[మొదట ఈ వ్యాసం బుద్ధభూమి మాసపత్రిక, 2013 డిసెంబర్ సంచికలో అచ్చయింది. దాన్ని కొన్ని సవరణలతో మళ్ళీ ఇక్కడ అందిస్తున్నాం.]

అవును, ఇప్పుడు మీరు చదవబోతున్నది తలనొప్పి గురించే. మీకు తలనొప్పి లేకపోయినా లేదా ఉండి కూడ దాన్ని మీరు గుర్తించకపోయినా, ఇక్కడ చెప్పబోయే విషయాలు మీకు ఆసక్తికరంగా ఉండవు, పైగా అవి మీకు ఉపయోగపడక పోవచ్చు కూడా. ఎందుకంటే ఇది తలనొప్పి, దాని నివారణకు మాత్రమే సంబంధించిన విషయం.

తలనొప్పి అందరికీ ఒకేరకంగా ఉండదు. తలనొప్పి ఉండే తీరు, దాని తీవ్రతను బట్టి దీన్ని రకరకా పేర్లతో పిస్తారు. అసంతృప్తి, ఆవేదన, నిరాశ, చిరాకు, విచారం, రోదన, ఆందోళన, విసుగు, దిగులు ఇవన్నీ తలనొప్పికి మారుపేర్లు; ఇవేగాక, దీన్ని ఇంకా చాల పేర్లతో పిస్తారు. వీటన్నిటిని ఒకేఒక మాటతో చెప్పటానికి పూర్వకాలంలో ‘‘దుఃఖం’’ అనే పదం వాడుకలో ఉండేది. పేరు ఏదయినా, ఇది మానవజాతిని పట్టిపీడించే అత్యంత తీవ్రమైన రోగం. ఇవన్నీ తలకు, అంటే మనసుకు, సంబంధించిన బాధలు కనుక, వాటిని ఉమ్మడిగా తలనొప్పి అని పిలుద్దాం.

పూర్వం సిద్ధార్థుడనే రాజకుమారుడు ఉండేవాడు. అంతఃపురంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నా, అతనికి తలనొప్పి పట్టుకుంది. తలనొప్పి భరించలేక, దాన్ని ఎలాగయినా వదిలించుకోవాలని, ఆయన ఇల్లు విడిచి వచ్చేశాడు. కొందరు ప్రముఖ వైద్యులు తయారుచేసిన మందులు వాడినా తలనొప్పి నయంకాలేదు. కనుక, తానే స్వయంగా సరైన మందుకోసం అన్వేషించాడు. ఎన్నో సంవత్సరాల పాటు పరిశోధించి, చివరకు, తలనొప్పికి అద్భుతమైన మందు కనిపెట్టాడు. దీన్ని ఉపయోగించి చూడగా, ఆయనకు తలనొప్పి పూర్తిగా వదిలిపోయింది. అంతేకాదు, అది జీవితాంతం మళ్ళీ తిరిగి రాలేదు. అందుకే ఆనాటి నుండి అందరూ అతన్ని ‘‘బుద్ధుడు’’ అని పిస్తున్నారు. బుద్ధుడు అనే శాస్త్రవేత్త కనుగొని, మనకందించిన ఆ దివ్యమైన జౌషధం గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం.

తాను కనుగొన్న మందు (మద్యం కాదు!) అన్నిరకాల తలనొప్పుల్ని నివారిస్తుందని బుద్ధుడు ప్రకటించాడు. సరైన పద్ధతిలో తగినంత కాలం దీన్ని ఉపయోగించిన వారికి, ఇక జీవితాంతం ఏ రకమైన తలనొప్పి ఉండదని బుద్ధుడే కాదు, ఆయన్ను అనుసరించిన అనేకమంది భిక్షువులు, గృహస్తులు రుజువు చేశారు. ఈ ఔషధంలో సరైన దృష్టి, సరైన సంకల్పం, సరైన వాక్కు, సరైన చర్యలు, సరైన జీవనం, సరైన వ్యాయామం, సరైన సతి, సరైన సమాధి అనబడే ఎనిమిది మూలికలు ఉన్నందున, దీన్ని అప్టాంగ ఔషధం అని అందాం. దీనిలోని మూలికలు, వాటిని ఉపయోగించే విధానం మాత్రమే బుద్ధుడు మనకు చెప్పాడు. ‘మందుల చీటి చేతిలో ఉందిగదా!’ అని దాన్ని ఎన్ని సార్లు చదివినా రోగం నయం కాదు, మందు వాడినప్పుడే రోగం నయమవుతుంది.

ఈ మందు వాడేటందుకు మీరు పెద్ద పెద్ద డాక్టర్ల చుట్టూ తిరగనవసరం లేదు. వేలు, లక్షల రూపాయు ఖర్చు పెట్టనవసరం లేదు. దీన్ని వాడి ప్రయోజనం పొందిన లేదా ప్రస్తుతం వాడుతున్న ఒక మంచి మిత్రుడు మీకు అందుబాటులో ఉంటే చాలు, మీరే స్వయంగా ఈ ఔషధాన్ని వాడొచ్చు.

