రచన: ఠానిస్సరో భిక్ఖు

[2018లో వెలువడిన First Things First అనే సంకలనంలో గల The Streams of Emotion అనే వ్యాసానికి ఇది సరళ తెలుగు అనువాదం. ఇది బుద్ధుని బోధనలతో తగిన పరిచయం కలిగిన పాఠకులను ఉద్దేశించి రాసిన వ్యాసం అయినా, జీవితపు మౌలిక సమస్యల పరిష్కారం పట్ల గాఢమైన ఆసక్తి కలిగిన వారు ఎవరైనా, దీనిని చదివి ప్రయోజనం పొందవచ్చు. అయితే ఇందుకోసం, ఈ వ్యాసాన్ని మామూలుగా చదవటం గాక, తగిన శ్రద్ధతో, వివేచనతో, పరిశోధనాత్మకంగా అధ్యయనం చెయ్యటం అవసరం.

ఈ వ్యాసంలో కుశల, సంఖార అనే పాలీ పదాలు చాల కీలకమైనవి. కనుక, ముందుగా వాటి అర్థాలు తెలుసుకుందాం.

కుశల: బుద్ధుని కాలపు వాడుక భాషలో ఈ పదానికి “హితకరమైన” లేక “మేలు కలిగించే” అనే అర్థాలు ఉన్నాయి. అలాగే “కౌశలం” లేక “నైపుణ్యం” అనే అర్థంలో కూడా ఈ పదం విరివిగా వాడబడింది. అయితే, బుద్ధుడు “హితకరమైన” మరియు “నైపుణ్యం” అనే భావాలు కలగలిసిన నూతన అర్థంలో కుశల అనే పదాన్ని ఉపయోగించాడు. ఇక, దీనికి వ్యతిరేకార్థంలో, అంటే “హానికరమైన”, “నైపుణ్య రహితమైన” అనే అర్థంలో అకుశల అనే పదం ఉపయోగించబడింది. ఈ పదం గురించి మరింత వివరణ కోసం చదవదగిన వ్యాసం: https://www.buddhavachanam.com/825

సంఖార: పాలి భాషలో “సంఖార” అనే పదం రకరకాల అర్థాలు కలిగివుంది. ప్రస్తుత సందర్భంలో సంఖార అంటే, ఒక వస్తువు లక్షణాలను లేదా ఒక మానసిక స్థితిని మార్చటానికి ఉపకరించే సాధనం. అకుశల సంఖారాలకు బదులుగా కుశల సంఖారాలను ఉత్పన్నం చెయ్యటం గురించి ఈ వ్యాసం చర్చిస్తుంది.]      

దురాశ, ద్వేషం, కోపం, భయం, ఆందోళన, వ్యామోహం వంటి ఉద్వేగాలు అకుశల గుణాలని బుద్ధుడు చెప్పాడు. మనిషి మనసులోని ఒక పక్షం వీటిని వద్దంటుంది, కాని మరో పక్షం వీటిని ఇష్టపడుతుంది. ఉదాహరణకు, ఏదైనా చెడుపని జరుగుతున్నప్పుడు, దానిని నివారించటానికి మనలో తలెత్తే కోపం అనే ఉద్వేగాన్ని, దానివల్ల మనలో కలిగే శక్తిని (ఉద్రేకాన్ని) మనం ఇష్టపడతాం. వ్యామోహం కలిగినప్పుడు, దానికి కారణమైన వ్యక్తి పట్ల మాత్రమే గాక, వ్యామోహ గుణం పట్ల కూడా మనం ఆకర్షించబడతాం. ఎందుకంటే, అది మనల్ని ఆకర్షణీయంగా చేస్తుందని అనుకుంటాం. చివరకు, మనసులోని ఒక పక్షం ఆందోళన, ఆదుర్దా వంటి ఉద్వేగాలను కూడ ఇష్టపడుతుంది. ఎందుకంటే, భవిషత్తులో ఎదురయ్యే సమస్యల గురించి ఆందోళన చెందితేనే, నువ్వు వాటిని పరిష్కరించగలవని అది నీకు చెబుతుంది.

అయితే, వీటిలో మరో కోణం కూడ ఉంది. చాల సందర్భాల్లో, ఈ ఉద్వేగాలు సమసిపోయిన తరువాత, వాటి ప్రభావం కారణంగా మీరు చేసిన పనుల గురించి, అంటే మీకు, ఇతరులకు హాని కలిగించిన పనుల గురించి మీరు చింతిస్తారు. ఇలాంటి సందర్భాల్లో మీరు, ‘ఉద్రేకానికి లోనుకాకుండా ఉండటానికి ఏదైనా ఉపాయం ఉందా?’ అని ఆలోచిస్తారు.

అయినప్పటికీ, మనసులో వ్యామోహాన్ని, కోపాన్ని ఇష్టపడే లక్షణం అంత సులభంగా వదిలిపోదు. “ఉద్వేగ ప్రవాహాలను వదిలెయ్యాలి, ధ్వంసం చెయ్యాలి, పారదోలాలి, వాటిని సమూలంగా నిర్మూలించాలి” అని బుద్ధుడు చెప్పిన మాటలు చదివినప్పుడు (లేదా విన్నప్పుడు) – ఇది దూరాలోచన లేని చవుకబారు ఉపదేశమని భావిస్తూ, దీన్ని తిరస్కరించటానికి మనసు రకరకాల కారణాలు వెదుకుతుంది. అవును, కేవలం దానిని అణచివెయ్యటం లేదా తప్పించుకు తిరగటం ద్వారా ఒక ఉద్వేగం మనల్ని వదిలిపోదు. అది తాత్కాలికంగా సమసిపోయినా, తరువాత అదను చూసుకుని మళ్ళీ దాని ప్రతాపం చూపిస్తుంది. అందుకే తరచూ, ‘ఉద్వేగాల ప్రవాహాన్ని అనుమతిస్తూనే, వాటి విషపూరిత ప్రభావం నుండి, అంటే వాటి హానికరమైన  ప్రభావం నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు’ అనే మాటలు వినటానికి మనం ఇష్టపడతాం.

