ఆంద్రప్రభ దినపత్రికలో (17 ఆగష్టు 2020) “బౌద్ధానికి శృంగభంగం!” అనే శీర్షికతో, వుప్పల నరసింహం అనే రచయిత ఒక వ్యాసం రాశారు. మౌర్య సామ్రాజ్యాన్ని కూలదోసి, అధికారంలోకి వచ్చిన బ్రాహ్మణ పాలకుడు పుష్యమిత్ర శుంగ, బౌద్ధాన్ని క్రూరంగా అణచివేయటంతో బౌద్ధధర్మ పతనం మొదలైందని రచయిత చెప్పారు. పుష్యమిత్రుని వారసులు, తరువాత వారిని కూలదోసి అధికారం పొందిన కణ్వవంశ రాజులు కూడ బౌద్ధంపై అణచివేతను కొనసాగించారు. దీనితో మగథరాజ్యంలో బౌద్ధం పూర్తిగా అంతరించిందని, ఇది ‘బౌద్ధానికి శృంగభంగం’, అంటే తీవ్రమైన అవమానం అని రచయిత చెప్పారు.

ఆంద్రప్రభ దినపత్రికలో వచ్చిన వ్యాసం చదవడానికి లింకు: బౌద్ధానికి శృంగభంగం!

ఈ వ్యాసంలో స్థూలంగా మూడు విషయాలు ఉన్నయ్. ఒకటి, బ్రాహ్మణ పాలకులు బౌద్ధంపై సాగించిన దమనకాండను వర్ణించటం. రెండు, చరిత్రను ‘మసిపూసి మారేడుకాయ’ చెయ్యటం. మూడు, నిరాధారమైన ఆరోపణలతో  బౌద్ధంపై అక్కసు వెళ్ళగక్కటం. ఈ మూడు విషయాలను పరిశీలిద్దాం.

1. బౌద్ధులపై సాగిన దమనకాండ: క్రీ.పూ. 180 ప్రాంతంలో బృహద్రత మౌర్యను కుట్రపూరితంగా చంపి, అతని సేనాని పుష్యమిత్ర అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. ఇతడు బౌద్దులపై సాగించిన దమనకాండ గురించి రచయిత నరసింహంగారు ఇలా రాశారు: “పుష్యమిత్ర బౌద్ధానికి వ్యతిరేకి. పుష్యమిత్ర బౌద్ధానికి చెందిన అనేక ఆరామాలను స్థూపాలను ధ్వంసం చేయించాడు. కుక్కుటారామ అనే ప్రధాన ఆరామాన్ని పుష్యమిత్ర సైన్యం నామరూపాలు లేకుండా చేసింది. రాజు తన సైన్యం సంఖ్యను పెంచి, ప్రతిఘటించిన వారి కుత్తుకలు కోయించాడు. బౌద్ధ సన్యాసులను హతమార్చాడు. ఎవరైతే బౌద్ధ సన్యాసి తల నరికి తీసుకొస్తారో వారికి బహుమతి ఇస్తామని ప్రకటించాడు. …. శుంగ రాజు పాలనలో అనేక బౌద్ధ గ్రంథాలు అగ్నికి ఆహుతయ్యాయి. బౌద్ధులు అభిమానంతో చూసుకునేవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. బౌద్ధులు ప్రాణాలు అరచేత పెట్టుకుని సుదూర ప్రాంతాలకు వెళ్ళారు … ‘ప్రతిసర్గ పర్వ’ అనే గ్రంథం (‘ప్రతిసర్గ పర్వ’ అనేది ఒక గ్రంథం కాదు, అది భవిష్య పురాణంలో ఒక అధ్యాయం) ప్రకారం ఈ కాలంలో లక్షలాది మంది బౌద్ధులు హత్యకు గురయ్యారు.”

ఇవన్నీ గత వంద సంవత్సరాలుగా చరిత్రకారులు చెబుతున్న విషయాలే. అయితే, “ఇదంతా బౌద్ధులు చేస్తున్న తప్పుడు ప్రచారమని, హిందూ పాలకులు ఇలాంటి దుర్మార్గాలు చెయ్యలేద”ని చాలకాలంగా కొందరు బుకాయిస్తున్నారు. కాని ఇప్పుడు, హైందవాన్ని ఉద్ధరించే కర్తవ్యాన్ని నెత్తికెత్తుకున్న ఒక రచయిత, బౌద్ధులపై హిందూ పాలకులు సాగించిన క్రూరమైన మారణకాండను ఒక చారిత్రిక సత్యంగా అంగీకరించారు. ఈ విషయంలో మనం నరసింహంగారిని అభినందించక తప్పదు. అయితే, ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే, భారతదేశ చరిత్రలో, నిరాయుధులైన ప్రజలపై సాగిన అత్యంత దుర్మార్గమైన ఈ మారణకాండను నిరసించకపోగా, దీన్ని “బౌద్ధులకు శృంగభంగం!” అని వర్ణిస్తూ, రచయిత పైశాచిక ఆనందం పొందటం విచారకరం. బౌద్ధులపై మారణకాండ కొనసాగిన కాలంలో “సనాతన హిందూ సంప్రదాయం, ధర్మం పునరుత్థానం జరిగింది … బ్రాహ్మణుల ప్రాబల్యం పూర్వదశకు వచ్చింది … రాజు పుష్యమిత్ర అశ్వమేధ యాగం చేసి, బ్రాహ్మణ వైభవాన్నిలోకానికి మరోసారి చాటాడు” అంటూ రచయిత సంబరపడటం అతని మానసిక వైకల్యానికి చిహ్నం.

