రచన: డి. చంద్రశేఖర్

బౌద్ధగ్రంథాల్లో “మార” అనే పేరుతో ఒక పాత్ర కనిపిస్తుంది. ఈ మారుని ప్రస్తావన పాలి నికాయాల్లో విడివిడిగా చాలచోట్ల ఉంది. అయితే, సంయుత్త నికాయలోని మారసంయుత్త, భిక్ఖునిసంయుత్త అనే అధ్యాయాలు, ప్రత్యేకంగా మారుని గురించి వివరించాయి. నికాయాల్లో మారుని ప్రస్తావన గల సుత్తాలను పైపైన చదివితే, మారుడు అదృశ్యంగా సంచరించే ఒక దుష్టశక్తి లేక సత్వుడు అనే అభిప్రాయం కలగవచ్చు. కాని, వాటిని లోతుగా పరిశీలించిచూస్తే, మారుడు అనేది మనిషిలోని ప్రతికూల మానసిక స్థితులను లేక ఆలోచనలను వ్యక్తీకరించే పాత్ర లేదా ప్రతీక అని తెలుస్తుంది. కొన్ని సినిమాల్లో, ఒక వ్యక్తి తన ప్రతిబింబంతో వాదించే సన్నివేశాలు చూస్తుంటాం. ఆ వ్యక్తి అంతరంగంలో దాగిన గూఢమైన ఆలోచనల దృశ్యరూపమే ఆ ప్రతిబింబం. బౌద్ధగ్రంథాల్లో కనిపించే మారుని పాత్ర దాదాపు ఇలాంటిదే అనుకోవచ్చు. బౌద్ధగ్రంథాల్లోని కొన్ని ఉదాహరణల సాయంతో, ఈ మారుని పాత్ర స్వభావాన్ని వివరించటం ఈ వ్యాసం ఉద్దేశం .

మారుని అసలురూపం

మారసంయుత్తలోని అధికశాతం సుత్తాల్లో, “అప్పుడు మారుడు భగవానుని (బుద్ధుని) సమీపించి ఇలా అన్నాడు” అనే మాటలతో మారుని పాత్ర పరిచయమౌతుంది. అలాగే, వీటి చివర, “మారుడు దుఃఖితుడై దిగాలుపడి అక్కడికక్కడే అదృశ్యమయ్యాడు” అని ఉంటుంది. అయితే, కొన్ని సుత్తాల్లో, మారుడు ఒక పెద్ద ఏనుగు లేదా భయానకమైన సర్పం లేదా మనిషి రూపంలో బుద్ధుని వద్దకు వచ్చినట్లు వర్ణించటం జరిగింది. ఇటువంటి వర్ణనల కారణంగా, మారుడు అతీంద్రియశక్తులు గల ఒక సత్వుడు అనే అభిప్రాయం కలగటం సహజం. ఇటువంటి కథనాలు, నికాయాలను సంకలనం చేసినవారి కల్పనలని చెప్పటానికి, తగిన ఆధారాలు మారసంయుత్తలో కనిపిస్తాయి.

ఇప్పుడు, “మార అంటే ఏమిటి?” అనే ప్రశ్నకు బుద్ధుడు సూటిగా చెప్పిన నిర్వచనం ఏమిటో చూద్దాం. ఒకానొక సందర్భంలో, రాధ అనే భిక్షువు బుద్ధుని వద్దకు వెళ్లి, “భంతే, ‘మార, మార’ అంటుంటారు, మారుణ్ణి ఏ విధంగా  అర్థంచేసుకోవాలి?” అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు చెప్పిన సమాధానం ఇది: “రాధా, రూపం ఉన్నప్పుడు మారుడు లేదా హంతకుడు లేదా హతమయ్యేది ఉండవచ్చు. కనుక, రూపాన్ని మారునిగా, హంతకునిగా, హతమయ్యే దానిగా చూడాలి. దాన్నొక రుగ్మతగా, ఒక పుండుగా, ఒక బాణంగా, ఒక అవస్థగా, నిజమైన దురవస్థగా చూడాలి. అలా చూసినవారు, దాన్ని సరిగా అర్థంచేసుకుంటారు.” (ఇదేరీతిలో తరువాత వేదన, సంజ్ఞ, సంఖార, విజ్ఞాన గురించి చెప్పటం జరిగింది) [1]. ఈ నిర్వచనం ప్రకారం, పంచస్కంధాల పట్ల కలిగే ఆరాటం (తృష్ణ) మనిషికి నిరంతరం మరణయాతన వంటి దురవస్థను కలిగిస్తుంది కనుక, వాటిని మారుడు అంటే, చంపేవాడు లేక మృత్యువు అని పిలిచినట్లు స్పష్టంగా తెలుస్తుంది.

మరొక సుత్తంలో, మారుణ్ణి ఇంద్రియ అనుభవంతో ముడిపెట్టి నిర్వచించటం జరిగింది: “అవిద్యాపరుడైన వ్యక్తి కంటితో దృశ్యాలను చూసినప్పుడు, ఇష్టమైన రూపాల పట్ల ఆకర్షణ, అయిష్టమైన రూపాల పట్ల వికర్షణ కలుగుతాయి. ఇలా, ఆకర్షణ వికర్షణలకు లోనైన వ్యక్తి కంటి ద్వారా, మారుడు అతణ్ణి సమీపించి అవహిస్తాడు. (ఇదేరీతిలో, చెవి-శబ్దాలు, నాలుక-రుచులు, ముక్కు-వాసనలు, శరీరం-స్పర్శల గురించి). దీనితో ఆ వ్యక్తి ఆయా రూపాలకు, శబ్దాలకు, రుచులకు, వాసనలకు, స్పర్శలకు బానిసవుతాడు. దీనిఫలితంగా ఆవ్యక్తి వివిధ రకాలుగా దుఃఖానికి లోనవుతాడు” [2]. దీనిలో కూడ, రాగద్వేషాలకు ప్రతీకగా మారుడు అనే పాత్రను సృష్టించినట్లు స్పష్టమౌతుంది. 

పైన ఉటంకించిన నిర్వచనాల ప్రకారం, అవిద్యతో, అజాగ్రత్తతో, తన అనుభవాల పట్ల తగిన అదుపు లేకుండా జీవించే వ్యక్తిలో హానికరమైన, అకుశలమైన ఆలోచనలు తలెత్తుతాయి. ఇటువంటి మానసిక స్థితులను సూచించే సంకేతమే మారుడు. అందుకే, బౌద్ధగ్రంథాలు మారుణ్ణి “దుర్మతి” అని పిలవటం జరిగింది [3].         

మరికొన్ని సుత్తాల్లో మారుడు భయం, ఆందోళన, పరధ్యానం, నిరుత్సాహం, సందేహం వంటి ప్రతికూల మానసిక స్థితులను, ఇంకా లౌకిక సుఖాల పట్ల ఆశలను ప్రేరేపించి, బుద్ధుణ్ణి లేక ఆయన శిష్యులను ధర్మాచరణ నుండి పక్కదోవ పట్టించటానికి ప్రయత్నించినట్లు చెప్పబడింది. ఉదాహరణకు, ఒకానొక సందర్భంలో మారుడు, “భంతే, భగవానుడు రాజ్యాన్ని పాలించాలి, సుగతుడు రాజ్యపాలన చెయ్యాలి” అంటూ బుద్ధుణ్ణి ప్రేరేపిస్తాడు. అప్పుడు బుద్ధుడు, “దుఃఖ మూలాన్ని తెలుసుకున్న వ్యక్తి, రాజభోగాలను ఆశించడు. లోకంలోని భోగాలు బంధనమని తెలిసినవాడు, వాటిని వదిలించుకునే ప్రయత్నం చేస్తాడు” అని బదులివ్వగానే, మారుడు బాధతో అంతర్ధానమైనట్లు చెప్పబడింది. [4]

ఇలా బౌద్ధగ్రంథాల్లో, సంబోధి కోసం ధర్మాన్ని ఆచరించేవారు అలసత్వానికి గురైన సందర్భాల్లో మారుణ్ణి “ప్రమత్తబంధువు” అని, కొన్నిచోట్ల “అంతకుడ”ని అన్నారు. మనిషిలో జనించే ప్రతికూల ఆలోచనల తీవ్రతను తెలియజెయ్యటానికి “మారసేన” అని, మనిషి కన్నుగప్పి బంధిస్తాయనే అర్థంలో వాటిని “మారుని ఉచ్చు”, “మారునుని గాలం”, ఇంకా “మారబంధనం” అని పిలవటం జరిగింది. ఇక, ప్రతికూల ఆలోచనల్లో గడిపే వ్యక్తిని వర్ణించటానికి, అతడు “మారుని ఇంటికి చేరాడ”ని, “మారునికి బందీగా చిక్కాడ”ని, “మారబద్ధుడ”ని అన్నారు.