ఉద్వేగాల నిగ్రహం – వాటి నిర్మూలన  

అయితే, అకుశల ఉద్వేగాలను నిరోధించటానికి నిగ్రహం మాత్రమే చాలని బుద్ధుడు ఎక్కడా చెప్పలేదు. అందుకు మారుగా, ఈ ఉద్వేగాలను “ప్రవాహాలు” అని పిలుస్తూ ఆయన ఇలా అన్నాడు:

లోకంలోని సకల ప్రవాహాలను సతి నిలువరిస్తుంది.

సతి వాటిని నిగ్రహిస్తే, ప్రజ్ఞ వాటిని నిర్మూలిస్తుంది.

[సుత్తనిపాత 1041. ఇక్కడ లోకం అంటే వ్యక్తి మానసిక లోకం.]

మరో రకంగా చెప్పాలంటే, ఒకానొక ఉద్వేగం మనలో ఉందని గమనించి అది వద్దని అనుకోవటం, దాని నిరోధంలో మొదటి అడుగు మాత్రమే. దానిని పూర్తిగా అధిగమించటానికి ప్రజ్ఞ అవసరం. ఇక్కడ ప్రజ్ఞ అంటే, నువు ఉద్వేగానికి ఎందుకు లోనవుతున్నావు, దానికి సరైన ప్రత్యామ్నాయం ఉన్నదా, ఆ ప్రత్యామ్నాయం ఏమిటి? అనేది తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే ఉద్వేగాలు నీపై చెలాయించే ఆధిపత్యం నుండి నువు విముక్తి పొందగలుగుతావు. 

అయినప్పటికి, ఈ విషయాలను స్పష్టంగా గ్రహించాలంటే, ముందుగా ఉద్వేగాలను అదుపులో పెట్టాలి. అప్పుడు మాత్రమే, మనసులో ఉద్వేగాలను ఇష్టపడే భాగం దాని అసలు రూపం చూపిస్తుంది. ఇది ఒక నదిలోని ప్రవాహం గురించి తెలుసుకోవటంవంటిది: అది పైకి నిలకడగా, ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నా, దానికి అడ్డంగా ఆనకట్ట కట్టటానికి ప్రయత్నించినప్పుడే, దాని లోపలి ప్రవాహం ఎంత బలమైనదో తెలుస్తుంది. అదేవిధంగా, మీలోని ఒక ఉద్వేగాన్ని ఆపటానికి ప్రయత్నించే వరకూ, మనసు ఆ ఉద్వేగాన్ని అంటిపెట్టుకోటానికి గల నిజమైన కారణం ఏమిటో మీరు తెలుసుకోలేరు. అంటే, అవి తమ నిజ స్వరూపం బయటపెట్టే వరకు, ఉద్వేగాల గురించి మీరు తెలుసుకోలేరు. అలాగని వాటిని నిరాకరించిన మొదటి ప్రయత్నంలోనే వాటి కారణాలు పూర్తిగా బహిర్గతం కావు, కనుక, మీరు వాటిని పదేపదే నిరాకరించాలి. కొన్ని ఉద్వేగాలు తెలివిమాలిన, నీచమైన చర్యలుగా ఉండటం కద్దు. కనుక, మనసు వాటిని ‘తెలివిగా’ మరుగున పెడుతుంది. ఈ కుయుక్తుల పట్ల తెలివిగా, దృఢంగా వ్యవహరించినప్పుడే మీరు వాటిని చూడగలరు. అలా చూసినప్పుడు మాత్రమే, మనసు తనను తాను వేధించే మార్గాల నుండి విముక్తి పొందటానికి, బుద్ధధర్మం అందించిన ప్రజ్ఞను (వివేచనాశక్తిని) మీరు ఉపయోగించగలరు.   

కనుక, అకుశల ఉద్వేగాలను అధిగమించటంలో సతి తొలి అడుగు మాత్రమే. ఇక్కడ “సతి” అనే పదానికి, బుద్ధుడు చెప్పిన అర్థం ఇది: దేనినైనా గుర్తుకు తెచ్చుకోవటం లేదా జ్ఞాపకం చేసుకోవటం. సతి చేసే పని కేవలం జరుగుతున్న వాటిని గమనించి అంగీకరించటం కాదు. అది ఒక ద్వారపాలకుని వలె, ఎవరిని లోనికి అనుమతించాలి, ఎవరిని అనుమతించకూడదు అనే విషయాన్ని గుర్తుచేసుకుంటుంది [అంగుత్తర నికాయ 7:63]. ఒక అకుశల ఉద్వేగం తలెత్తినప్పుడు, సతి దానిని గుర్తించి, అది జ్ఞాన మార్గానికి ఆటంకం అని తెలుసుకుంటుంది. అంటే, అది జరుగుతున్న దానిని అంగీకరించటం గాక, జరిగే దానిని నిలువరిస్తుంది. ఉదాహరణకు, కామోద్వేగానికి లోనైనప్పుడు, అది కొంత బలపడే వరకూ దానిని మనం గుర్తించలేం. దాన్ని గుర్తించిన తరువాత కూడా వెంటనే “ఓహో, ఇది ఒక ఆటంకం” అని భావించం. సాధారణంగా, “ఆహా, ఇది నేను  ఆనందించటానికి ఒక గొప్ప అవకాశం” అనిపిస్తుంది. కనుక, అదొక ఆటంకమని గుర్తించటానికి నిరంతరం సతిలో ఉండటం అవసరం. మనం దుఃఖాన్ని అంతం చెయ్యాలంటే, ఉద్వేగాలను మన మిత్రులుగా గాక, ఆటంకాలుగా చూడాలి. అవి హానికరమైనవని గుర్తించినప్పుడు, వాటిని అధిగమించటానికి కావలసిన సాధనాలను కూడ గుర్తుతెచ్చుకోవాలి.

సతిని నెలకొల్పటానికి బుద్ధుడు చెప్పిన అనేక ఉపదేశాలు ఉన్నాయి. నిజానికి అవి మనసును సుస్థిరమైన, ఉల్లాసకరమైన సమాధిలో (ఏకాగ్రతలో) నిలపటానికి ఉపకరించే బోధనలు. మీ మనసు వర్తమానంలో – శ్వాస వంటి – ఒక విషయంపై స్థిరంగా, సుఖంగా నెలకొన్నప్పుడు, అది రాగద్వేషాల ద్వారా లభించే ‘మేత’ కోసం వెంపర్లాడటం మాని, తనను తాను స్పష్టంగా చూడగలుగుతుంది. అదే సమయంలో, మనసు ఏకాగ్రతలో బలపడేకొలది, బుద్ధుడు అందించిన మొదటి సాధన సంపత్తి (వివరాలు కింది పేరాల్లో) విషయంలో మీకు ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది. అంటే, ఉద్వేగాలు ఎలా కలుగుతున్నాయి, ఆరాటం వాటిని మనసును ముంచెత్తే ప్రవాహాలుగా ఎలా మారుస్తుంది – అనే విషయాలను ప్రజ్ఞతో గ్రహించటానికి ఈ సాధనాలు ఉపకరిస్తాయి.    

మూడు రకాల సంఖారాలు                    

బుద్ధుడు అందించిన ఆ మొదటి సాధన సంపత్తి ఇది: ఉద్దేశపూర్వకంగా జరిగే చర్యలను కాయక, వాచిక, మానసిక (చిత్త) అనే మూడు రకాల సంఖారాలుగా విశ్లేషించటం.

● లోనికి పీల్చి, బయటకు వదిలే శ్వాస శరీర స్థితిని మార్చగల సాధనం: కాయసంఖార.

● ఒకరు తనలో తాను మాట్లాడుకునే చర్యను వాచిసంఖార అంటారు. మామూలుగా ఇది రెండు రకాలుగా ఉంటుంది: విచార, వితర్క. విచార అంటే, ఆలోచన కోసం ఒక విషయాన్ని ఎంచుకోటానికి చేసే ప్రయత్నం. వితర్క అంటే, ఆ విషయంపై ప్రశ్నలు వెయ్యటం, వ్యాఖానించటం, దానికి విలువకట్టం.       

చిత్తసంఖార అనేది భౌతిక వస్తువులకు లేదా మానసిక అంశాలకు కొన్ని లక్షణాలను ఆపాదిస్తుంది. అంటే, ఆయా అంశాలకు మాటలు లేదా ఊహలతో కొన్ని ముద్రలు – బాగుంది, బాగాలేదు, ఫరవాలేదు తదితరమైన ముద్రలు – తగిలించటం. అది సుఖము, దుఃఖము లేదా ఎదీకానిది అని నిర్ణయించటం [మధ్యమ నికాయ 44].

ఈ మూడు రకాల సంఖారాలు ఏకాగ్రతను పెంపొందించటంలో తగిన పాత్ర నిర్వహిస్తాయి. ఉదాహరణకు, మీరు శ్వాసను తదేకంగా గమనిస్తుంటే, అది కాయసంఖారగా పనిచేస్తుంది. బుద్ధుడు సతి గురించి చెప్పిన ఉపదేశాల్లో, “శ్వాసపై ధ్యాస నిలిపి, సమస్త కాయాన్ని శమింపజేస్తూ శ్వాస పీల్చి వదులుతుంటే, మీరు కాయసంఖారాన్ని శాంతింప జెయ్యగలరు” అని చెప్పబడింది [మధ్యమ నికాయ 118]. మరో మాటల్లో చెప్పాలంటే, శరీరంలో క్రమంగా మరింత ఉపశమనం కలిగే రీతిలో మీరు శ్వాస తీసుకుని వదులుతుంటారు. దీనిని కొనసాగించటానికి మీరు వాచిసంఖారను జోడించాలి. అంటే, శరీరంలో ఉల్లాసం (ప్రీతి) జనించటానికి, అది వృద్ధి చెందటానికి, శారీరమంతటా వ్యాపించటానికి దోహదం చెయ్యగల విధంగా శ్వాస నడవాలని మీలో మీరు అనుకుంటూ శ్వాసను కొనసాగించాలి. ఉల్లాసం ఒకరకమైన సుఖవేదన, అది మనసుపై సానుకూల ప్రభావం కలిగించే ఒక మానసిక-సంఖార. దీనికి తోడు, శ్వాసపై ధ్యాస చెదిరిపోకుండా నిలపటానికి, ఉల్లాసాన్ని శరీరమంతటా వ్యాపింప చెయ్యటానికి, శ్వాసకు, శరీరానికి మధ్యగల సంబంధాన్ని మీరు మనసులో గుర్తుంచుకోవాలి. ఈ పని చేసేటప్పుడు శ్వాస గురించి, శరీరం గురించి మీరు కల్పించే వివిధ ఊహాచిత్రాలు (సంజ్ఞలు), మీ మనసు, శరీరంపై కూడ భిన్నమైన ప్రభావాలు కలిగిస్తాయని మీరు తెలుసుకుంటారు. బుద్ధుడు సూచించిన పద్ధతిలో, మనసును ప్రశాంత స్థితికి తెచ్చేటందుకు దోహదం చేసే వేదనలను, సంజ్ఞలను కనుగొనటానికి మీరు ప్రయత్నిస్తారు.  

