“నాటి దీపదానోత్సవమే నేటి దీపావళి” అనే పేరుతో నవతెలంగాణ (13.11.2020) దినపత్రికలో ఒక వ్యాసం అచ్చయింది. దీనిలో, రచయిత డాక్టర్ దేవరాజు మహారాజు, నరకాసురవధ వంటి పౌరాణిక కథలు వాస్తవంగా జరిగినవి కావని అన్నారు. అలాగే, పురాణాలన్నీ బుద్ధని తరువాత, బౌద్ధాన్ని నాశనం చేసే క్రమంలో రాయబడినవని చెప్పారు. తరువాత ఆయన, “దీపావళికి అసలు కారణమేమిటి? దానిని ముందు ఏమని పిలిచేవారు? అది ప్రజా జీవనంలోకి ఎలా వచ్చింది?” అనే ప్రశ్నలకు ‘అసలు కారణం’ తెలియజెప్పే ఉద్దేశంతో ఒక సరికొత్త కథనాన్ని పాఠకులకు అందించారు. ఆ కథనం ఏమిటో క్లుప్తంగా చూడండి.

“(గౌతమ సిద్ధార్థుడు ఇల్లువిడిచి వెళ్ళిన ఆరు సంవత్సరాల తరువాత, జ్ఞానోదయం పొంది బుద్ధునిగా పిలవబడటం తెలిసిందే). (సిద్ధార్థుని తండ్రి) శుద్ధోదనుడు బుద్ధుణ్ణి ఒప్పించి (కపిలవస్తుకు) తీసుకురమ్మని, కొంతమందిని పంపుతాడు. అలా వెళ్ళినవారు భిక్షువులుగా మారి బుద్ధునివద్దే ఉండిపోతారు. ఇలా చాలాసార్లు జరుగుతుంది. చివరకు, పదిహేడు సంవత్సరాల తరువాత, ఎలాగో బుద్ధుడు తన నగరానికి బయలుదేరాడు. ఆయన వస్తున్నాడని తెలిసి స్వాగతం పలకటానికి పురప్రజలు సంసిద్ధులయ్యారు. ప్రజలు వీధులు ఇండ్లు శుభ్రం చేసుకుని, గోడలకు వెల్ల వేసుకుని, గుమ్మాలకు పూలమాలలు వేలాడేసుకుని సర్వాంగ సుందరంగా అలకరించుకున్నారు. ఆరోజు ఆశ్వయుజ అమావాస్య గనక, నగరమంతా దేదీప్యమానంగా దీపాలు వెలిగించారు. ఉన్నవారు లేనివారికి మంచి ఆహారం, దీపాలు దానం చేశారు. అదే దీపదానోత్సవంగా స్థిరపడింది. …. బుద్ధుడి రాకకు సంకేతమే దీపదానోత్సవం! బుద్ధుడు తన జ్ఞానాన్ని ప్రపంచానికి దానం చేశాడని చెప్పటానికి ప్రతీకే – ఈ దీపదానోత్సవం.”

తాను చెప్పిన ఈ కథనం గురించి రచయిత, “ఇది చరిత్రకు సంబంధించిన విషయం గనుక ఆధారాలు ఉంటాయి. …. ఇది ఒక జరిగిన సంఘటన. ఇందులో భ్రమలు కల్పితాలు లేవు, బుద్ధుడు వాస్తవంగా ఈనేల మీద తిరిగినవాడు” అని నొక్కిచెప్పారు. బుద్ధుడు చారిత్రిక వ్యక్తి అనటంలో సందేహంలేదు. అయితే, దీపదానోత్సవ నేపధ్యమని చెబుతున్న సంఘటనకు చారిత్రిక ఆధారాలు ఉన్నాయా, లేదా? అనేదే అసలు సమస్య.

