రచన: మైఖేల్ కారిథెర్స్
[మైఖేల్ కారిథెర్స్ 1978లో, “The Forest Monks of Sri Lanka: Anthropological and Historical Study” అనే అంశంపై చేసిన పరిశోధనకుగాను ఆక్సఫర్డ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందారు. Oxford University వారు ప్రచురించిన Past Masters series లో భాగంగా, 1983లో ఆయన The Buddha అనే పుస్తకం రాశారు. అప్పటి నుండి ఈ పుస్తకం Very Short Introduction series లో భాగంగా ముద్రించబడుతున్నది. 2012లో దీని తెలుగు అనువాదం “గౌతమ బుద్ధుడు” అనే పేరుతో పీకాక్ క్లాసిక్స్, హైదరాబాద్ వారిచే ప్రచురించబడింది. దీని నుండి ఎంపిక చేసిన భాగమే ఈ వ్యాసం. ఇది 2022 బుద్ధజయంతి సందర్భంగా అమ్మనుడి మాసపత్రికలో అచ్చయింది.]
సామాన్య ప్రజలకు బుద్ధుడు చేసిన బోధనల పొందిక, కాలముల నుద్దేశించి ఆయన చేసిన ఉపదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సుత్తంలో, బుద్ధుడు కొందరు భిక్షువులతో కలిసి సంచరిస్తూ కేశపుత్తం అనే గ్రామానికి చేరి, అక్కడ విడిది చేసినట్లు చెప్పబడింది. ఆ ప్రాంతంలో నివసించే ‘కాలామ’ అనే ఒకజాతి జనులు బుద్ధుణ్ణి దర్శించి, తమ సమస్యను ఆయనకు తెలియజేస్తారు. అనేకమంది శ్రమణులు (బ్రాహ్మణేతర సత్యాన్వేషకులు), బ్రాహ్మణులు తరచూ వారి గ్రామానికి వచ్చి, తమ వాదాలను వినిపిస్తుంటారు. ఎవరికి వారు తమవాదమే సరైనదని, ఇతరుల వాదాలు తప్పని చెబుతుంటారు. ఇటువంటి స్థితిలో ఎవరు చెప్పేది సత్యమో, ఎవరిది అసత్యమో, ఎవరిని అనుసరించాలో, ఎవరిని నిరాకరించాలో తెనియని కాలాములు, తమ సందేహం తీర్చమని బుద్ధుణ్ణి కోరతారు. కాలాముల సందేహాన్ని తీర్చటంకోసం బుద్ధుడు చెప్పిన సమాధానం ద్వారా, ఆయన పిడివాది కాదని, మనిషికి గల విచక్షణా దృష్టిని ఆయన ప్రోత్సహించాడని తెలుస్తుంది. “దేనినైనా ‘చాలకాలంగా వింటున్నది, సంప్రదాయంగా వస్తున్నది, పురాతన గ్రంథాల్లో చెప్పబడింది, మనకు తెలిసిన సిద్ధాంతానికి అనుగుణంగా ఉంది, లేదా మన గురువు చెప్పింది’ అనే కారణంతో దానిని సత్యంగా స్వీకరించవద్దు” అని ఆయన కాలాములకు చెప్పాడు.
ఇదేదో చిత్తచాపల్యం గలవారి ఉబలాటాన్ని సంతృప్తిపర్చటం కోసం చెప్పిన బోధన అనుకుంటే, అది పొరపాటే అవుతుంది. తాను స్వయంగా ఉపయోగించే బుద్ధికుశలతను, హేతుదృష్టినే బుద్ధుడు కాలాములకు బోధించాడు. వీటిని ఉపయోగించటం ద్వారా కాలాములు తాను చెప్పే ధర్మం వైపు మొగ్గుతారని ఆయన భావించాడు. తరువాత ఆయన వారికి ఇలా చెప్పాడు:
“ఈ ధర్మాలు అకుశలమైనవి, ఇవి కుశలమైనవి; ఇవి వివేకవంతులు నిందించేవి, ఇవి వివేకవంతులు ప్రశంసించేవి; వీటిని స్వీకరించి ఆచరిస్తే హాని జరుగుతుంది, వీటిని స్వీకరించి ఆచరిస్తే మేలు జరుగురుంది అని మీరు స్వయంగా తెలుసుకుని వేటిని నిరాకరించాలో, వేటిని స్వీకరించి ఆచరించాలో నిర్ణయించుకోండి.”
