[ఇప్పుడు మీరు ఇతర పనుల్లో బిజీగా ఉన్నారా! …… అయితే, ఈ వ్యాసం చదవటానికి ఇది సరైన సమయం కాదు. మీరు విశ్రాంతిగా ప్రశాంతంగా ఉన్న సమయంలో దీన్ని చదవండి. – రచయిత]

బౌద్ధగ్రంథాల్లో కొన్ని పదాలను ఒకేఅర్థంలో గాక, వేరువేరు అర్థాల్లో ఉపయోగించటం కనిపిస్తుంది. అటువంటి వాటిలో ఒకటి ‘సతి’. పాలిభాషలో ఈ పదానికి గల మామూలు అర్థం (ఉనికిలో) ‘ఉండటం’. ఉదాహరణకు, ‘ఇమస్మిం సతి’ అంటే ‘ఇది ఉన్నప్పుడు’; ఇందుకు వ్యతిరేకంగా ‘ఇమస్మిం అసతి’ అంటే ‘ఇది లేనప్పుడు’ [1] (సూచికల వివరణ కోసం వ్యాసం చివర చూడండి). బహుశా, ఈ అర్థంలోనే ‘ఆవాసతి’ (నివసించుట), ‘అనువసతి’ (కలిసివుండుట) అనే పాలి పదాలు రూపొందివుండాలి. వీటి రూపాంతరమైన ‘వసతి’ అనే పదాన్ని ‘నివాసం’ అనే అర్థంలో, ఇప్పటికీ, మనం తెలుగు భాషలో ఉపయోగిస్తున్నాం. ఈ మామూలు అర్థంలో ‘సతి’ గురించి చర్చించటం ఈ వ్యాసం ఉద్దేశం కాదు.

బౌద్ధగ్రంథాల్లో ‘సతి’ అనే పదం జ్ఞాన ప్రక్రియకు సంబంధించిన మరో అర్థంలో విరివిగా వాడబడింది. బుద్ధవచనంలోని ఉదాహరణల ఆధారంగా, ఈ నిర్దిష్టమైన అర్థంలో ‘సతి’ని వివరించటం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం.

పాలి భాషలో ‘సతి’ (సంస్కృతంలో స్మృతి), ‘సరతి’ అనేవి పర్యాయ పదాలు. ఈ పదాలకు జ్ఞాపకం, జ్ఞాపకంచేసుకోవటం, గుర్తుతెచ్చుకోవటం అనే అర్థాలున్నయ్. విస్మృతి, మతిమరపు లేదా మరిచిపోవటం అనేవి వీటికి వ్యతిరేకార్థం కలిగిన పదాలు. ఉదాహరణకు, మూల బౌద్ధగ్రంథాల్లో కొన్నిచోట్ల, సతి అంటే ‘ఒకరు గతంలో చేసిన పనిని (చిరకతం), గతంలో మాట్లాడిన మాటలను (చిరభాషితం) గుర్తుపెట్టుకోవటం, జ్ఞాపకంచేసుకోవటం’ అని చెప్పబడింది [2]. ధర్మాన్ని అనుసరించే వ్యక్తి ‘జ్ఞాపకం చేసుకోవలసిన (అనుస్సతి) ఆరు అంశాల’ను సూచించే ఒక ఉపదేశం అంగుత్తరనికాయలో ఉంది [3]. ప్రథమ సంగీతిలో ఆనందుడు “బుద్ధుని బోధనల్ని జ్ఞాపకం చేసుకొని వల్లించాడ”ని వినయపిటకం చెబుతుంది [4]. ఇటువంటి సందర్భాల్లో సతి అంటే జ్ఞాపకం అని స్పష్టంగా తెలుస్తుంది.