శ్వాసను గమనిస్తూ చేసే ధ్యానసాధన బలం పుంజుకునే కొలదీ, ఈ విధంగా అది మూడు రకాల సంఖారాలను మీకు అలవడేటట్లు చేస్తుంది. అవి మీకు సుపరిచితం అయినప్పుడు, నిజజీవితంలో మీ మానసిక స్థితులను – ప్రత్యేకించి హానికరమైన ఉద్వేగాలను – అవి ఎలా ప్రభావితం చేస్తున్నాయో మీరు తెలుసుకుంటారు. ఉదాహరణకు, మీరు కోపంతో ఉన్నప్పుడు, సాధారణంగా ఒక సంజ్ఞ – మానసిక ఊహాచిత్రం – మిమ్మల్ని ఉసిగొల్పుతుంది. దీన్ని వెన్నంటి అంతరంగంలో మాటల రొద మొదలవుతుంది. మనసులో కొనసాగే ఈ వ్యాఖ్యానం మీ కోపాన్ని రెచ్చగొట్టే విషయాలపై, కోపంతో వ్యవహరించటాన్ని సమర్ధించుకునే కారణాలపై కేంద్రీకరిస్తుంది. ఇవన్నీ శ్వాస మీద ప్రభావం చూపుతాయి. శ్వాస నడిచే సరళి మారుతుంది; ఛాతీలో వత్తిడి, కడుపులో మంట రేకెత్తిన భావన కలుగుతుంది. ఈ విధంగా ఆలోచనలు శరీరంలోకి చొరబడినప్పుడు, అది ఒక ఉద్వేగంగా మారి, మీరు వెంటనే దాన్ని బయటకు వెళ్ళగక్కాలని భావిస్తారు.

దురాశ, ఆందోళన, కామం వంటి ఉద్వేగాలను ఉత్పన్నం చేసే ప్రక్రియలు కూడా ఇదేరీతిలో సాగుతాయి.

ధ్యానం నేర్పే రెండు పాఠాలు

ధ్యాన సాధన ఈ ప్రక్రియల గురించి తెలుసుకోటానికి ఉపకరించటమే గాక, అది మీకు వాటి గురించి రెండు ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. మొదటిది – ఈ ప్రక్రియలు ఎల్లప్పుడూ కేవలం బాహ్య ఘటనలకు ప్రతిస్పందనలుగా జరగవు. తరచూ మీరు సంఘటనలకు ఉద్వేగ ప్రక్రియలను జోడిస్తారు. మరోరకంగా చెప్పాలంటే, ఉద్వేగాలను ప్రేరేపించే వస్తువులతో సంపర్కం కలగకముందే, మీరు కోపంతో, కామంతో లేదా దురాశతో ప్రవర్తించటానికి సిద్ధంగా ఉంటారు. తరచూ మనసు ఉద్వేగ పూరిత అనుభవాల కోసం వెదుకుతుంటుంది. హింసతో కూడిన సినిమాలు, ఆన్-లైన్ షాపింగ్, ఇంటర్నెట్లో అశ్లీలచిత్రాలు నిరంతరం చలామణిలో ఉండటానికి కారణం ఇదే. ఎలెక్ట్రానిక్ సాధనాలు వాటంతటవే తెరుచుకోవు. మనలో అప్పటికే సిద్ధంగా ఉన్న ఉద్వేగాలను ప్రకోపింప చెయ్యటానికి అటువంటి సాధనాలను మనం స్విచ్-ఆన్ చేస్తాం. అందుకే బుద్ధుడు ఉద్వేగాలను ప్రవాహాలు అని మాత్రమే గాక, ఆస్రవాలు (ఆసవాలు) అని వర్ణించాడు. అవి పుండు నుంచి కారే రసిక లేక చీము వలె నిరంతరం బయటకు స్రవిస్తూ (కారుతూ), పరిసరాలను కలుషితం చేస్తుంటాయి.  

ఉద్వేగ ప్రక్రియల గురించి ధ్యాన సాధన నేర్పే రెండో పాఠం ఏమిటంటే, ఈ ప్రక్రియలు మీ పాత అలవాట్లతో ప్రభావితం అవుతున్నా, మీరు కావాలనుకుంటే వాటిని మార్చవచ్చు. అకుశలమైన అలవాట్లను తొలగించి, వాటి స్థానంలో కుశలమైన అలవాట్లను పెంపొందించగల అవకాశం లేనట్లయితే, తాను అసలు ధర్మబోధన చేసేవాణ్ణి కాదని బుద్ధుడు చెప్పాడు. వాస్తవానికి, బుద్ధుని బోధనల్లో అధికభాగం అకుశలమైన అలవాట్లను తొలగించటానికి, వాటికి మారుగా కుశలమైన అలవాట్లను పెంపొందించటానికి ఉద్దేశించినవే. ఆయన ధ్యానం గురించి చెప్పిన ఉపదేశాలు, మీరు కళ్ళు మూసుకుని కూర్చున్నపుడు మాత్రమే గాక, ఇతర సమయాల్లో కూడ కాయ సంఖారాలతో మెలకువగా వ్యవహరించటం ఎలాగో నేర్పుతాయి. అతని ఇతర బోధనలు నైపుణ్యం కలిగిన వాచిక సంఖారాలకు ఉదాహరణలు. ఆయన చెప్పిన అనేక ఉపమానాలు, ఊహాచిత్రాలు, నైపుణ్యంతో కూడిన మానసిక సంఖారాలు. మీ మనసును ఆక్రమించిన అకుశల స్థితులను మార్చటానికి వీటిని మీరు ఉపయోగించవచ్చు. ఆయన బోధనలు అంతిమంగా మనసును అన్నిరకాల సంఖారాల నుండి విముక్తి చేస్తాయి. అయితే, అక్కడికి చేరటానికి ముందు, అకుశలమైన పాత అలవాట్ల నుండి బయటపడటానికి, మీరు కుశలమైన కాయక, వాచిక, మానసిక సంఖారాలను ఉత్పన్నం చెయ్యటం ఎలాగో నేర్చుకోవాలి.  

ఉదాహరణకు, కామోద్రేకం ఆకర్షణను, లేదా కోపోద్రేకం శక్తిని ధైర్యాన్ని కలిగిస్తుందనే భావన మీకు ఉన్నట్లయితే, వాటికి విరుగుడుగా కామం లేదా కోపం వల్ల కలిగే అనర్థాలను తెలియజేసే మానసిక సంఖారాలను (ఊహాచిత్రాలు, భావనలను) ఉత్పన్నం చెయ్యాలని బుద్ధుడు సూచించాడు.  కామ భావనకు విరుగుడుగా ఆయన సూచించిన ఉపమానాల్లో, కామ పరమైన ఆలోచనలు చేసే వ్యక్తిని “ఎముకను నములుతున్న కుక్క”తో పోల్చటం ఒకటి. ఎముకను నమిలే కుక్కకు ఆకలి తీరదు, సరికదా, దానికి మిగిలేది ఆయాసం మాత్రమే. మరో ఉపమానంలో, కాముకుణ్ణి “మాంసపు ముక్క దొరికిన కాకి”తో పోల్చటం జరిగింది. ఆ మాంసాన్ని గుంజుకోటానికి గ్రద్దలు వెంటబడి కాకిని పొడుస్తాయి. దీనితో ఆ కాకి గాయాల పాలవటం లేదా అది దుర్మరణం పాలవటం కూడ జరగవచ్చు. కామపిపాసను ఈ విధంగా చూడటం నేర్చుకుంటే, అది ఆ ఉద్వేగాన్ని అధిగమించటంలో మీకు ఊతమిస్తుంది.

కోపం విషయానికొస్తే, మూడు రకాల (కాయక, వాచిక, మానసిక) సంఖారాలను ఉపయోగించి, కోపమనే ఉద్వేగాన్ని నిర్వీర్యం చేసి, దాని స్థానంలో సానుకూల స్థితులను (ప్రీతి, ప్రశాంతత) నెలకొల్పటానికి బుద్ధుడు అనేక ఉపాయాలు సూచించాడు. ఉదాహరణకు, మీ పై అధికారి చేసిన ఒక పని గురించి మీరు కోపంగా ఉన్నారని అనుకుందాం. అప్పుడు మీ మనసులో అతని గురించి ప్రతికూలమైన మాటలు దొర్లుతుంటాయి. అటువంటప్పుడు, “కోపంతో వ్యవహరిస్తే నేను తెలివితక్కువగా మాట్లాడవచ్చు లేదా తెలివిమాలిన పనులు చెయ్యవచ్చు” అని మనసులో అనుకుంటే మీ కోపం అదుపులో ఉంటుంది. అప్పుడు మీరు స్పష్టమైన ఆలోచనతో, ఆ సందర్భానికి తగినట్లు ప్రయోజనకరంగా మాట్లాడగలరు. 

అప్పుడు మీ శరీర సంఖారం, అంటే, మీ శ్వాస ఎలా సాగుతుందో గమనించండి. ఎగసిపడుతూ కోపానికి ఊపిరులూదుతున్న శ్వాసను శాంతింప జెయ్యటానికి ప్రయత్నించండి. శ్వాస శాంతించినప్పుడు అది మీకు శారీరక సంఖారాన్ని మాత్రమే గాక, కొంతమేరకు అంతరంగ ప్రశాంతత అనే మానసిక సంఖారాన్ని కూడా అందిస్తుంది.  