మారుని ప్రభావానికి లోనవటం, అనగా, ప్రతికూల ఆలోచనలకు గురికావటం అనేది, ధర్మసాధనలో పరిపక్వతలేని వ్యక్తుల్లోనే జరుగుతుందని అనుకోవటం సరికాదు. ఎందుకంటే, ఆనందుడు తదితర ప్రజ్ఞావంతులైన భిక్షువులు, భిక్షుణిలు మారుని ప్రభావానికి లోనైనట్లు చెప్పే అనేక సుత్తాలు బౌద్ధగ్రంథాల్లో ఉన్నాయి. ఉదాహరణకు, బుద్ధుడు మరణాంతకమైన అనారోగ్యానికి గురైన సందర్భంలో, ఆనందుడు తీవ్రంగా కలత చెందినట్లు మహాపరినిర్వాణ సుత్తం చెబుతుంది. ఈ సందర్భంలో ఆనందుడు “మారుని వశంలో చిక్కాడ”ని చెప్పబడింది. ఇంతకంటే ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, జ్ఞానోదయం పొందక ముందు, అటుతరువాత కూడ, బుద్ధుడు రకరకాల రూపాల్లో మారుణ్ణి ఎదుర్కున్నట్లు బౌద్ధగ్రంథాలు చెప్పాయి. అయితే, జ్ఞానోదయమైన తరువాత బుద్ధుడు భయం, ఆందోళన, పరధ్యానం, నిరుత్సాహం, సందేహం, కామపిపాస వంటి ప్రతికూల మానసిక స్థితులను ఎదుర్కొన్నట్లు ఎక్కడా చెప్పలేదు. కాని, “ధర్మబోధన చాలించండి, జీవితాన్ని ముగించండి” అంటూ మారుడు బుద్ధుని వెంటపడిన ఉదాహరణలు చాల కనిపిస్తాయి.

ఇలా మారుని ప్రభావానికి లోనైన అత్యధిక సందర్భాల్లో, బుద్ధుడు, ఆయన శిష్యులు, మారుని వశంలో చిక్కకుండా తప్పించుకున్నారని బౌద్ధగ్రంథాలు చెబుతాయి. ఈ భావాన్ని చాటటానికి రకరకాల పదాలను ప్రయోగించటం జరిగింది. ఉదాహరణకు, నికాయాల్లో “మారసేన మర్దనుడు”, “మారునుని అంధుణ్ణి చేశాడు”, “మారునికి కనిపించడు”, “మారుని అధిగమించాడు”, “మారసేనను చిత్తుచేశాడు”, “ప్రజ్ఞాయుధంతో మారుని జయించాడు” అనే మాటలు కనిపిస్తాయి. అలాగే, “శీలసంపంద కలిగి, అప్రమత్తులై, జ్ఞావిముక్తి పొందినవారి జాడను మారుడు కనుగొనలేడ”ని ధమ్మపదం (57) చెప్పింది.

ఇంతవరకూ చెప్పుకున్న విషయాల ప్రకారం, మారుడు అతీంద్రియ శక్తులు గల సత్వుడు కాదని, అది మనలో తలెత్తే రకరకాల అకుశల లేక ప్రతికూల మానసిక స్థితుల ప్రతిరూపమని స్పష్టంగా తెలుస్తుంది. ఆధునిక బౌద్ధపండితులు చాలమంది ఇదే అభిప్రాయాన్ని నొక్కిచెబుతున్నారు. ఉదాహరణకు, బౌద్ధగ్రంథాల్లో మారుని వృత్తాంతం గురించి చెబుతూ ప్రముఖ బౌద్ధరచయిత్రి సూ హామిల్టన్, “అది ఒక కల్పన, బోధనకు అనువైన ఒక సాధనం, అంతేగాని అది చరిత్ర కాదు. …. ప్రతివ్యక్తి తనకు తానే ఒక మారుడు” అని అన్నారు.  [5] 

మరి, బుద్ధుడు ప్రతికూల మానసిక స్థితులను సూచించటానికి, మారుడనే ప్రతీకను లేక సంకేతాన్ని వాడవలసిన అవసరం ఏమిటి? అనే ప్రశ్నకు మనం సమాధానం తెలుసుకోవాలి. ఇందుకు ముఖ్యంగా రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటి, అసంఖ్యాకమైన ప్రతికూల మానసిక స్థితులను సులువుగా బోధించటానికి ఒక సంకేతం అవసరం. అందుకే, విఘాతకరమైన ఆలోచనల్ని కళ్ళకు కట్టినట్లు చూపించటానికి, బుద్ధుడు “మార” అనే ప్రతీకను వాడినట్లు కనిపిస్తుంది.  ఇక రెండవది, సాధకులు తమలోని దుర్మతిని సులభంగా పసిగట్టటానికి, దాన్నుండి బయటపడటానికి, ఇటువంటి సంకేతం ఒక విలువైన ఉపాయంగా పనిచేస్తుంది.          

మారుని పురాణం

మూల బౌద్ధగ్రంథాల్లో “మారుడు” అంటే ఏమిటి, ఈ భావన బుద్ధుని బోధనల్లో ఎలా ఉపయోగించబడింది, అనే విషయాల గురించి చెప్పుకున్నాం. అయితే, కాలక్రమంలో మారుణ్ణి ఒక అదృశ్యశక్తిగా, అతీతశక్తులు గల ఒక పురాణ పాత్రగా మలిచే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తుంది. బుద్ధుని పరినిర్వాణం తరువాత, త్రిపిటకాలను కూర్పుచేసే క్రమంలో, మారునికి ‘నిజరూపం’ కల్పించే ధోరణి మొదలైందని భావించటానికి కొన్ని సూచికలు కనిపిస్తున్నాయి.

మారుని కథను సాగదీసి చెప్పిన, బహుశా, తొలి ప్రయత్నం మారసంయుత్తలోని చివరి రెండు సుత్తాల్లో కనిపిస్తుంది. ఈ రెండు సుత్తాలు, ఒకే కథనంలో రెండు భాగాలని నిస్సందేహంగా చెప్పొచ్చు. (పాలి నికాయాల్లో ఇలా ఉండటం చాల అరుదు.) మొదటిదానిలో, జ్ఞానోదయం కోసం బుద్ధుడు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోటానికి మారుడు ఏడేళ్ళపాటు తీవ్రంగా ప్రయతించి, చివరకు తాను ఓడిపోయానని అంగీకరిస్తాడు [6].

ఇక రెండవదానిలో, ఓటమితో నిరాశ నిస్పృహలకు లోనైన మారుడు, బుద్ధునికి దూరంగా వెళ్లి దిగులుతో ఒంటరిగా కూర్చుని ఉంటాడు. అప్పుడు అతని ముగ్గురు కుమార్తెలు (తణహా, అరతి, రాగ) తమ తండ్రి దీనావస్థను తొలగించటానికి రంగంలోకి దిగుతారు. అంటే, బుద్ధుణ్ణి వశపర్చుకుని, దారిమళ్ళించే ప్రయత్నం చేస్తారు. మొదట ఈ ముగ్గురు, బుద్ధుని దగ్గరకెళ్లి పరిచర్యలు చేస్తామని చెబితే, బుద్దుడు వారిని పట్టించుకోడు. తరువాత వారు, ఒక్కొకరు వందమంది అందమైన యువతులుగా అవతరించి, బుద్ధునికి పాదసేవ చేస్తామని చెబుతారు. అయినా బుద్ధుడు వారిని పట్టించేకోడు. (ఇదేరీతిలో ఇంకా అనేక రకాలుగా ప్రయత్నించిన తరువాత) ఎంత ప్రలోభాపెట్టినా బుద్ధుడు లొంగటంలేదని గ్రహించి, మారుని కుమార్తెలు అక్కణ్ణుంచి వెళ్ళిపోతారు. ఈ కథనంలో సంభాషణలు ఆద్యంతం అద్భుతమైన కవితలతో కూడి ఉంటాయి [7].