బుద్ధుని కాలంలో, ఈ పదం ఇదే అర్థంలో విరివిగా వాడుకలో ఉంది. బుద్ధుడు కొన్ని సందర్భాల్లో ఈ పదాన్ని ఇలాగే ఉపయోగించాడు. ఆయన బోధించిన ధర్మాన్ని “ప్రకృతినియమాలు, ఆ నియమాలను అనుసరించే ప్రవర్తన మరియు పరివర్తన”గా చెప్పటం పరిపాటి. ఈ నిర్వచనానికి అనుగుణంగానే బుద్ధుడు ‘సతి’ని మనిషికున్న ఒక సహజ లక్షణంగా, ఒక పరివర్తనా సాధనంగా వివరించాడు. బుద్ధుని నిర్వచనం ప్రకారం, సతితో ఉండటం అంటే, ఎప్పటికప్పుడు “కాయాన్ని, వేదనలను, చిత్తాన్ని, మానసిక ధర్మాలను సన్నిహితంగా గమనించటం.” [5].

పై రెండు పేరాల్లో చెప్పినదాని ప్రకారం, బుద్ధవచనంలో సతి అనే పదం ‘గతాన్ని గుర్తుచేసుకోవటం’, ‘వర్తమానాన్ని స్పష్టంగా గమనించటం’ అనే రెండు భావాలను తెలియజేస్తుంది. నిజానికి, ఒక సంఘటన జరుగుతున్న సమయంలో దాన్ని మనం సరిగా గమనించకపోతే, దాన్ని గుర్తుంచుకోవటం సాధ్యంకాదు. దీని విపర్యాయం ఏమిటంటే, ఒక సంఘటన మనకు జ్ఞాపకం రాలేదంటే, దాన్ని మనం సరిగా గమనించలేదనే. కనుక, సతి అనే పదానికి గల రెండు అర్థాలు, అంటే, గమనించటం మరియు జ్ఞాపకం పెట్టుకోవటం అనేవి పరస్పర సంబంధం గల చర్యలు. ఇకమీదట ఈ వ్యాసంలో, సతి అనే పదాన్ని ఈ రెండు భావాలు కలగలసిన పదంగా అర్థంచేసుకోవాలి.

*        *        *

ముందుగా, సతి గురించి కొన్ని సాధారణ సంగతులు తెలుసుకుందాం. సతి మనిషికి గల ఒక సహజాత లక్షణం. అంటే, ఇది ప్రతి ఒక్కరిలో ఎదోఒక స్థాయిలో ఉంటుంది. సతి అనేది అసలు లేకుండా మనిషి మనుగడ సాగించటం అసాధ్యం. అలాగే, సతి దానంతటది జరిగే ప్రక్రియ కాదు, అది మనిషి బుద్ధిపూర్వకంగా చేసే చర్య. మెరుగైన సతితో చేసే పని మెరుగైన ఫలితాన్ని అందిస్తుంది; ఇక, సతి తప్పినపుడు ఫలితం సరిగా లేకపోవటం లేదా అది పూర్తిగా వికటించటం కూడా జరగొచ్చు. ఈ విషయాన్ని తెలుసుకోటానికి కొద్దిపాటి పరిశీలన చాలు. అదెలాగో చూడండి.

జ్ఞాపకశక్తి రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది, గతంలో మనం చూసిన సంఘటనల్ని, చేసిన పనుల్ని, విన్న మాటల్ని, కొంత కాలం తరువాత ఉద్దేశపూర్వకంగా గుర్తుతెచ్చుకోవటం. ఇది ఇతరులకు చెప్పటానికి కావచ్చు లేదా మనకోసం మనం చెయ్యొచ్చు. “ఫలానా సుబ్బారావు ఇల్లు ఎక్కడ?” అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవటం ఇటువంటిదే. ఇక రెండోది, మనం చెయ్యవలసిన పని, సరైన సమయంలో, అసంకల్పితంగా దానికదే గుర్తురావటం. ఉదాహరణకు, “ఈరోజు మధ్యానంలోగా కరెంటు బిల్లు కట్టాలి, లేదంటే ఫీజు పీకేస్తార”ని గుర్తురావటం. వీటిలో మొదటిదాని కంటే రెండోది మరింత సూక్ష్మమైంది మాత్రమే గాక, మనకు తరచూ అవసరమయ్యే జ్ఞాపకశక్తి కూడ.