ఈ సందేశం ద్వారా కాలాములు ఆచరించే నైతిక ధర్మం సూటిగా ఉంటుంది. వారు జీవహింస చెయ్యరు, ఇవ్వనిదానిని తీసుకోరు (దొంగతనం చెయ్యరు), తప్పుడు మాటలు చెప్పరు, అక్రమ శారీరక సంబంధాలు నెరపరు. వారు హానికరమైన పనులు చేసేటట్లు ఇతరులను ప్రేరేపించరు. కాలాముల జీవితానుభవం, ఇంకా యుక్తితో కూడిన ఆత్మపరిశీలన వారిని సహజంగానే ఈ నియమాల వైపు నడిచేటట్లు చేస్తాయి.
ముఖ్యంగా, ఈ సందేశంలో స్థానిక నేపధ్య ప్రభావం ఉన్నట్లు కనిపిస్తుంది. కాలాములు, తమ పొరుగుజాతి ప్రజలైన శాక్యులవలె, స్వయం నిర్ణయాధికారం గల స్వతంత్ర రాజ్యవ్యవస్థలో జీవిస్తున్నారని చెప్పటానికి తగిన ఆధారాలున్నాయి. కాని, వారు క్రమంగా కోసలరాజ్యపు ఆధిపత్యంలోకి లాగబడుతున్నారు. ఈ రకమైన రాజకీయ మరియు ఆర్ధిక శక్తులు, సరళమైన ఏకజాతి రాజ్యంలో జీవిస్తున్న కాలాములను, ఆనాడు గంగానది పరివాహక ప్రాంతంలో పెంపొందుతున్న సంక్లిష్టమైన నాగరికతలోకి లాగుతున్నాయి. ఈ మార్పుకు బలం చేకూర్చే సాంస్కృతిక రూపాలను శ్రమణులు, బ్రాహ్మణులు చెబుతున్న విభిన్నమైన బోధనల్లో మనం గుర్తించవచ్చు.
జీవహింస, దొంగతనం, అబద్ధాలాడటం, కామదురాచారం వంటి అనైతిక చర్యలను విరమించాలనే నియమాలు కాలాములకు పూర్తిగా కొత్తవని అనుకోలేం. వారి సంస్కృతిలో ఇటువంటి నియమాలు ఏదోఒక రూపంలో ఉండివుండాలి. ఇలాంటి నైతిక నియమాలు అసలు లేని సమాజాన్ని ఊహించటం కష్టం. అయితే, కాలాముల వంటి సమాజాల్లో, ఈ నైతిక విలువలు తార్కికంగా రూపొందకుండా, సహజంగా సంక్రమించిన సంప్రదాయ లక్షణాలుగా ఉండివుండొచ్చు. నూతనంగా తలెత్తుతున్న సామాజిక పరిస్థితుల్లో, ప్రశ్నించబడకుండా సంప్రదాయంగా అనుసరిస్తున్న నైతిక విలువలు తమపట్టు కోల్పోతున్నాయి. కాబట్టి, మానవ జీవితపు మూలాల నుండి పుట్టిన ఇటువంటి నైతికతకు బుద్ధుడు హేతుబద్ధతతో కూడిన కొత్తరూపం కల్పించాడు. ఈ బోధనలో ప్రతిపాదించిన నైతిక విలువలు కాలాములకు మాత్రమే పరిమితమైనవి కావు. సమాజంలో రకరకాల వ్యక్తులు తమకు, ఇతరులకు ప్రయోజనకరంగా సహజీవనం సాగించవలసిన అనివార్యమైన పరిస్థితి వలన వీటి అవసరం ఏర్పడింది. ఈ నైతిక విలువలు అన్నిరకాల పరిస్థితులకు వర్తిస్తాయి.