మారసంయుత్తలో కనిపించే పై కథనాన్ని, మరింత నాటకీయంగా, రసవత్తరంగా చిత్రించే ప్రయత్నం సుత్తనిపాతలోని ఒక సుత్తంలో జరిగింది. అదే, మహావగ్గలోని పథానసుత్తం. దీనిలో మారుని కుమార్తెల ప్రస్తావన లేదు. కాని, అతనికి కామం, అరతి, తృష్ణ, అలసత్వం మొదలైన పదిరకాల సైన్యాలు ఉంటాయి. ఏనుగుపై వచ్చిన మారుణ్ణి, అతని ‘సైన్యాల’ను బుద్ధుడు ఓడించినట్లు, క్లుప్తంగా చిన్నచిన్న కవితల్లో అద్భుతంగా వర్ణించబడింది [8].

పైన ఉదహరించిన రెండు కథనాలను పరిశీలిస్తే, వీటిలో మారుడు, అతని కుమార్తెలు, సైన్యాలు వాస్తవ అస్తిత్వం కలిగిన పాత్రలుగా చెప్పాలనే ఉద్దేశం వాటి కథకులకు లేదని, ఇవి బుద్ధుని జ్ఞానోదయ సంఘటనల్ని రసవత్తరంగా చెప్పటానికి చిత్రించిన కథనాలు మాత్రమేనని తెలుస్తుంది.

అయితే, వీటికి పూర్తిగా భిన్నమైన కథనం జాతక కథలకు ఉపోద్ఘాతంగా రాసిన “నిదానకథ”లో కనిపిస్తుంది. క్రీ.శ. 5వ శతాబ్దికి చెందిన, ఈ కథన రచయిత భదంతాచార్య బుద్దఘోషుడని చరిత్రకారులు చెబుతున్నారు. దీనిలో, బుద్ధుని జ్ఞానోదయ సన్నివేశాన్ని అభూత కల్పనలతో నింపి, మారుని పాత్రను ఒక నిజమైన అతీతశక్తిగా చూపించే ప్రయత్నం జరిగింది. మచ్చుకు దానిలోని కొన్ని వాక్యాలు చూడండి:

నేరంజర నది తీరాన ధ్యానంలో కూర్చునివున్న సిద్ధార్థుణ్ణి ముట్టడించటానికి వచ్చిన “మారుని సైన్యం సిద్ధార్థునికి నలువైపులా పన్నెండు యోజనాలు, పైన తొమ్మిది యోజనాలు విస్తరించి ఉంది. అది చేసే చప్పుడు వేయి యోజనాల దూరం వరకు, భూమి బద్దలైన శబ్దం వినిపించింది….మారుడు రెండున్నర వందల యోజనాల పొడవైన గిరిమేఖల అనే ఏనుగు ఎక్కి, వేయి చేతుల్లో రకరకాల ఆయుధాలు ధరించాడు….పదివేల చక్రవాళాలలోని దేవతలు మహాసత్వుని (విజయాన్ని) కీర్తించటానికి సిద్ధమై వచ్చారు….వారంతా మారుని సైన్యాల తాకిడికి పారిపోయారు….అప్పుడు, మారుడు సిద్ధార్థునిపై నీటివర్షం, రాళ్ళవర్షం, అగ్నివర్షం, ఇసుకవర్షం, బురదవర్షం కురిపించాడు….మారుని సైన్యం సిద్ధార్థుని మీదకు పర్వత శిఖరాలను విసిరింది.” (ఇలాంటి వర్ణన నాలుగు పేజీల వరకు ఉంటుంది.)