“చరిత్రలో జరిగిన సంఘటన” అంటూ తాను రాసిన కథనానికి, రచయిత మూల బౌద్ధగ్రంథాలు లేదా ప్రామాణిక చరిత్ర గ్రంథాల నుండి ఎటువంటి ఆధారాలు అందించలేదు. ఆయన ఈ కథనాన్ని, డాక్టర్ వాల్మికి ప్రసాద్ హిందీ అనువాదం “దీప వంశ్” నుండి తీసుకున్నట్లు చెప్పారు. నిజానికి, ఈ కథనానికి మూలం పాలి “జాతక నిదానకథ”లో ఉంది. నిదానకథ, బుద్ధుని తదనంతరం సుమారు వెయ్యి సంవత్సరాల తరువాత రాయబడిందని పరిశోధకులు చెబుతున్నారు. బుద్ధుడు తొలిసారి కపిలవస్తుకు వచ్చిన సందర్భం ఒక ధమ్మపద (168) కథలో కూడ కనిపిస్తుంది. ఇది కూడా బుద్ధుని తదనంతరం కొన్నివందల సంవత్సరాల తరువాత రాయబడింది. వీటిలో నమోదయిన విషయాలను, ఆకాలపు బౌద్ధుల అభిప్రాయాలుగా భావించవచ్చు, అంతేగాని, వాటికవే చారిత్రిక ఆధారాలుగా చెప్పటం సరికాదు. బుద్ధుని చరిత్ర గురించి మనం అంతిమంగా ఆధారపడదగిన గ్రంథాలు సుత్తపిటకం మరియు వినయపిటకం అనేది నిస్సందేహం.

నిదానకథలో, ధమ్మపద కథలో చెప్పిన విషయాల ప్రకారం కూడ, దీపదానోత్సవానికి తగిన ఆధారాలు లేవు. అంతేగాక, వీటిలోని కొన్ని విషయాలు, మనం చర్చిస్తున్న దీపదానోత్సవ కథనంలో చెప్పిన వాటికి విరుద్ధంగా ఉన్నాయి. అదెలాగో చూడండి.

మనం చర్చిస్తున్న విషయమై, ఆ రెండు గ్రంథాలు చెప్పిన సంఘటనల క్రమం ఇది: తనకు జ్ఞానోదయంమైన పిదప, తొలిసారి కపిలవస్తుకు వెళ్ళినప్పుడు, బుద్ధుడు భిక్షువుల సమేతంగా నిగ్రోధవనంలో బసచేశాడు. అప్పుడు, శుద్ధోదనుడు కొందరు శాక్యులతో పాటు అక్కడికి వెళ్లి, బుద్ధుణ్ణి దర్శించాడు. ఆ రాత్రి బుద్ధుడు, భిక్షువులు నిగ్రోధవనంలోనే ఉన్నారు. మరునాడు ఉదయం, బుద్ధుడు భిక్షువులతో కలిసి కపిలవస్తులో భిక్షాటనకు వెళ్ళాడు. ఇది తనకు అవమానంగా భావించిన శుద్ధోదనుడు, బుద్ధుణ్ణి, భిక్షువులను తన ఇంటికి భోజనానికి రావలసిందిగా ఆహ్వానించాడు. అప్పుడు బుద్ధుడు, భిక్షువుల సమేతంగా శుద్ధోదనుని ఇంటికి వెళ్ళాడు. 

ఈ కథనాన్ని పరిశీలిస్తే, “బుద్ధుడు వస్తున్నాడని తెలిసి స్వాగతం పలకటానికి పురప్రజలు వీధులు ఇండ్లు శుభ్రం చేసుకుని, గోడలకు వెల్ల వేసుకుని, గుమ్మాలకు పూలమాలలు వేలాడేసుకుని సర్వాంగ సుందరంగా అలకరించుకున్నార”నే వర్ణన వాస్తవం అనిపించదు. ఇక, ప్రజలు బుద్ధుణ్ణి దీపాలతో ఆహ్వానించారనే సూచికలైనా ఆ గ్రంథాల్లో లేవు. అంతేకాదు, వినయ నియమాల ప్రకారం, భిక్షువులు తమకుతాము గాని లేదా గృహస్తుల ఆహ్వానం మేరకు గాని, చీకటి పడిన తరువాత గృహస్తుల ఇళ్ళకు వెళ్ళటం నిషేధం. వీటినిబట్టి చూస్తే, “బుద్ధునికి దీపాలతో ఆహ్వానం పలికారు” అని చెప్పటం కల్పన మాత్రమే అనుకోవాలి.

బుద్ధుడు పదిహేడు సంవత్సరాల తరువాత, తొలిసారి కపిలవస్తుకు వెళ్ళినట్లు దీపదానోత్సవ కథనం చెప్పింది. కాని వాస్తవం మరోలా ఉంది. బుద్ధుని తొలి పర్యటనలోనే రాహులునికి ప్రవ్రజ్యదీక్ష ఇవ్వటం జరిగింది. అప్పుడు అతని వయసు ఏడేళ్ళు. ఈ పర్యటన సమయంలోనే, ఆనంద, భద్దియ, అనురుద్ధ, దేవదత్త మొదలైన శాక్య యువకులు భిక్షుదీక్ష పొందినట్లు వినయ పిటకం (ii.182) చెబుతున్నది. వీరంతా, బుద్ధుని జ్ఞానోదయం తరువాత ఏడాదికే దీక్ష పొందినట్లు చెప్పబడింది. వీటిప్రకారం, బుద్ధుడు ఇల్లువిడిచి వచ్చిన ఏడేళ్లకు, అంటే, జ్ఞానోదయమైన ఒక సంవత్సరం తరువాత, తిరిగి కపిలవస్తుకు వెళ్ళాడని నిర్ధారణకు రావచ్చు. ఈ విషయంలో ఆధునిక బౌద్ధ పండితులు, చరిత్రకారులు అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. కనుక, ఈ సంఘటన పదిహేడేళ్ళ తరువాత జరిగిందని చెప్పటం తప్పు. బహుశా, ఏడేళ్ళు అనేది పొరపాటున పదిహేడేళ్ళుగా మారిందేమో.          

ఇంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, “బుద్ధుడు కపిలవస్తుకు చేరినరోజు ఆశ్వయుజ అమావాస్య”, అంటే, ప్రస్తుతం దీపావళి జరుపుకునే రోజు అని దీపదానోత్సవ కథనం చెప్పింది. ఇది వాస్తవమా, కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఎందుకంటే, “నాటి దీపదానోత్సవమే నేటి దీపావళి” అని నిరూపించానికి ఇది చాల కీలకమైన అంశం.  దీని గురించి వివరిస్తూ బౌద్ధగ్రంథాలు చెప్పిన సంగతులు ఇలా ఉన్నయ్: శుద్ధోదనుడు, బుద్ధుణ్ణి కపిలవస్తుకు ఆహ్వానించి తీసుకురమ్మని, కాలఉదాయి అనే  బుద్ధుని బాల్యమిత్రుణ్ణి రాజగృహకు పంపుతాడు. ఈ ఆదేశం మేరకు, కాలఉదాయి రాజగృహ చేరుకొని బుద్ధుణ్ణి కలుస్తాడు. అక్కడ, బుద్ధుని ధర్మోపదేశం విని అతడు భిక్షువుగా మారతాడు. వర్షావాసం ముగిసిన సుమారు రెండు నెలల తరువాత (నిదానకథ ప్రకారం ఫాల్గుణ పూర్ణిమ నాడు), అతడు శుద్ధోదనుని ఆహ్వానాన్ని బుద్ధునికి విన్నవిస్తాడు. అందుకు బుద్ధుడు మౌనంగానే తన అంగీకారాన్ని తెలియజేస్తాడు.

అయితే, బుద్ధుడు వెంటనే కపిలవస్తుకు బయలుదేరలేదు. నిదానకథ ప్రకారం, వర్షావాసం ముగిసిన సుమారు మూడు నెలల తరువాత, ఆయన భిక్షువులతో కలిసి రాజగృహ నుండి కపిలవస్తు దిశగా ప్రయాణం ప్రారంభించాడు. అలా కాలినడకన అంచెలంచెలుగా (సుమారు 300 కి.మీ.) ప్రయాణించి, మరో రెండు నెలల తరువాత కపిలవస్తుకు చేరుకుంటాడు. అంటే, వర్షాకాలం ముగిసిన ఐదు నెలల తరువాత బుద్ధుడు కపిలవస్తుకు చేరుకున్నాడని మనం నిర్ధారణకు రావచ్చు. కనుక, “బుద్ధుడు ఆశ్వయుజ అమావాస్య నాడు కపిలవస్తుకు చేరాడ”ని చెప్పటం, బౌద్ధ వ్యాఖ్యానాలు చెప్పినదానికి విరుద్ధంగా ఉంది.