ఒక విషయం అవసరమైన సమయంలో జ్ఞప్తికి రావాలంటే, అది జరుగుతున్న సమయంలో దానిపట్ల తగిన గమనిక ఉండటం అవసరమని పైన చెప్పుకున్నాం. అలాగే, ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకునే సమయంలో కూడ తగిన గమనిక ఉండాలి. అందుకే, గతంలో జరిగిన దాన్ని గుర్తు తెచ్చుకోటానికి ప్రయత్నించే కొన్ని సమయాల్లో, మనం కళ్ళు మూసుకుని ఆలోచిస్తాం. కనుక, మనసు ఒక విషయాన్ని గ్రహించే సమయంలో, దాన్ని జ్ఞప్తికి తెచ్చుకునే సమయంలో కూడ సతి అవసరమే.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనిషి ఆలోచన కార్యరూపం తీసుకునే క్రమంలో సతి కీలక పాత్ర పోషిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా, సతి తొందరపాటును నిలువరిస్తుంది. అంటే, ఒక పని వెంటనే చెయ్యదగిందా, లేక వాయిదా వెయ్యదగిందా, లేక అసలు చెయ్యకూడనిదా? అనే విషయంపై సరైన నిర్ణయానికి రావటంలో సతి నిర్వహించే పాత్ర చాల కీలకమైంది. అలాగే, అవసరమైన సందర్భాల్లో వెనువెంటనే, తగిన రీతిలో స్పందించటానికి కూడ బలమైన సతి అవసరం. ఇక, మనం ఒక లక్ష్యంతో ఒక పని చేస్తున్నప్పుడు, ఆ లక్ష్యం మన దృష్టి నుండి జారిపోకుండా, చేస్తున్న పని పక్కదోవ పట్టకుండా, సదరు లక్ష్యాన్ని సతి మనకు నిరంతరం గుర్తుచేస్తుంటుంది. తెలిసిచేసే తప్పిదాల గురించి, తెలియకచేసే పొరపాట్ల గురించి, ఒక పర్యవేక్షకునిలా (supervisor) సతి మనల్ని హెచ్చరిస్తుంది. అంతేకాదు, అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదాల్లో సతి మనల్ని అప్రమత్తం చేస్తుంది; అది అజాగ్రత్తనే కాదు, అతిజాగ్రత్తను కూడ సవరిస్తుంది.

ఇంతవరకూ, రోజువారి జీవితంలో సతి నిర్వహించే పాత్ర గురించి కొన్ని సంగతులు చెప్పుకున్నాం. ఇక, బుద్ధవచనం సతి గురించి ప్రత్యేకంగా చెప్పిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సతి మనిషికి గల సహజశక్తి అని పైన చెప్పుకున్నాం. అయినా ఇది అందరికి ఒకే స్థాయిలో ఉండదు. పైగా, దీర్ఘకాలం పాటు ఇంద్రియాలపై అదుపులేకుండా జీవించిన కారణంగా, మనలో సతి నానాటికి దుర్బలంగా తయారవుతుంది. పూర్తిగా సతి తప్పిన జీవితం గతి తప్పుతుంది. అంతేకాదు, సతి అనేది అవసరమైన సందర్భాల్లో, మనం కోరుకున్న సమయంలో అప్పటికప్పుడు అందుబాటులోకి రాగల శక్తి కాదు. దాన్ని అంతకుముందే ఒక పధ్ధతి ప్రకారం వృద్ధిచేసుకోవాలి.

ఈ విషయాలను బుద్ధుడు స్పష్టంగా దర్శించాడు. సతి అనే సహజశక్తిని సంకల్పంతో, ప్రయత్న పూర్వకంగా వృద్ధిచెయ్యొచ్చని బుద్ధుడు గుర్తించాడు. ప్రత్యేకించి శ్వాస రాకపోకలను గమనించే (ఆనాపానసతి) అభ్యాసం, సతిని వృద్ధిచేసే అత్యుత్తమ సాధనమని బుద్ధుడు చెప్పాడు [6]. (ఇందుకోసం ఇతర పద్ధతులు కూడ ఉన్నయ్). పటిష్టమైన సతి మహత్తర ప్రయోజనాన్ని అందిస్తుందని అన్నాడు. మరి సతి వల్ల కలిగే ఆ మహత్తర ప్రయోజనం ఏమిటి? అనే ప్రశ్నకు బుద్ధుడు చెప్పిన సమాధానం ఇది:

“భిక్షువులారా, నేను సంబోధి పొందక ముందు, బోధిసత్వునిగా ఉన్నకాలంలో, అధిక సమయం పాటు ఆనాపానసతిలో గడిపేవాడిని. అలా గడిపినప్పుడు నా శరీరము కన్నులు అలసట లేకుండా ఉండేవి; నా మనసు ఆరాటం లేకుండా సంకటాల నుండి విముక్తమయ్యేది. కనుక, తన ‘శరీరము కన్నులు అలసట లేకుండా ఉండాల’ని, తన ‘మనసు ఆరాటం లేకుండా సంకటాల నుండి విముక్తం కావాల’ని ఆశించేవారు, తరచూ ఆనాపానసతిపై మనసు నిలపాలి.” [7]

ఈ చిన్న సుత్తంలో బుద్ధుడు సతి వల్ల కలిగే ప్రయోజనాలను క్లుప్తంగా చెప్పాడు. తగినంత సమయం పాటు అచంచలమైన సతిలో గడిపేవారు, అప్పటికప్పుడే అలసటలేని శారీరక ఉల్లాసాన్ని పొందుతారు. ఈ అభ్యాసాన్ని దీర్ఘకాలం కొనసాగిస్తే, అది సమూలమైన దుక్ఖవిముక్తి కలిగిస్తుంది. మరి, ఇదెలా సాధ్యం? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే, బుద్ధుని మనోవిజ్ఞానాన్ని పరిశీలించి చూడవలసిందే.

అవిద్యావంతుడైన (ధార్మికజ్ఞానం లేని) మనిషి “కామసుఖాల పట్ల ఆత్రుతతో ఉంటాడు, తీవ్రమైన రాగద్వేషాలతో చెడుసంకల్పంతో ఉంటాడు. అతడు సతి తప్పి, తెలివిమాలి, చెదిరిపోయిన చంచలమైన మనసుతో, జ్ఞానేంద్రియాలపై అదుపు కోల్పోతాడ”ని బుద్ధుడు చెప్పాడు [8]. అలాగే, తనకు సుఖం సంతోషం కలిగించే అనుభవాలను అపరిమితంగా, శాశ్వతంగా పొందాలనే ఆరాటం లేదా అవి తనకు దూరమౌతుంటే కలిగే బాధ మనసులో గిరిగీసుకుని తిష్టవేస్తుందని (చిత్తం పరియాదాయ తిట్ఠంతి) ఆయన అన్నాడు [9]. క్లుప్తంగా చెప్పాలంటే, ప్రవర్తనపై సరైన అదుపు లేనప్పుడు రాగ ద్వేష మొహాలు మనసును ఆక్రమించి, దానిలో పాదుకుపోతాయి [10].

పైన ఉటంకించిన వాక్యాలను పరిశీలిస్తే, మనసుకు రెండు భిన్నమైన లక్షణాలున్నట్లు తెలుస్తుంది. ఒకటి, తనకు ఇష్టమైన వస్తువులను, అనుభవాలను వెదుకుతూ మనసు నిరంతరం అటుఇటు పరుగులుతీస్తుంది. రెండు, తనకు నచ్చిన వాటికి అంటుకుపోయి, గిరిగీసుకుని వాటిలో తిష్టవేస్తుంది. పైపైన చూస్తే, ఈ రెండు లక్షణాలు – అటుఇటు పరుగులుతీయటం, ఒక పరిధిలో గిరిగీసుకుని తిష్టవెయ్యటం అనేవి – పరస్పర విరుద్ధమైన లక్షణాలుగా కనిపిస్తాయి. కాని, నిజానికి ఈ రెండు గుణాలు ఒకదానికి మరొకటి తోడై, మనిషి జీవితాన్ని తీవ్రమైన దుక్ఖంలోకి నెడతాయి. దుక్ఖం నుండి విముక్తి పొందాలంటే, ముందుగా మనం మనసుకు గల ఈ బలహీనతల్ని గుర్తించాలి. ఇందుకోసం, సతిని శక్తివంతం చెయ్యటమే సరైన మార్గం.

మనిషి పొందే ప్రతి అనుభవం మనసుపై ముద్ర వేస్తుంది. అనుభవం ఎంత ఉద్వేగంతో కూడి ఉంటే, మనసుపై అంత గాఢమైన ముద్ర పడుతుంది. ఆ అనుభవాన్ని మనం మరిచిపోయినా, ఉద్వేగాలు మనసుపై వేసిన ముద్రలు దీర్ఘకాలం కొనసాగుతాయి. అవి మన ఆలోచనల్ని, మాటలను, నడవడికను ప్రభావితం చేస్తుంటాయి. మన జీవిత కార్యకలాపాల్లో, మరీ ముఖ్యంగా ఇతర వ్యక్తులతో వ్యవహరించే సందర్భాల్లో, విజ్ఞతకన్నా ఆవేశంతో కూడిన ఉద్వేగాలు మన చర్యలను ఎక్కువ ప్రభావితం చేస్తుంటాయి. విజ్ఞత వెలికిరాకుండా అడ్డుపడటం ఉద్వేగాల సహజ లక్షణం. అందుకే ఉద్వేగంతో కూడిన పనులు, మాటలు, ఆలోచనలు, ప్రతిచర్య (reaction) రూపంలోనే ఉంటయ్. ఒంటరిగా ఉన్నప్పుడు మనలోమనం తర్కించుకునే ఆలోచనలు (వితర్కవిచార) కూడ మనలో గూడుకట్టుకున్న ఉద్వేగాల ప్రతిరూపమే. ఇలాంటి ఉద్వేగాల వరదలోపడి కొట్టుకుపోకుండా మనం వివేకంతో జీవించాలంటే, ఎప్పటికప్పుడు మనలో రేకెత్తే ఉద్వేగాలను, వాటిని వెనుకనుండి ప్రేరేపించే ఉద్దేశాలను గుర్తించగలగాలి. ఈ పనిలో కూడ మనం సతిని ఆశ్రయించక తప్పదు.

జీవితగమనంలో మనిషి తనకు హాని కలిగించే ప్రతికూల అనుభవాలతో పాటు, మేలు కలిగించే సానుకూల అనుభవాలు కూడ పొందుతుంటాడు. తరచూ కలిగే ప్రతికూల అనుభవాల ఒరవడిలో, సానుకూల అనుభవాలు మరుగున పడిపోవటం కద్దు. ప్రతికూల అనుభవాల ఫలితంగా పెంపొందే అకుశల గుణాలను తొలగించటం ఎంత అవసరమో, సానుకూల అనుభవాల ద్వారా లభించే కుశల గుణాలను స్థిరపరిచి వృద్ధిచెయ్యటం కూడ అంతే అవసరం. ఇందుకోసం, ముందుగా అకుశల మరియు కుశల మానసిక స్థితులను మనం గుర్తించగలగాలి. బలమైన సతి ఉన్నప్పుడే ఇది సాధ్యమౌతుంది.

ఇప్పటివరకు చెప్పుకున్న విషయాలను సక్షిప్తంగా, ‘నాలుగు ప్రయత్నాలు’ అనే పేరుతో బుద్ధుడు ఇలా వివరించాడు:

“1. హానికరమైన ఆలోచనలు, చర్యలు, పరిస్థితులు తలెత్తకుండా నివారించటం 2. ఇప్పటికే తలెత్తిన హానికరమైన ఆలోచనలు, చర్యలు, పరిస్థితులను తొలగించటం 3. హితకరమైన ఆలోచనలు, చర్యలు, పరిస్థితులను ఉత్పన్నం చెయ్యటం 4. ఇప్పటికే ఉత్పన్నమైన హితకరమైన ఆలోచనలు, చర్యలు, పరిస్థితులను సంరక్షించి వృద్ధిచెయ్యటం” [11].

