖర్