ఉద్దేశవివరణ

బుద్ధుని బోధనలను అధ్యయనం చేసి, వాటిని జీవిత సమస్యల పరిష్కారానికి, దుఃఖ విముక్తికి సృనాత్మకంగా అన్వయించే కృషికి సహకరించటం ఈ పత్రిక ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని నెరవేర్చటానికి ఎంచుకున్న లక్ష్యాలు కింది విధంగా ఉన్నాయి.

బుద్ధుని బోధనలను ఆయన స్వంత మాటల్లో నమోదు చేశాయని చెప్పబడే మూల గ్రంథాలు చాల విస్తృతమైనవి. పాలి, సంస్కృతం తదితర భాషల్లో లభించిన యీ ప్రాచీన గ్రంథాల ఇంగ్లీషు అనువాదాలు పుస్తక రూపంలో, వెబ్-సైట్ పేజీల రూపంలో పుష్కలంగా వెలువడ్డాయి. వీటి  తెలుగు అనువాదాలు యింకా పాఠకులకు తగినంతగా అందుబాటులోకి రాలేదు. ఈ గ్రంథాలన్నీ తెలుగులో అందుబాటులోకి వచ్చినా, వాటన్నిటిని అధ్యయనం చెయ్యటం సామాన్య ప్రజలకే గాక, పండితులకు కూడా ఎంతో శ్రమతో కూడిన పని. అందువల్ల, మూల గ్రంథాల్లోని బుద్ధవచనానికి కచ్చితమైన, సరళమైన తెలుగు అనువాదాలను, సంగ్రహంగా అందించవలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది. ఈ దిశగా కృషిచెయ్యటం బుద్ధవచనం పత్రిక మొదటి కర్తవ్యం.

2,500 ఏళ్లకు పైగా సాగిన తన ప్రస్థానంలో బౌద్ధం అనేక శాఖలుగా విడిపోయి, ప్రపంచంలోని వివిధ ప్రాతాలకు విస్తరించింది. ఈ శాఖలన్నీ బుద్ధుని మౌలిక బోధనలపట్ల ఏకాభిప్రాయం కలిగివున్నా, వాటి గురించి భిన్నమైన వ్యాఖ్యానాలు చెబుతూ, తమదైన అనుబంధ సాహిత్యాన్ని వెలువరించాయి. వీటిలో వైవిధ్యంతో పాటు వైరుధ్యాలు కూడా ఉన్నాయనేది వాస్తవం. వివిధ శాఖలు అందించిన వ్యాఖ్యానాలను, మూల బుద్ధవచనం వెలుగులో విశ్లేషించి, సరైన స్ఫూర్తిలో అర్థంచేసువటం అవసరం. ఈ దిశగా చేసే రచనలకు పత్రికలో తగిన స్థానం ఉంటుంది.

ఆధునిక కాలంలో బుద్ధుని బోధనల్ని అర్థంచేసుకోవటం, అన్వయించటంలో మరింత వైవిధ్యం కనిపిస్తుంది. గత నూటయాభై ఏళ్లలో బౌద్ధ సాహిత్యం, తూర్పు పశ్చిమ దేశాలకు చెందిన అనేక భాషల్లోకి అనువాదం కావటంతో, ప్రపంచ వ్యాపితంగా అనేక మంది పండితులు బుద్ధవచనాన్ని విశ్లేషిస్తూ, అభినందిస్తూ, విమర్శిస్తూ అసంఖ్యాకమైన రచనలు వెలువరించారు; ఈ ఒరవడి యింకా కొనసాగుతూనే ఉంది. వీటిలో కొన్ని తెలుగులో కూడ అందుబాటులోకి వచ్చాయి. ఇటువంటి ఆధునిక రచనలకు, వాటిని బుద్ధవచనం వెలుగులో విశ్లేషించే రచనలకు యీ పత్రిక ఒక వాహకంగా ఉంటుంది.

బౌద్ధంపై గతంలో ఎన్ని రచనలు వచ్చిప్పటికి, మానవ జీవితం ఎదుర్కుంటున్న సమస్యలను, బుద్ధవచనం వెలుగులో ఎప్పటికప్పుడు విశ్లేషించుకోక తప్పదు. ఆధునిక సమాజం అనూహ్యమైన వస్తుసంపదను సేవలను కల్పించటమే గాక, ముందెన్నడూ లేని కొత్త సంక్షోభాలను కూడా సృష్టించింది. నేడు ఊహకందని వేగంతో వివిధ రూపాల్లో విస్తరిస్తున్న నేరప్రవృత్తి, అశాంతి, అభద్రత, అసమానతలు, శరవేగంతో పతనమౌతున్న మానవ సంబంధాలు, నైతిక విలువలు, మానవుని మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిన పర్యావరణ విధ్వంసం – యిటువంటి సమస్యల మూలాలను వెదికి పట్టుకోకుండా, వాటిని పరిష్కరించటం సాధ్యంకాదు. ఈ దిశగా, బుద్ధుని బోధనల ద్వారా తగిన మార్గదర్శకత్వం అందించటం పత్రికకు ఒక ప్రాధమిక కర్తవ్యం.

విమర్శ అనేది బుద్దుని బోధనలకు విరుద్ధమనే అభిప్రాయం ప్రచారంలో ఉంది. బుద్ధుడు వివాదాలు వద్దని చెప్పటం నిజమే కాని, విమర్శించటం తప్పని ఆయన ఎక్కడా చెప్పలేదు. పైగా ‘విమర్శించవలసిన వారిని వాస్తవికంగా, తగినరీతిలో, సరైన సమయంలో విమర్శించటం సత్పురుషుల లక్షణమ’ని బుద్ధుడు చెప్పాడు. ఈ స్ఫూర్తిలోనే, స్వేచ్ఛాయుతమైన సంభాషణ, అర్థవంతమైన చర్చల ద్వారానే బౌద్ధం వేళ్ళూనుకుని మనుగడ సాగించింది. బుద్ధవచనం గురించి బౌద్ధుల్లోనే భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమోతున్న తరుణంలో, లోతైన చర్చ, విమర్శ లేకుండా సరైన అవగాహన పెంపొందటం దుర్లభం. భిన్నాభిప్రాయాలను, చర్చను, విమర్శను అనుమతించని బోధన, తత్వచింతన లేక జ్ఞానస్రవంతి ఏదైనా అంతిమంగా గిడసబారటం తథ్యం అనేది చరిత్ర నేర్పిన గుణపాఠం. కనుక, విరోధానికి దూషణకు ఘర్షణకు తావివ్వని విధంగా, బౌద్ధం గురించి వ్యక్తమయ్యే వివిధ అభిప్రాయాలపై అర్థవంతమైన చర్చకు, నిర్మాణాత్మకమైన విమర్శకు సరైన వేదికగా పత్రికను తీర్చిదిద్దటం మరో కీలకమైన కర్తవ్యం.

ఈ కృషిలో రచయితలు, పాఠకులు భాగస్వాములు కావలసిందిగా ఆహ్వానిస్తున్నాం.