ఇటువంటి వర్ణన మూలగ్రంథాల్లో ఎక్కడా లేదు. ఇది, పూర్తిగా అభూత కల్పనలతో కూడిన కథనమని నిస్సందేహంగా చెప్పొచ్చు. అందుకే, దీనిపై వ్యాఖ్యానిస్తూ, ప్రముఖ బౌద్ధపండితుడు G.P. మలాలశేఖర, “కనీస పరిజ్ఞానం లేని బౌద్ధులు మాత్రమే, బుద్ధుడు మారునితో యుద్ధం చేశాడనే, ఈ కథనాన్ని నేటికీ నమ్ముతున్నార”ని అన్నారు [9]. ఈ కథనంలో, ఇంతకంటే  ముఖ్యమైన దోషం ఏమిటంటే, మూలగ్రంథాల్లో అకుశల మానసిక స్థితుల ప్రతీకగా చెప్పబడిన మారుడు, దీనిలో అసలు కనిపించడు. దీనివల్ల, బుద్ధడు ఏ ప్రయోజనాన్ని ఆశించి ‘మార’ అనే ప్రతీకను ఉపయోగించాడో, ఆ ప్రయోజనం పూర్తిగా మరుగున పడిపోయింది.      

*        *        *

ఇంతవరకూ చెప్పుకున్న విషయాలను బట్టి, బౌద్ధగ్రంథాల్లో మారుని గురించి రెండు భిన్నమైన వైఖరులు వ్యక్తమైనట్లు తెలుసుకున్నాం. ఈ రెండింటి మధ్య పొంతనలేదనే విషయాన్ని మనం గుర్తించాలి. లేదంటే, ఈ విషయం గురించి మన అవగాహన సందిగ్ధంగా మిగిలిపోతుంది [10]. అంతేకాదు, భిన్నమైన వైఖరులు భిన్నమైన పర్యవసానాలకు, భిన్నమైన ఫలితాలకు దారితీయటం సహజం. ఈ వ్యాసంలో చివరిగా, మారుని గురించి వ్యక్తమైన రెండు వైఖరులు, భిన్నమైన ఫలితాలకు ఎలా దారితీస్తాయో తెలుసుకుందాం.

ఒకటి: మనిషిలో తలెత్తే రకరకాల ప్రతికూల ఆలోచనల ప్రతిరూపమే మారుడు. ఇది తొలినాటి బౌద్ధగ్రంథాల్లో కనిపించే వైఖరి. మనిషిలోని దుర్మతిని గుర్తించి తొలగించే ధర్మాచరణలో, ప్రతినిత్యం అవసరమైన సాధనంగా బుద్ధుడు దీన్ని బోధించాడు. దీని ప్రకారం, బుద్ధుడు తన మానసిక రుగ్మతలను సమూలంగా పరిహరించిన ఒక ఆదర్శ మానవునిగా కనిపిస్తాడు. ఇది బుద్ధుణ్ణి ఒక చారిత్రిక వ్యక్తిగా, గొప్ప బోధకునిగా, మార్గదాతగా చూపిస్తుంది. ఈ వైఖరిని అనుసరించే వారికి, తమలోని దుర్మతిని గుర్తించటానికి, దాన్ని తొలగించటానికి అదొక విలువైన సాధనంగా పనికొస్తుంది.  

రెండు: మారుడు అతీతశక్తులు కలిగిన ఒక సత్వుడు. ఇది తదుపరి కాలానికి చెందిన వ్యాఖ్యానాల్లో కనిపించే వైఖరి. దీనికి, మారుని గురించి మూలగ్రంథాలు చెప్పిన నిర్వచనాలకు పొంతనలేదు. ఈవైఖరి వల్ల, మారుడు అనే ప్రతీక ద్వారా కలిగే ప్రయోజనం మరుగున పడిపోయింది. దీనిప్రకారం, బుద్ధుడు మానవాతీతుడైన ఒక పురాణ పురుషునిగా కనిపిస్తాడు. ఇది పరోక్షంగా, బుద్ధుడు విముక్తి ప్రదాత అనే విశ్వాసానికి దారితీస్తుంది. అంతేగాని, దీనివల్ల సాధకులకు ఆచరణలో కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. 

సూచికల వివరణ:

[1] సంయుత్త నికాయ 23:1 [2] సం.ని. 35:243 [3] సుత్తనిపాత: 451 [4] చూడండి: మారసంయుత్త, భిక్షుణిసంయుత్త [5] Early Buddhism: A New Appoach (2000), Chapter:8 [6] సం.ని. 4:24 [7] సం.ని. 4:25 [8] సుత్తనిపాత 3:2 [9] Dictionary of Pali Proper Names: Māra [10] చూడండి: Bhikkhu Bodhi, Introduction to The Connected Discources of the Buddha, పేజి:79.