“ధమ్మ దీపావళి” పేరుతో ఇటీవల వెలువడిన వీడియోలో, బొర్రా గోవర్ధన్, దీపావళి పండుగ చారిత్రిక నేపధ్యాన్ని వివరించటానికి ప్రయత్నించారు. (వీడియో లింక్: https://www.youtube.com/watch?v=jFZDtmDIMDc&t=870s)

దీనిలో, “చరిత్రకు అందిన ఆధారాలను బట్టి …” అంటూ మొదలెట్టిన వక్త, దీపావళి పండుగ ఎలా పుట్టిందనే విషయానికి సంబంధించి ఒక సరికొత్త కథనాన్ని వినిపించారు. అయితే, ఆయన తన వాదనకు సరైన చారిత్రిక ఆధారాలు చూపించలేదు. ఇందుకు మారుగా, బౌద్ధగ్రంథాలు చెబుతున్న వాస్తవ చరిత్రకు భిన్నమైన, ఇంకా  విరుద్ధమైన అనేక కల్పనల్ని ఈ కథనంలో గుప్పించారు. మచ్చుకు కొన్ని ఉదాహరణలు చూడండి.

1. వర్షావాస సంప్రదాయాన్ని బుద్దుడు నిర్మించాడు (ప్రారంభించాడు).

2. మూడు నెలల వర్షావాసంలో, భిక్షువులు గృహస్తుల దగ్గరకు భిక్షకు వెళ్ళకూడదు. వారు విహారాలను వదలి అడవుల్లో గుహల్లో (ఒంటరిగా) నివసిస్తూ, అడవుల్లో దొరికే పండ్లు, ఆకులు, దుంపలు, పూలు మాత్రమే తినాలి.

3. భిక్షువులు ఈ మూడునెలల కాలంలో (వర్షావాసంలో) ధర్మసందేశం ఇవ్వరు.

4. భిక్షువులు ఆశ్వయుజ మాసంలో (వనవాసం చాలించి) తిరిగి ఆరామాలకు చేరుకుంటారు. అప్పుడు గృహస్తులు వారికి దీపాలతో స్వాగతం పలుకుతారు. ఇదే దీపావళి పండుగ చారిత్రక నేపధ్యం.

పైన పేర్కొన్న విషయాలను నిరూపించటానికి, “ధమ్మ దీపావళి” కథనంలో, మూల బౌద్ధగ్రంథాల నుండి గాని లేదా బౌద్ధ చరిత్రను వివరించే ఆధునిక గ్రంథాల నుండి గాని ఎటువంటి రుజువులు చూపించలేదు. మరి, కథకుడు చెప్పిన ‘చరిత్ర’ వాస్తవమో, కాదో నిర్ధారించటం ఎలా? …. కథనం ఆకర్షణీయంగా ఉందని, దానిలో చెప్పిన విషయాలను నిజమైన చరిత్రగా భావించటం సరైన పధ్ధతి కాదు. ఈ విషయంలో, నిజానిజాలను నిగ్గుతేల్చాలంటే మనం మూల బౌద్ధగ్రంథాలను పరిశీలించక తప్పదు.

భిక్షుసంఘ వర్షావాస నియమాలు (ఇవి భిక్షువులకు, భిక్షుణిలకు కూడ  వర్తించే నియమాలు) ఏమిటో తెలుసుకోటానికి సరైన వనరు వినయ పిటకంలోని మహావగ్గ (వర్షోపనాయికా స్కంధకము). దీనిలో చెప్పిన విషయాల వెలుగులో పైన పేర్కొన్న నాలుగు అంశాలను పరిశీలిద్దాం.

భారతావనిలో వర్షావాస సంప్రదాయం బుద్ధుని కాలానికి ముందునుండి అమలులో ఉన్నట్లు మహావగ్గ (3.1.1) చెప్పింది. ఈ ఆచారాన్ని బౌద్ధసంఘం ఇతర ధార్మిక శాఖల (జైన, ఆజీవక తదితర శాఖల) నుండి స్వీకరించినట్లు స్పష్టంగా చెప్పబడింది. కనుక, ఈ సంప్రదాయాన్ని బుద్ధుడు ప్రారంభిచాడని చెప్పటం సరికాదు.

వర్షావాసంలో అన్నిటికంటే ముఖ్యమైన నియమం ఏమిటంటే, వర్షాకాలంలో భిక్షువులు సంచారం చెయ్యకుండా ఒకే గ్రామంలోని లేదా పట్టణంలోని విహారలో సామూహిక జీవనం సాగించాలి (మహావగ్గ 3.1.4). అత్యవసరమైన కొన్ని పనుల నిమిత్తం, వర్షావాసంలో ఒక వారంపాటు మాత్రమే బయటకు వెళ్లిరావటానికి, భిక్షుసంఘ సభ్యులకు అనుమతివుంది (మహావగ్గ 3.2). కనుక, వర్షావాసంలో భిక్షువులు ‘అడవుల్లో గుహల్లో (ఒంటరిగా) నివసిస్తూ, అడవుల్లో దొరికే పండ్లు, ఆకులు, దుంపలు, పూలు మాత్రమే తినాల’నే నియమం ఉందని చెప్పటం తప్పు.