బుద్ధుడు కాలాముల జీవితానికి కొత్త నైతిక పునాదిని అందించటం కంటే మరింత విశాలమైన దృష్టితో వ్యవహరించాడు. ఆయన బోధించిన నియమాలు కాలాములకు మాత్రమే గాక, వారితో వ్యవహరించే అందరికీ వర్తిస్తాయి. చిన్నవైన ఆదిమ సమాజాలు, నైతికత అనేది తమకు మాత్రమే పరిమితమని భావించటం సహజం. కాని ఇప్పుడు కాలాములు బయటి ప్రపంచంలోని విశాల ప్రజానీకంతో సంబంధాలు ఏర్పర్చుకుంటున్నారు. కాలాములకు అనివార్యంగా సంక్రమించిన బహుళజాతి జీవన విధానానికి అనుగుణంగానే, బుద్ధుడు వారికి విశ్వజనీన నైతిక సూత్రాలను బోధించాడు.
ఇంతవరకూ చెప్పినదాన్నిబట్టి చూస్తే, సామాన్యులకు ఉద్దేశించిన బుద్ధుని బోధన హేతుబద్ధమైన నైతికతపై ఆధారపడిందని తెలుస్తుంది. అయితే, ఈ సుత్తంలో కనిపించే హేతుదృష్టి, బుద్ధుని ఇతర బోధనలైన అనుభవవాదం, మానవస్వభావ విశ్లేషణ, అంతరంగ పరివర్తన, సరైన సంకల్పం అనేవాటిలో మరింత లోతుగా కనిపిస్తుంది. భిక్షువులను ఉద్దేశించి చేసిన బోధనల్లో, దుఃఖానికి మూలమైన రాగ ద్వేష మోహాలు తనలో కలిగివున్న వ్యక్తికి, అవి హాని కలిగిస్తాయని బుద్ధుడు చెప్పాడు. కాని, సామాన్య ప్రజలను ఉద్దేశించి చేసిన ఈ ఉపదేశంలో, రాగ ద్వేష మోహాలు వాటిని కలిగివున్న వ్యక్తులకే గాక, ఇతరులకు కూడ హానికరమైనవని ఆయన నొక్కిచెప్పాడు.
“మనిషిలో దురాశ ఉత్పన్నమైతే అది హాని కలిగించదా? మనిషిలో ద్వేషం ఉత్పన్నమైతే అది హాని కలిగించదా? మనిషిలో మోహం (అవిద్య లేక అజ్ఞానం) ఉత్పన్నమైతే అది హాని కలిగించదా? దురాశకు, ద్వేషానికి, అవిద్యకు లోనయిన మనిషి జీవహింస, దొంగతనం, అబద్ధాలాడటం, అక్రమసంబంధాలు నెరపటం వంటి పనులు చెయ్యడా? దురాశ, ద్వేషం, అవిద్యకు లోనుకాని మనిషి జీవహింస, దొంగతనం, అబద్ధాలాడటం, అక్రమ సంబంధాలు నెరపటం వంటి పనులకు దూరంగా ఉండడా?”