2. అశోకుని చరిత్ర గరించి అబద్ధాలు: పైన ఉటంకించిన చారిత్రిక వాస్తవాన్ని, అంటే బౌద్ధులపై పుష్యమిత్ర సాగించిన అణచివేతను అంగీకరిస్తూనే, మన వ్యాస రచయిత అశోకుని గురించి పచ్చి అబద్ధాలు చెప్పటానికి పూనుకున్నారు. అదేమిటో రచయిత సొంత మాటల్లో చదవండి: “అశోకుడు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ఇలాంటి ‘చాటింపు’ వేయించాడు. బౌద్ధ వ్యతిరేకుల తల నరికి తెచ్చినవారికి బహుమానమిస్తానని ప్రకాటింపచేశాడు. ముఖ్యంగా జైనులు (ఆజీవకులు) ఊచకోతకు గురయ్యారు. పుష్యమిత్ర ఆ సూత్రాన్నే బౌద్ధులపై ఉపయోగించాడు.”

అశోకుని చరిత్ర గురించి ఇంతకంటే దారుణమైన వక్రీకరణ మరొకటి ఉండదు. ఊచకోతకు గురయ్యారని చెబుతున్న జైనుల వారసులు గాని, ఆధునిక చరిత్రకారులు గాని, చివరకు హిందూ పండితులు సయితం అశోకుని గురించి ఇటువంటి ఆరోపణ చెయ్యలేదు. పుష్యమిత్ర బౌద్ధులపై చేసిన దురాగతాల గురించి హిందు గ్రంథాల నుండి రుజువులు చూపించిన మన రచయిత, అశోకుడు చేశాడని చెబుతున్న ‘చాటింపు’ గురించి గాని, ఆయన పాలనలో జైనులు ఊచకోతకు గురయ్యారని చెప్పటానికి గాని, ఎటువంటి ఆధారాలు చూపలేదు. రుజువులు లేని ఇటువంటి  ఆరోపణలు, పుష్యమిత్ర సాగించిన అకృత్యాలను నిర్లజ్జగా సమర్ధించటానికి, అశోకునిపై తన అక్కసు వెళ్లగక్కటానికి, మన రచయిత అల్లిన కట్టుకథ మాత్రమే.

3. అశోకుని చరిత్ర చెబుతున్న వాస్తవాలు: మరి అశోకుని గురించి చరిత్ర చెబుతున్న వాస్తవాలు ఏమిటి? అనే విషయాన్ని పరిశీలిద్దాం. భారతదేశ చరిత్రలో శిలాశాసనాలు నెలకొల్పిన మొట్టమొదటి పాలకుడు అశోకుడని చరిత్రకారులు చెబుతున్నారు. అనేక శాసనాల్లో ఆయన వైదిక బ్రాహ్మణులను, వైదికేతర ధర్మాలకు చెందిన శ్రమణులను, అంటే ఆజీవకులు, జైనులు, బౌద్ధులు తదితరులను ఆదరించమని ప్రకటించాడు; వీటిలో, బ్రాహ్మణుల పట్ల వ్యతిరేకతను వ్యక్తంచేసిన శిలాశాసనం ఒక్కటి కూడ లేదు.

అశోకుడు చేసిన కళింగ యుద్ధంలో ఒకటిన్నర లక్షల మంది చనిపోయారు. ఆయన బౌద్ధ ఉపాసకునిగా మారిన తరువాత, కళింగ యుద్ధంలో తాను జరిపిన మారణకాండ “బాధాకరం, విచారకరం” అంటూ పశ్చాత్తాపం ప్రకటిస్తూ, ఒక శిలాశాసనం స్థాపించాడు [అశోక శిలాశాసనం 13]. ఈ శాసనంలో, తానిక యుద్ధవిజయాన్ని గాక, ధర్మవిజయాన్నే కోరుకుంటానని చెప్పాడు. అంతేకాదు, తన వారసులు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలనే అభిలాషను అశోకుడు వ్యక్తంచేశాడు. ఈ విధంగా, ఒక రాజ్యాధినేత తాను చేసిన మారణకాండ పట్ల బహిరంగంగా పశ్చాత్తాపం ప్రకటించిన ఘటన, బహుశా, ప్రపంచ చరిత్రలో ఇదొక్కటే. అశోకుడు అలా ప్రకటించటమే కాదు, తన జీవితాంతం దానికి కట్టుబడి యుద్ధం చెయ్యకుండా పాలన సాగించాడని చెప్పటానికి అనేక సాక్ష్యాలు కనిపిస్తున్నయ్. ఇక, మత సామరస్యం గురించి అశోకుడు చేసిన ప్రకట ఈనాటికీ మనకు ఆదర్శం. ఈ విషయమై ఆయన ఏమన్నాడో చూడండి:

“తన మతాన్ని ఉద్ధరించాలనే తపనతో, ఎవరైతే తన మతాన్ని అభినందిస్తూ ఇతర మతాలను నిందిస్తారో, వారు తన మతానికి తీవ్రమైన హాని కలిగిస్తారు.” [అశోక శిలాశాసనం 12]

జీవితాంతం శాంతి కోసం పరితపించిన ఒక మహాపురుషుడు, మనుషుల ‘తల నరికి తెచ్చిన వారికి బహుమతి ఇస్తానని’ ప్రకటించాడంటూ కట్టుకథలు ప్రచారం చెయ్యటం విజ్ఞతగల రచయితలు చెయ్యదగిన పని కాదు.

ఇక, శుంగ మరియు కణ్వ వంశ పాలకుల అణచివేతకు గురై, “మగథరాజ్యంలో, దాని పరిసరాల్లో బౌద్ధం కనిపించకుండా పోయింద”ని రచయిత చెప్పారు. ఇది కూడా చరిత్రను తారుమారు చేసే ప్రయత్నమే. క్రీ.పూ.30లో సాతవాహనులు కణ్వవంశ పాలకులను అంతమొందించాక, మగథ ప్రాంతంలో వెయ్యి సంవత్సరాలకు పైగా బౌద్ధం ఒక బలమైన శక్తిగా కొనసాగింది. మగథరాజ్యం నడిబొడ్డున గుప్తుల కాలంలో (5వ శతాబ్ది) నాలందా మహావిహార నిర్మించబడటం, హర్షవర్ధనుని కాలంలో  (క్రీ.శ. 7వ శతాబ్ది) అది ప్రపంచ ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయంగా విలసిల్లటం ఇందుకు తిరుగులేని సాక్ష్యాలు. 12వ శతాబ్దం నాటికి కూడ నాలందా మహావిహార సజీవంగా ఉండబట్టే కదా బఖ్తియార్ ఖిల్జి దానిపై దాడిచేసింది. ఈ వాస్తవాలను మరుగుపర్చి, మగథ ప్రాంతంలో క్రీస్తు పూర్వమే బౌద్ధం కనుమరుగైందని చెప్పటం, పాఠకుల కళ్ళకు గంతలు కట్టటమే.

4. బౌద్ధులపై నిరాధారమైన ఆరోపణ: వ్యాసం చివరి పేరాలో వుప్పల నరసింహం గారు వెలిబుచ్చిన ‘అంతిమసారాంశం’ ఇది: “భారత ఉపఖండంపై దాడిచేసి ఆక్రమిస్తున్న సమయాల్లో, బౌద్ధులు గ్రీకులకు మద్దతిచ్చారు, వారు భారతీయ రాజుల ఓటమికి కుట్ర పన్నారు … అనంతర కాలంలో ముస్లింల దండయాత్రకు బౌద్ధులు పూర్తిగా సహకరించారు, వారిని ఆహ్వానించారు” అంటూ బౌద్ధులపై తీవ్రమైన ఆరోపణ చేశారు. దీనికి కూడా ఆయన ఎటువంటి ఆధారాలు చూపించలేదు. చరిత్రకారులు, హిందూ పండితులు ఎవరూ బౌద్ధులపై ఇటువంటి అపవాదు మోపలేదు. బౌద్ధులు ముస్లింలకు సహకరించి ఉంటే, మరి నాలందా, విక్రమశిల, ఓదంతపుర, జగద్దల వంటి ప్రసిద్ధ బౌద్ధ కేంద్రాలను ముస్లింలు ఎందుకు ధ్వంసంచేశారు? నరసింహం గారు చేసిన ఆరోపణలో పిసరంత వాస్తవం కూడా లేదని చెప్పటానికి, ఈ ఒక్క ఉదాహరణ చాలు.

ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నట్లు? ఇదంతా బౌద్ధంపట్ల ప్రజలల్లో విద్వేషం రగిలించాలని చేస్తున్న కుటిల ప్రయత్నం తప్ప మరేమీ కాదు. ఇలాంటి నీచమైన పనికి పూనుకోవటం రచయితకు న్యాయమా? ఇది ఏరకమైన ధర్మం? పాఠకులారా! ఆలోచించండి.

రచన: డి. చంద్రశేఖర్