అప్పుడు మీలో మెదులుతున్న మనోసంఖారాలను, అంటే ఆ సమయాన మీ పై అధికారి గురించి, మీ గురించి, మీ మనసులో మెదులుతున్న ఊహాచిత్రాలను గమనించండి. మీ బాస్ ముందు మీరు బలహీనునిగా లేదా ఒక బకరాగా ఉన్నానని భావిస్తున్నారా? అయితే, మీరు భూమి వంటి సుస్థిరమైన  మైత్రీ భావనను మననం చేసుకోవాలని బుద్ధుడు సూచించాడు. జనం భూమిని తవ్వుతారు, దాని మీద ఉమ్ముతారు, మల మూత్రాలు విసర్జిస్తారు. అయినా వారు భూమిపైనే ఆధారపడి జీవించక తప్పదు.

ఇక మీ బాస్ గురించి మీరు ఎలా ఊహిస్తారు? ఒక దుర్మార్గునిగా లేక తెలివితక్కువ దద్దమ్మగా ఊహిస్తారా? అలాంటి స్థితిలో, మీరు మీ బాస్ పట్ల నైపుణ్యంతో వ్యవహరించాలని కోరుకుంటే, అతని/ఆమె పట్ల అపారమైన సానుభూతిని పెంపొందించుకోవాలని బుద్ధుడు సూచించాడు. లేదంటే, మీరు లోకంలో అందరిని దుర్మార్గులుగా, తెలివిలేని దద్దమ్మలుగా పరిగణిస్తారు; చివరకు మీరు అటువంటి వ్యక్తిగా మారతారు.  

కనుక, మీరు మీ దృష్టిని మార్చుకోవాలి. మీరు ఒంటరిగా ఒక ఎడారిలో పయనిస్తున్నట్లు ఊహించండి. తీవ్రమైన ఎండలో నడుస్తూ మీరు అలిసిపోయి, దాహంతో అల్లాడిపోతున్నారు. అప్పుడు మీకు, నేలమీద ఒక జంతువు పాదముద్రలో దోసెడు నీళ్ళు కనిపించాయి. ఆ నీటిని దోసిట్లోకి తీసుకుని తాగటానికి ప్రయత్నిస్తే, నీరు బురదతో కలుషితం అవుతుంది. కనుక, మీరు మోకాళ్ళు మోచేతులు నేలపై మోపి, తలవంచి, జాగ్రత్తగా నోటితో పీలుస్తూ నీటిని తాగాలి. ఇదీ బుద్ధుడు సూచించిన ఊహాచిత్రం. ఇది ఏమంత గౌరవనీయమైన పని కాదు – ఆ దృశ్యాన్ని ఫోటో తీసి పటం కట్టించుకోవాలని మీరు కోరుకోరు! కాని, మీరు బ్రతాకాలని కోరుకుంటే అలా నీరుతాగటం తప్ప మరోదారి లేదు.

దీని భావం ఏమిటంటే – మీ బాస్ చాల దుర్మార్గుడు, పెద్ద మూర్ఖుడు అయినాసరే, మీరు అతని దుర్గుణాలనే బురదపై తేలియాడే సుగుణాల తేటనీటిని జాగ్రత్తగా గుర్తించాలి. అతను మీ మైత్రికి అర్హుడు కాడని, అతని పట్ల దయచూపటం మీ స్థాయిని కించపరుస్తుందని మీరు భావించవచ్చు. కాని, పైన ఉటంకించిన ఉదంతం చెప్పేదేమంటే, మీలోని మంచితనం బ్రతకాలంటే మైత్రిని పెంపొందించక తప్పదు. ఎటువంటి స్థితిలోనైనా ఇతరుల్ని అంచనావేసేటప్పుడు అప్రమత్తతతో వ్యవహరించాలి. లేదంటే, మీరు దీర్ఘకాలం చింతించే రీతిలో హానికరమైన పనులు చెయ్యటం లేదా హానికరమైన మాటలు మాట్లాడటం జరుగుతుంది. కనుక, మీలో రేకెత్తిన కోపోద్వేగానికి లొంగిపోకుండా ఉండాలంటే, ఆ కోపానికి కారణమైన వ్యక్తిలో (మీ బాస్) గల సుగుణాలను మీరు గుర్తించగలగాలి.

మీ ప్రత్యర్థిలో మీకు ఎటువంటి సుగుణాలు కనిపించని పక్షంలో, బుద్ధుడు మరొక ఉపాయాన్ని సూచించాడు. మీరు ఎడారిని దాటుతుండగా, దారి పక్కన అసహాయ స్థితిలో పడివున్న ఒక రోగి మీకు కనిపించినట్లు ఊహించండి. అక్కడ అతనికి సాయం చేసేవారు ఎవరూ లేరనుకోండి. ఆ మనిషి ఎలాంటివాడు అనేదానితో నిమిత్తం లేకుండా మీరు అతని పట్ల సానుభూతి చూపించాలి. అదే విధంగా, మీ బాస్ పూర్తిగా తెలివిమాలిన వాడు అయితే, అతను తనకు తాను సృష్టించుకుంటున్న దుస్థితిని చూసి, మీరు అతని పట్ల జాలిపడాలి. మనసులో అటువంటి భావన కలిగితే, మీరు ఆ సందర్భంలో కుశలమైన, క్రియాశీలమైన మాటలు మాట్లాడటానికి లేదా అటువంటి పని చెయ్యటానికి తగిన విశ్వాసాన్ని పొందుతారు.

ఆస్వాదం – ప్రమాదం – విముక్తి

ఈ విధంగా అనుభవాలను పునర్నిర్మించే పద్ధతులు – అంటే అకుశల ఉద్వేగాలను శాంతింపజేసి, కుశల స్థితులను ఉత్పన్నంచేసే పద్ధతులు – హానికరమైన ఉద్వేగాలకు అంతిమ పరిష్కారం కాదు. వీటివలన ఉద్వేగ ప్రవాహాలు అంతంకావు. అవి కేవలం వాటికి అడ్డుకట్ట వేసి, మెరుగైన దారిలోకి మళ్ళిస్తాయి. అయితే, దీనివల్ల మీకు ఉద్వేగాలపై అదుపు లభించటంతో, మీరు కేవలం వాటికి లొంగిపోవటం లేదా వాటిని అణిచివెయ్యటం గాక, మరో మెరుగైన దారి ఎంచుకోగలుగుతారు. దీనికంటే ముఖ్యంగా, ఈ విషయంలో మీరు నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే, మీరు కట్టే ఆనకట్టలు క్రమంగా ఉద్వేగాల మూలాలకు దగ్గరగా చేరతాయి. చివరకు మీరు ఆ మూలాలను పూర్తిగా తొలగించటానికి అవసరమైన ప్రజ్ఞను పొందగలుగుతారు. బుద్ధుడు చెప్పినట్లు, “ప్రజ్ఞ మాత్రమే ఉద్వేగ ప్రవాహాలను నిరోధించగలదు.” మీరు ఉద్వేగాలు అందించే ఉబలాటం (ఆస్వాద), వాటిలోని ప్రమాదం (ఆదీనవ), వాటి నుంచి విముక్తి (నిస్సరణ) అనే మూడు స్థితులను స్పష్టంగా తెలుసుకోకుండా, మానసిక స్థితులను ప్రజ్ఞావంతంగా తెలుసుకోవటం సాధ్యపడదు [మధ్యమ నికాయ 14].

అసలు మనం “వస్తువుల గురించి, అనుభవాల గురించి ఎందుకు ఆరాటపడతాం? అలా ఆరాటపడకుండా ఉండటం ఎలా” – అనే విషయాలపై బుద్ధుడు అందించిన విశ్లేషణకు ఇది అనుగుణంగా ఉంది. వస్తువులు ఆనందం కలిగించకపోతే, అవి ఉబలాటం కలిగించలేవు, ఉబలాటం లేనప్పుడు వాటికోసం మనం ఆరాటపడం. వస్తువులకు బాధ కలిగించే గుణం లేకపొతే, వాటిని వదిలించుకోవాలని మనం కోరుకోం. అంటే, వాటి కోసం పడే ఆరాటం వలన కలిగే బాధ కంటే, అవి అందించే ఆనందం ఎక్కువని అనుకున్నంత కాలం, మనం వాటికోసం ఆరాటపడతాం. ఉద్వేగాలు అశాశ్వతం లేదా వాటికి స్వంత అస్తిత్వం లేదని మనకు మనం ఎంత చెప్పుకున్నా, మనం ఇలాగే చేస్తాం. ఆహారం, సెక్సు అశాశ్వతమని మనకు స్పష్టంగా తెలిసినా మనం వాటికోసం ఆరాటపడతాం; నిజానికి వాటి అశాశ్వత లక్షణమే వాటికోసం మరింత ఆరాటం పెంచుకునేట్లు చేస్తుంది. ఉద్వేగాలు కలిగించే ఆనందం కంటే, వాటి వల్ల కలిగే ప్రమాదం చాల ఎక్కువని తెలుసుకోగలిగితేనే, మనం వాటిని వదిలెయ్యగలం. ఆనందం ఆమూర్తమైంది కాదు, కనుక, “అస్తిత్వపు అంతిమ సత్యం” వంటి ఆమూర్త పరిష్కారాలు పనిచెయ్యవు. నిర్దిష్ట అకుశల ఉద్వేగాలు కలిగించే ఉబలాటం కంటే, దానివలన కలిగే ప్రమాదాలు ఎక్కువని తెలుసుకుంటేనే మనం వాటిని వదిలెయ్యగలం.

కనుక, మీరు త్యజించాలనుకునే అకుశల ఉద్వేగం కలిగించే ఉబాలాటాన్ని స్పష్టంగా చూడగలిగే మార్గం ఏమిటంటే, ఆ ఉద్వేగాన్ని అదుపుచేస్తూ, అందుకోసం మీరు కట్టిన ఆనకట్ట (సతి) ఎక్కడన్నా వదులుగా ఉందేమో చూడాలి. తాను ఆశించదగిన దాన్నని చెబుతూ, దానిని మీరు మళ్ళీ కోరుకోటానికి తగిన కారణాలను చూపించటానికి, ఉబలాటం అనేది మీలోని బలహీన క్షణాల కోసం వెదుకుతుంటుంది. అయితే, కుశల సంఖారాలతో శక్తి పుంజుకుంటూ, మీరు దాని కారణాలను తిరస్కరించే కొలదీ, అది దాని మూల కారణాలను మరింత బహిర్గతం చేస్తుంది.