ఈ విధంగా సరైన ప్రయత్నం చేసిన మనిషి, (i) తనలో గూడుకట్టుకున్న మానసిక బలహీనతలు రుగ్మతల నుండి విముక్తి పొందుతాడని బుద్ధవచనం చెప్పింది. దీన్ని చిత్తవిముక్తి అంటారు. (ii) అంతిమంగా, సాధకుడు జీవిత వాస్తవికతను ‘ఉన్నది ఉన్నట్లుగా’ చూడగలిగే అత్యున్నత మానసిక సామర్ధ్యం (యథాభూత జ్ఞానం) పొందుతాడు. దీన్ని ప్రజ్ఞావిముక్తి అంటారు.

ఈ విముక్తి ప్రణాళికలో సతి నిర్వహించే భూమికను బుద్ధుడు వివిధ రకాలుగా వివరించాడు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

“ఉత్తమ జీవనం సాగించే వారికి ఏకైక రక్షకుడు సతి” [12]; “మనిషిలో జనించే సంకల్పాలు ఆలోచనలపై ఆధిపత్యం వహించేది సతి” [13]; “స్పష్టమైన అవగాహనతో, సతితో లోకం పట్ల ఆరాటాన్ని, అసంతృప్తిని వదిలెయ్యాలి” [14]. (బుద్ధుని పరిభాషలో లోకం అంటే ఐదు కామగుణాలు) [15]. సతి ప్రాధాన్యతను నొక్కిచేప్పే ఇటువంటి వాక్యాలు బుద్ధవచనంలో తరచూ కనిపిస్తాయి.

బుద్ధవచనం ప్రతిపాదించిన విముక్తిపథం యొక్క సమగ్రరూపం అష్టాంగమార్గం అనే విషయంలో సందేహం లేదు. అయితే, దీనిలోని ఎనిమిది అంగాల్లో సతికి ఒక విశిష్టమైన భూమిక ఉందని బుద్ధుడు చెప్పాడు. మొదటి ఐదు అంగాలైన “సరైన దృష్టి, సరైన సంకల్పం, సరైన వాచకం, సరైన చర్యలు, సరైన జీవనం – వీటిలో ప్రవేశించటానికి సతి తప్పనిసర”ని అన్నాడు [16]. మనోవికాస అభ్యాసం ద్వారా మనిషి పెంపొందించుకో వలసిన ఐదు మనోబలాల గురించి బుద్ధుడు చెప్పాడు. అవి: శ్రద్ధ, వీర్య, సతి, సమాధి, ప్రజ్ఞ [17]. ఇక్కడ కూడ, సతి మిగిలిన వాటికి పర్యవేక్షకుని వంటిదని చెప్పబడింది.

మానసిక వికాసానికి అవరోధం కలిగించే ఐదు గుణాలను (పంచనీవరణలు) బుద్ధుడు కనుగొన్నాడు. అవి: కామపిపాస, దురుద్దేశం, సోమరితనం, ఉద్వేగం, కుశంక. ఈ ఐదు గుణాలు ‘ప్రజ్ఞను దుర్బలం చేసే దుర్గుణాలరాసి’ అని బుద్ధవచనం చెప్పింది [18]. అకుశలమైన విషయాలపై తరచూ మనసు నిలిపితే పంచనీవరణలు బలపడతాయి, కుశలమైన విషయాలపై తరచూ మనసు నిలిపితే అవి తొలిగిపోతాయి. కనుక, ఈ ఐదు అవరోధాలను గుర్తించటానికి, వాటిని తొలగించటానికి కూడ సతి తప్పనిసరి.

అష్టాంగమార్గం ద్వారా లభించే అత్యుత్తమ ఫలితం సంబోధి (అత్యున్నత జ్ఞానం) అని బుద్ధవచనం చెబుతుంది. దీనికి దోహదంచేసే ఏడు అంగాలను సప్తబోధ్యాంగాలు అంటారు. అవి: సతి, ధమ్మవివేచన, వీర్య, ప్రీతి, ప్రశాంతి, సమాధి, ఉపేక్ష. రాగ ద్వేష మోహాలను ఛేదించి అంతంచెయ్యగల ఈ సంబోధి అంగాలు [19], మొదటి అంగం నుండి ఏడవ అంగం వరకు ఒకదాన్ని అనుసరించి మరొకటి పూర్తిగా వికసిస్తాయని బుద్ధుడు చెప్పాడు [20]. వీటిలో మొదటిది సతి, కనుక, అది బోధ్యాంగాలకు ముఖద్వారం వంటిది.