ఇది చాల పాతకాలం నాటి ఔషధం కనుక, ఈ కాలం వారికి పనిచేయదని కొందరు అనుకుంటున్నారు. రోగం ఒకటే ఐనప్పుడు, దానికి సరైన మందు కనుగొన్నప్పుడు, అది ఏకాంలోనైనా పనిచేస్తుందనేది లోకజ్ఞానం. ఈ మధ్య కాలంలో కూడా అనేకమంది ఈ మందువాడి, తమ తలనొప్పి పోయిందని చెబుతున్నారు. మీరు కూడా ప్రయత్నించి చూడవచ్చు. దీనివల్ల ఎటువంటి  సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవని గత 2500 సంవత్సరాల అనుభవం చెబుతుంది. దీన్ని వాడి చూడకుండానే ‘ఇది అందరి తలనొప్పి తగ్గిస్తుందా లేక కొందరికే పనిచేస్తుందా?’ అని ఆలోచించటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు.

ఈ అష్టాంగ ఔషధం వాడితే, మీ తలనొప్పి తగ్గటంతో పాటు, తలనొప్పి ఉన్నవారితో ఎలా వ్యవహరించాలో కూడా మీకు తెలుస్తుంది. అంతేకాదు, మీరు ఇతరుకు ‘తనొప్పిగా మారటం’ ఇకమీదట జరగదు. పైగా మీ బంధువులకు, మిత్రులకు, వారి తలనొప్పి వదిలించుకోటంలో మీరు సహాయపడ గలుగుతారు. తలనొప్పి వదిలించుకున్నవారు ప్రశాంతంగా ఆనందంగా జీవించటమే గాక, తమకు తలనొప్పి ఉన్నప్పుడు చెయ్యలేని మంచి పనులు ఇప్పుడు చెయ్యగలుగుతారు; అప్పుడు సరిగా చెయ్యలేని పనులు ఇప్పుడు చక్కగా చెయ్యగలుగుతారు. తలనొప్పి లేని మనుషులు అధికంగా ఉండే సమాజం మేలైందికదా! అందులో సందేహం ఏముంది?

బుద్ధుడు మనకు అందించిన ఈ ఔషధాన్ని హిందు, క్రైస్తవ, ఇస్లాం తదితర మతాలతో లేదా హేతువాదం, మానవవాదం, మార్క్సువాదం మొదలైన సిద్ధాంతాలతో పోల్చి, వాటికి ఇది ప్రత్యామ్నాయమా, కాదా? అని చాలమంది తమ ‘బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు’. నిజానికి, మనం చెప్పుకుంటున్న ఔషధం ఏ మతానికీ లేదా ఏ వాదానికీ ప్రత్యామ్నాయం కాదు. దీన్ని సర్వరోగ నివారిణిగా ప్రచారం చేసేవారూ ఉన్నారు. కాని, ఇది సర్వరోగ నివారిణి కాదు. సమాజంలోని అన్ని రోగాలను ఇది నివారిస్తుందనటం సరికాదు. ఇది తలనొప్పి మందు, తలనొప్పిని మాత్రమే నివారిస్తుంది. తలనొప్పికి ఇంతకంటే మెరుగైన మందు లేదని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. ఇక, మనం తలనొప్పితో సతమతమౌతూ సమాజాన్ని బాగుచెయ్యటం కుదిరేపని కాదు. ఇందుకోసం ముందుగా మనం, మన తలనొప్పిని వదిలించుకోటం అవసరం.

ఇక, హిందువులు, క్రైస్తవులు, మహమ్మదీయులు, హేతువాదులు, మానవవాదులు, మార్క్సువాదులు అనే భేదం లేకుండా, ఈ ఔషధాన్ని ఎవరు వాడినా వారి తలనొప్పి నయమౌతుంది. భిన్న వాదాకు చెందినవారు, చివరకు, అంగుళీమాలుడు అనే ఉగ్రవాది, చండ అశోకుడు అనే యుద్ధోన్మాది కూడా ఈ ఔషధం వాడి తమ తలనొప్పిని వదిలించుకో గలిగారని చరిత్ర సాక్ష్యం చెబుతుంది.

ఈ మందు ఎంతకాంలో పనిచేస్తుందనేది, మీరు దీన్ని ఎంత బాగా వాడుతున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. అయితే మనలో చాలమందికి తలనొప్పి దీర్ఘకాలంగా ముదిరిపోయి ఉన్నందున, సత్వర ఫలితాల కోసం ఎదురు చూడటం సరికాదు.

చివరిగా, ఈ మందును మీరు వాడకుండానే దీని గురించి ఇతరులకు సహాలివ్వకండి. అయితే, దీన్ని వాడి మీకు ఫలితం కనిపించినప్పుడు, దీని గురించి ఇతరుకు చెప్పటం మీ కనీస ధర్మం.

రచన: డి. చంద్రశేఖర్