మళ్ళీ ఇక్కడ, మూడు రకాల సంఖారాల గురించి బుద్దుడు చెప్పిన విశ్లేషణ మీకు ఉపకరిస్తుంది. మీ ఆనకట్టకు (సతికి) ఎక్కడ గండ్లు పడ్డాయో తెలుసుకోటానికి అది కొన్ని సూచనలు అందిస్తుంది. ఒక వస్తువు లేదా పని పట్ల మనకు కలిగే తపన (ఆరాటం) ఎల్లప్పుడూ ఆ వస్తువు లేక పని మీద మాత్రమే దృష్టి నిలపదు. అది తరచూ వాటి చుట్టూ ఉండే మానసిక లేదా వాచిక సంఖారాల మీద గురిపెడుతుంది; అంటే, వాటి గురించి మనసులో కలిగే ఊహల మీద, మన అంతరంగంలో జరిగే ఆలోచనల మీద గురిపెడుతుంది. ఒక వ్యక్తి పట్ల మనకు ఉండే ఆరాటం ఆ వ్యక్తి మీద గాక, సదరు వ్యక్తి గురించి మనకు గల అభిప్రాయాలు, ఆలోచనలపై కేంద్రీకరించి ఉండొచ్చు. లేదా ఆ వ్యక్తి విషయంలో మన పట్ల మనం ఏర్పరచుకున్న ఆలోచనలపై అది కేంద్రీకరించవచ్చు. వస్తువుల పట్ల మనకు ఉండే ఆరాటానికి కూడా ఇదే వర్తిస్తుంది. అందుకే, వ్యాపార ప్రకటనలు రూపొందించే నిపుణులు వస్తువుల గురించి చెప్పటం కంటే, వాటి చుట్టూ రకరకాల కథనాలను అల్లటం, వాటి గురించి మనలో ఉద్వేగాలను రగిలించటం మీద ఎక్కువ కృషి చేస్తుంటారు. కోపం పట్ల మనకుండే ఆరాటాన్ని పరిశీలిస్తే, అది మనం ‘కోపగించటం సరైనదే’ అని సమర్థించే మాటల సంఖారంపై గురిపెడుతుంది. ఉదాహరణకు, మన ఆలోచనలు మనకు ఎలా హాని కలిగిస్తున్నాయనే విషయాన్ని పట్టించుకోకుండా, మనం ఆలోచించే తీరు సరైనదేనని భావించి, అలాగే ఆలోచిస్తుంటాం. చివరకు మనం ఆరాటం పట్ల కూడా ఆరాటం పెంచుకుంటాం.

కనుక, మీ ఆరాటం నిర్దిష్టంగా ఎక్కడ కేంద్రీకరించి ఉందో మీరు చూడగలగాలి. ఎందుకంటే, ఉద్వేగం కలిగించే ఆరాటాన్ని అక్కడే చూడగలం. మీరు దాని వలలో పడకుండా దృఢంగా నిలబడినప్పుడు, ఒకానొక క్షణంలో సత్యం గోచరిస్తుంది. అప్పుడు, తాను అకుశల ఉద్వేగాలను ఎందుకు కోరుకుంటుందో  మనసు బహిర్గతం చేస్తుంది. మీరు ఉద్వేగాల వెనుక గల నిజమైన కారణాన్ని చూడగలిగినప్పుడు, అది ఒక తెలివిమాలిన పని అని మీరు గుర్తించగలుగుతారు. అది అందించే ఆనందం కంటే, దాని ద్వారా కలిగే ప్రమాదం చాల పెద్దదనే సత్యాన్ని తెలుసుకుంటారు.

దీని అర్థం ఏమిటంటే, సరైన జ్ఞానం కుశల అకుశల స్థితులను వివేచనా శక్తితో అంచనా వెయ్యగలదు. మీరు గతంలో తక్కువ నైపుణ్యంతో చేసిన వివేచనకు భిన్నంగా, సంపూర్ణ విరాగ విముక్తికి మనసును సిద్ధం చెయ్యటమే అది సరైన జ్ఞానం అనటానికి రుజువు.

విరాగం అనగానే, అది ద్వేషం లేక తిరస్కారం లేక పలాయనవాదం అనిపిస్తుంది, కాని దానర్థం అది కాదు. విరాగం అంటే పరిణితి చెందిన వివేచన. విరాగ స్థితిలో మీకు మీ పాత అలవాట్లు పిల్లచేష్టల్లా కనిపిస్తాయి, అప్పుడు మీరు వాటిని దాటి ఎదగటానికి సిద్ధమౌతారు. ఇంతకాలంగా ఉద్వేగాలు అన్నిరకాల (కుశల, అకుశల) సంఖారాలను నడిపిస్తున్నాయి, కనుక, విరాగం అనేది అంతిమంగా మీ మనసులో ప్రవహిస్తున్న అన్ని ప్రవాహాల నుండి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది.

నిజమైన విముక్తి, మనసును దాని ఇష్టమొచ్చిన రీతిలో పరుగులు తీయటానికి అనుమతించటంలో గాక, దానిలోని ప్రవాహాల వరదను నిలువరించటంలో ఉందని తెలుసుకోవాలి. ఈ విముక్తి ద్వారా కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే, మనసుకు ఇక ఏమాత్రం అబద్ధాలతో తనను తాను మోసగించవలసిన అవసరం ఉండదు. అది తాను చేసే చర్యల పట్ల, వాటి ఫలితాల పట్ల చిత్తశుద్ధితో సూటిగా వ్యవహరించగలదు.

ఏమాత్రం హాని కలిగించని, మార్మికతకు తావులేని విముక్తి ఇది.   

తెలుగుసేత: డి. చంద్రశేఖర్