పైన ఉటంకించిన వాక్యాల్లో ‘హాని’ తనకు, ఇతరులకు కూడ అని అర్థం. బుద్ధికుశలత తనకు ఇతరులకూ ప్రయోజనం కలిగించినట్లే, హాని కూడ తనకు ఇతరులకూ కలుగుతుంది. ఇక్కడ ఈ విషయాన్ని నొక్కిచెప్పటం అవసరం. ఎందుకంటే, ఈనాటి పాశ్చాత్యులు, బుద్ధుని తదనంతరం రూపొందిన కొన్ని శాఖలు ‘బుద్ధుడు ఇతరుల సంక్షేమం గురించి, సామాజిక సంక్షేమం గురించి చెప్పలేదంటు’న్న కారణంగా, ఒకవైపు సమాజహితాన్ని నిరాకరించటం, మరోవైపు ఈ దిశగా బౌద్ధాన్ని విస్తరించకూడదని భావించటం జరిగింది.
బుద్ధుని బోధనల ప్రకారం, మనిషి తన మనసును అజేయంగా (రాగ ద్వేష మొహాలకు లొంగనిదిగా) మలుచుకోవాలంటే, అది కేవలం సహజాత జ్ఞానంతో జరగదు. ఒకవైపు, ప్రజలకు హేతుబద్ధంగా ఆలోచించగల శక్తి ఉందని, దానికి సరైన దిశానిర్దేశం చెయ్యగలిగితే, అది నైతిక సమస్యలకు సరైన పరిష్కారం చూపగలదని బుద్ధుడు భావించాడు. సామాన్య ప్రజలకు ఏది చెయ్యదగిందో తెలుసుకునే శక్తి ఉంది. మరోవైపు, హేతుబుద్ధి కలిగిన సామాన్య ప్రజలు – తమ స్థితికి తగినట్లు – తమను తాము పరివర్తన చేసుకోగలరని బుద్ధుడు భావించాడు. అందుకే, కాలమసుత్తంలో ఆయన కరుణ, మైత్రి వంటి మానవీయ లక్షణాలను పెంపొందించుకోమని సూచించాడు. ప్రజలు ప్రపంచంలోని అన్ని జీవులపట్ల ‘రాగ, ద్వేష, మోహ రహితమైన హృదయంతో …. తన, మన అనే భేదభావం లేకుండా’ కరుణ, మైత్రి అనే గుణాలను పెంపొందించుకోవాలి. ఈ మానసిక అభ్యాసం ఫలితంగా కాలక్రమంలో, ప్రేమతో కూడిన కరుణను ఒక అలవాటుగా, తానుచేసే చర్యలకు చోదకశక్తిగా నెలకొల్పాలి.
దీనిలో రెండు ముఖ్యమైన అంశాలను మనం చూడవచ్చు. మొదటిది: మనిషి మానసిక నైపుణ్యంతో ఎందుకు ప్రవర్తించాలో చెప్పటమే గాక, కొన్ని సమయాల్లో అదుపుతప్పిన మానవ స్వభావాన్ని నైపుణ్యంతో ప్రవర్తించేటట్లు చెయ్యటం ఎలా అనే విషయాన్ని కూడ బుద్ధుడు వివరించాడు. కనుక ఆయన వాస్తవవాది. ఒక వ్యక్తి ఏది మంచిదో, ఏది నైపుణ్యంతో కూడినదో అంచనా వెయ్యవచ్చు. కాని, ఆ వ్యక్తి అందుకు అనుగుణంగా పరవర్తించటంలో సఫలం కాకపోవచ్చు. మనిషిలో సాధారణంగా ఉండే ఈ బలహీనతను బుద్ధుడు పరిగణనలోకి తీసుకున్నాడు. రెండవది: స్వీయ పరివర్తన కోసం చేసే ఈ సాధన, సూత్రరీత్యా ప్రతిఒక్కరూ ఆచరించగలిగిందే. ఇది ఎంతో ముఖ్యమైన సంగతి. ఎందుకంటే సాధనచేసే మనిషి అనుభవాన్ని, ప్రత్యేకించి, బౌద్ధసంఘం పరిధికి బయట ఉండే సాధకుల అనుభవాన్ని కొందరు తమ స్వార్ధ ప్రయోజనాలకు అనుకూలంగా మలుచుకోవటం సాధ్యంకాదు. కాలాముల జీవితంలో సహజమైన మార్పు జరుగుతూవుంది. అంతకుమించి, తమ అదుపులో లేని, తమకే పూర్తిగా అర్థంకాని సామాజిక మార్పులకు వారు లోనవుతున్నారు. అయినప్పటికి మనిషి తన అలవాట్లను, ఉద్వేగాలను అదుపు చేసుకోగలడు. ఒక మనిషి ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు, కాని అతడు కనీసం తనను తాను మార్చుకోగలడు. సామాన్య ప్రజలు సాధనచేసే కరుణ మైత్రి వంటి గుణాలు, కొంతవరకు, వారు బౌద్ధసమాజంలో భాగంగా ఉండటం వలనే ప్రభావశీలంగా ఉండవచ్చు; కాని అంతిమంగా ఎవరికివారే స్వయంగా కృషిచెయ్యాలి, తమ సాధనపైనే తాము కేంద్రీకరించాలి.