పైన చెప్పుకున్న విషయాలనుబట్టి, “నాటి దీపదానోత్సవమే నేటి దీపావళి” అనటానికి తగిన చారిత్రిక ఆధారాలు లేవని, అదొక కల్పిత కథనమని అనుకోకతప్పదు.

*        *        *

దీపావళి నేపధ్యంగా చెప్పబుతున్న నరకాసురవధకు ఎటువంటి చారిత్రిక ఆధరాలు లేనిమాట వాస్తవం. అయితే, ఆ పురాణకథను నిరాకరిస్తూ, అందుకు మారుగా ఇటీవల వెలువడిన మూడు కథనాలు ఇవి: (1) నరకాసురుడు ద్రవిడరాజు, ఆర్యులు అతణ్ణి చంపి పండగ చేసుకున్నారు, కనుక మూలవాసులైన భారతీయులు దీపావళిని ఒక పండుగగా జరుపుకోటం సబబుకాదు. ఆ దినాన్ని, ఆర్యులు మూలవాసులపై సాగించిన దమనకాండకు ప్రతీకగా చూడాలి. (2) బౌద్ధ భిక్షువులు మూడునెలల పాటు అడవుల్లో వర్షావాసం సాగించి, ఆశ్వయుజ మాసంలో తిరిగి ఆరామాలకు వస్తారు. ఈ సందర్భంగా, గృహస్తులు వారికి దీపాలతో స్వాగతం పలుకుతారు. ఇదే నేటి దీపావళి వాస్తవ చారిత్రక నేపధ్యం. [“ధమ్మ దీపావళి” వీడియో] (3) ఈ వ్యాసంలో పైన చర్చించిన దీపదానోత్సవ కథనం. (ఇటువంటి కథనాలు ఇంకా కొన్ని ఉన్నాయని తెలుస్తుంది).

నరకాసురవధకు చారిత్రిక ఆధరాలు లేవని అంగీకరిస్తే, పైవాటిలో మొదటి వాదనకు అసలు పునాది ఉండదు. ఇక నరకాసురవధకు ప్రత్యామ్నాయంగా చెబుతున్న (2&3) కథనాల్లో గల భేదాలను, వైరుధ్యాలను పరిశీలించండి. వాటిలో ఒకదాన్ని అంగీకరిస్తే, రెండోదాన్ని నిరాకరించక తప్పదు.    

ఒకే విషయం గురించి, ఇలాంటి పరస్పర విరుద్ధ కథనాలకు కారణం ఏమిటంటే, వాటికి సరైన చారిత్రిక పునాది లేకపోవటమే. ఇలాంటి కల్పిత కథనాలతో ‘ప్రత్యామ్నాయ సంస్కృతి’ని సృజించటం సాధ్యంకాదని మనం గుర్తించాలి. బౌద్ధ సంప్రదాయంలో, ఏదశలోనైనా, దీపదానోత్సవం ఉన్నట్లయితే, దాని నిజమైన చారిత్రిక మూలాలను వెలికితీసి ప్రజలకు తెలియజెప్పాలి. అప్పుడే దానికి సాధికారత, గౌరవం, నిజమైన విలువ దక్కుతాయి. ఇందుకు విరుద్ధంగా, వాస్తవ చారిత్రిక పునాది కొరవడిన భిన్నమైన కథనాలు అయోమయానికి, వివాదాలకు దారితీస్థాయి. అప్పుడు, వీటివల్ల ఆశించిన ఫలితం దక్కకపోగా, మరింత హాని జరిగే అవకాశం మెండుగా ఉంది. కనుక, ఇలాంటి కథనాలను రాసే రచయితలు, వాటిని చదివే పాఠకులు కూడ మరింత బాధ్యతతో, అప్రమత్తంగా, వివేకవంతంగా వ్యవహరించాలి.

రచన: డి. చంద్రశేఖర్