ఇక, వర్షావాసంలో భిక్షువులు విహారాల్లో కలిసి జీవించారని, ధర్మం గురించి చర్చించారని చెప్పటానికి సుత్తపిటకంలో అనేక రుజువులు కనిపిస్తాయి. అంతేకాదు, వర్షాకాలంలో గృహస్తులు విహారాలకు వెళ్లి, భిక్షువులకు ఆహారం ఔషధాలు దానం చేశారని, భిక్షువులు గృహస్తులకు ధర్మోపదేశం చేశారని చెప్పటానికి, వినయ పిటకంలో తగిన సాక్ష్యాలు ఉన్నయ్. భిక్షువులే కాదు, స్వయంగా బుద్ధుడు రాజగృహ, కోసంబీ, వైశాలి, శ్రావస్తి వంటి పట్టణాల్లో వర్షావాసం గడుపుతూ, భిక్షువులతో, గృహస్తులతో సంభాషించిన సందర్భాలు సుత్తపిటకంలో నమోదయ్యాయి. (ఉదాహరణకు, మధ్యమనికాయ 77.6; అంగుత్తరనికాయ 5:55 & 11:13 చూడండి). కాబట్టి, “భిక్షువులు వర్షావాసంలో ధర్మసందేశం ఇవ్వర”నే ప్రకటన అసంబద్ధం.   

మరో ముఖ్యమైన సంగతి ఏమిటంటే, “వర్షాకాలంలో అడవుల్లో నివసించాలి” అనేది ఆచరణ సాధ్యంకాని నియమం. బుద్ధుడు, ఆచరణ యోగ్యం కాని, ఇటువంటి నియమాన్ని బోధించివుండడని చెప్పటానికి కొద్దిపాటి లోకజ్ఞానం చాలు. ప్రత్యేకించి భిక్షుణిలు అసలు అడవుల్లో నివశించరాదనే నియమం భిక్షుణీ స్కంధకంలో (6.1) ఉంది. కనుక, వర్షావాసంలో భిక్షుణిలు అడవుల్లో నివశించే అవకాశమే లేదు.   

పైన చెప్పిన విషయాల వెలుగులో పరిశీలిస్తే, “భిక్షువులు ఆశ్వయుజ మాసంలో (వనవాసం చాలించి) తిరిగి ఆరామాలకు చేరుకుంటార”నేది కేవలం కల్పిత ప్రకటన అనుకోకతప్పదు. అంతేకాదు, చీకటిపడిన తరువాత భిక్షుసంఘ సభ్యులు, గ్రామంలో లేదా విహారలో గాని, గృహస్తులను కలవటం నిషేధం. కనుక, “గృహస్తులు భిక్షువులను దీపాలతో ఆహ్వానించార”ని చెప్పటం వట్టి కల్పన మాత్రమే.

ఇలాంటి కల్పితకథల ఆధారంగా దీపావళి ‘చారిత్రిక నేపధ్యాన్ని’ వివరించే కథనాలను వివేకవంతులైన ప్రజలు హర్షించరు. ఇటువంటి కట్టుకథలు బౌద్ధవ్యాప్తికి దోహదం చెయ్యవు సరికదా, చివరకు “బౌద్ధులు అసత్యవాదులు, ఇతర మతస్తుల వలె వారు కూడ పుక్కిటి పురాణాలు చెబుతారు” అని ప్రజలు నిందించటానికి ఊతమిస్తాయి. అదెలావున్నా, ఒక కల్పిత పురాణం (నరకాసురవధ) తప్పని నిరూపించటానికి, మరో కల్పిత కథనాన్ని సృష్టించటం సరైన పద్ధతి కాదు. “అసత్యాన్ని సత్యంతో జయించమ”ని బుద్ధుడు చెప్పిన మాట సర్వదా అనుసరణీయం. కనుక, బౌద్ధ అనుయాయులు, వాస్తవ చారిత్రిక దృష్టి కలిగిన ప్రజలు, ఇటువంటి కల్పిత కథనాలను తిరస్కరించాలి.

బుద్ధుని తదనంతర కాలంలో, బౌద్ధులు దీపాల పండుగ జరుపుకున్న సందర్భం, సంప్రదాయం నెలకొని ఉన్నట్లయితే, ధార్మిక స్ఫూర్తిని నింపే తమదైన పద్ధతిలో, బౌద్ధులు ఆ పండుగ జరుపుకోవటం సమంజసమే; ఆ సంప్రదాయ వాస్తవ నేపధ్యాన్ని ప్రజలకు తెలియజెప్పటం అభినందనీయమే. కాని, ఇందుకోసం లేనిపోని కట్టుకథలను, పుక్కిటి పురాణాలను సృష్టించి, వాటిని ప్రచారం చెయ్యటం మొదటికే మోసం తెస్తుందని మనం గుర్తించాలి.

రచన: డి. చంద్రశేఖర్