కాలాములకు చేసిన ఉపదేశం, బహుశా, ఆ ప్రాంతంలో నివసించే వారికి బాగా తగినది కావచ్చు. కాని, బుద్ధుడు సామాన్య ప్రజలను ఉద్దేశించి చేసిన ఇతర ఉపదేశాల వలే, ఇది కూడ అదేరకమైన పరిస్థితుల్లో జీవిచేవారికి ఎవరికైనా వర్తిస్తుంది. అలనాటి గంగామైదాన ప్రాంతంపు నాగరికతలో జీవించిన కాలాముల వలె, ఈనాడు సంక్లిష్టతతో కలవరపెట్టే విశాల ప్రపంచపు ప్రభావానికి లోనుకాని జనాలు చాల అరుదు. అందుకే మనకు ఈ సుత్తంలోని బుద్ధుని ఉపదేశం మరింత ఆధునికంగా కనిపిస్తుంది. ఒక సంక్లిష్ట సమాజంలో, విభిన్న అనుభవాలకు గురవుతున్న విశాల ప్రజానీకానికి వర్తించే విశ్వజనీన సత్యాన్ని బుద్ధుడు బోధించాడు. ఆనాటి భారతదేశపు ప్రజానీకం జీవించిన పరిస్థితులకు ఏమాత్రం తీసిపోని సంక్లిష్టతలో ఈనాడు మనం జీవిస్తున్నాం. పైపైన చూస్తే, ఆనాటి జనంలాగే ఈనాటి ప్రజానీకం కలవరపెట్టే రకరకాల అవసరాలకు, విభిన్నమైన విలువలకు లోనవుతుంటారు. కాని, వీరందరిలో ఉమ్మడిగా ఉండే లక్షణాలు కొన్ని ఉన్నాయి: బాధలకు, సంతోషానికి స్పందించే గుణం, ఇంకా, ఇతరులకు కీడు లేదా మేలు చేయగల సామర్ధ్యం. వీటి ఆధారంగానే బుద్ధుడు మానవజాతి మొత్తానికి వర్తించే ధర్మాన్ని బోధించాడు.
అనువాదం: డి.చంద్రశేఖర్
జై భీం namo బుద్ధాయ గుడ్ మెసేజ్ sir
చక్కని వ్యాసం సర్
చంద్ర శేఖర్ గారు చక్కగా ,సరళం గా వివరించారు. సార్వ కాలీన సార్వ జనీన సత్య శోధన బోధన బౌద్ధం సారం
నమోతస్సా నియ్యనిక్సా అట్టపురిష పుగ్గలా.మహాసంఘస్సా.తివిధం వందామి సబ్బదా. మహోపాద్యయుని బోధనలు అచరణనీయాలు.
ఇంత సరళంగా చెప్పడం మీ తరువాతే