చివరిగా, మరో ముఖ్యమైన సంగతి ఏమిటంటే, అన్ని బోధ్యాంగాలు అన్ని సమయాల్లో అనుసరించ దగినవి కావు. ఉదాహరణకు, మనసు మందగొడిగా ఉన్నప్పుడు ప్రశాంతి, సమాధి, ఉపేక్ష వంటి అంగాలను సాధన చెయ్యకూడదు. ఎందుకంటే, మందగించిన మనసును వీటితో ఉత్తేజపర్చటం సాధ్యంకాదు. అటువంటి సమయంలో ధర్మవివేచన, వీర్య, ప్రీతి వంటి ఆంగాలను సాధన చెయ్యాలి. ఎందుకంటే, మందగించిన మనసును వీటితో ఉత్తేజపర్చవచ్చు. ఇదేరీతిలో, మనసు ఉద్రేకంతో ఉన్నప్పుడు, ధర్మవివేచన, వీర్య, ప్రీతి వంటి ఆంగాలను గాక, ప్రశాంతి, సమాధి, ఉపేక్ష వంటి అంగాలను సాధన చెయ్యాలి. ఎందుకంటే, ఉద్రేకించిన మనసును వీటితో ఉపశమింప చెయ్యొచ్చు. కాని, సతి వీటన్నిటిలో ప్రత్యేకమైంది. అందుకే, “సతి సర్వత్రా అనుసరణీయ”మని బుద్ధుడు చెప్పాడు [21]. అంటే, సతి ఎప్పుడైనా, ఎక్కడైనా అనుసరించదగింది.

ముగింపు: ఈ వ్యాసాన్ని మొత్తంగా పరిశీలిస్తే మనకు తెలిసే విషయాలు: సతి మానవ జీవితం నుండి విడదీయలేని ఒక అతర్భాగం. కనుక, ఇది ఎటువంటి మినహాయింపు లేకుండా మనుషులందరికీ అవసరమైన సంగతి. మామూలు రోజువారి జీవితాన్ని సజావుగా గడపటానికి, దాన్ని మరింత అర్థవంతంగా తీర్చిదిద్దటానికి కూడ సతి అవసరం. ఇక, బుద్ధుడు ప్రతిపాదించిన దుక్ఖవిముక్తి సాధనలో సతి ఎంతో కీలకమైన అంశం. అందుకే, “సతి సార్వత్రిక”మని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

సూచికల వివరణ:

[1] సంయుత్తనికాయ 12:21; ఇంకా చాల సుత్తాలు [2] సంయుత్తనికాయ 48:9; మజ్జిమనికాయ 53.16 [3] అంగుత్తరనికాయ 6:9 [4] వినయ II.287 [5] సంయుత్తనికాయ 36:7 [6] ఆనాపానసతి సుత్తం, మధ్యమనికాయ 118  [7] సంయుత్తనికాయ 54:8 [8] సంయుత్తనికాయ 22:80 [9] సంయుత్తనికాయ 22:7 [10] మధ్యమనికాయ 14.2 [11] సంయుత్తనికాయ 45:8; అంగుత్తరనికాయ 4:13,14 [12] అంగుత్తరనికాయ 10:20 [13] అంగుత్తరనికాయ 19:14 [14] సతిపట్ఠాన సుత్తం, మధ్యమనికాయ 10  [15] అంగుత్తరనికాయ 9:38 [16] మజ్జిమనికాయ 117 [17] ఇంద్రియ సంయుత్త, సంయుత్తనికాయ 48 [18] సంయుత్తనికాయ 46:40 [19] సంయుత్తనికాయ 46:28 [20] మజ్జిమనికాయ 118; సంయుత్తనికాయ 46:3 [21] సంయుత్తనికాయ 46:53.