భిక్ఖు బోధి
[2019 వైశాఖి వేడుక సందర్భంగా ఐక్యరాజ్యసమితి వేదికపై భంతే భిక్ఖు బోధి చేసిన ప్రసంగ పాఠానికి తెలుగు అనువాదం]
YouTube వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి
(ఐక్యరాజ్యసమితిలో) శ్రీలంక శాశ్వత ప్రతినిధి రోహన్ పెరెరా, థాయిలాండ్ శాశ్వత ప్రతినిధి, మాననీయ భిక్షుసంఘ సభ్యులు, విశిష్ట అతిథులారా, ఐక్యరాజ్యసమితి నిర్వహించే వైశాఖి ఉత్సవ సుభసందర్భాన, మరోసారి నేను ప్రసంగించటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. తరచూ బుద్ధుణ్ణి శాంతి, సహనం, మైత్రి, కరుణలను బోధించిన గురువుగా అభినందిస్తారు. ఆయన ఈ గుణాలను బోధించటం, వాటికి ఒక నిదర్శనంగా నిలవటం నిజమే. అయినప్పటికి, ఇవే ఆయన బోధనల పూర్తి సారాంశం కాదు. బుద్ధుడు దయామయుడైన రుషి మాత్రమే కాదు. అన్నిటిని మించి, ఆయన మానవ అస్తిత్వపు లోతులను దర్శించిన, బహుశా మానవ చరిత్రలోనే సాటిలేని, విశ్లేషకుడు. ఆయన మానవ జీవితపు రుగ్మతలను నిర్ధారించిన రోగనిపుణుడు, మానవ హృదయంలో దిగబడిన దుఃఖమనే బాణాన్ని వెలికితీసే శస్త్రవైద్యుడు. బౌద్ధగ్రంథాలు బుద్ధుణ్ణి మూలదస్సవి, అంటే, ‘మానవుని దుఃఖం యొక్క నిగూఢమైన మూలాలను దర్శించిన వాడ’ని వర్ణించాయి.
వీటిని బుద్ధుడు సంక్షిప్తంగా లోభం, ద్వేషం, మోహం అనే మూడు (మానసిక) రుగ్మతలుగా పేర్కొన్నాడు. బుద్ధుని ప్రవచనాలు, దుఃఖానికి గల మూల కారణాలను ప్రాథమికంగా వ్యక్తిగత విముక్తి నమూనాలో వివరిస్తాయి. ఈ మూడు రుగ్మతలు మన వ్యక్తిగత జీవితాలను ఎలా ధ్వంసంచేస్తాయి, వాటి నుండి మనం వ్యక్తిగతంగా ఎలా విముక్తి పొందగలం అనే విషయాన్ని బుద్ధుడు చెప్పాడు. అయితే, నేడు ప్రపంచం పరస్పర ఆధారమైన ఏకీకృత సమాజంగా మారింది. ఇటువంటి పరిస్థితిలో, (దుఃఖ) కారణ క్రమం సమిష్టి స్థాయిలో ఎలా పనిచేస్తుందో పరిశోధించాలి. ఒక అంతర్జాతీయ సమాజంగా మనం ఎదుర్కుంటున్న దురవస్థను నివారించటానికి, అటువంటి పరిశోధన ఆధారంగా, మన సమాజాల్లో, రాజకీయ సంస్థల్లో, అంతర్జాతీయ విధానాల్లో తేవలసిన మార్పుల గురించి తగిన నిర్ణయానికి రావాలి. దీన్ని, అతర్జాతీయ స్థాయిలో మనం సమిష్టిగా ఎదుర్కుంటున్న విపత్తులకు గమనిక (సతి), సమగ్రమైన అవగాహన అనే వాటిని అన్వయించటంగా చెప్పవచ్చు. అటువంటి వాటిలో అత్యంత తీవ్రమైనది, విస్తృత పర్యవసానాలు గలది, అత్యంత భయానకమైనది పర్యావరణ సంక్షోభం. దీన్ని గతితప్పిన పర్యావరణం లేక మతితప్పిన పర్యావరణం అనటం సబబు.
పర్యావరణం నానాటికి అస్తవ్యస్తంగా, అనూహ్యంగా, విధ్వంసకరంగా మారుతున్న ప్రమాదకర స్థితిలో నేడు మనం జీవిస్తున్నాం. పర్యావరణం హద్దులు దాటుతుందని నిరూపించే కొత్త సూచికలు, సంక్షోభం వేగంగా విస్తరిస్తుందని చెప్పే సరికొత్త గణాంకాలు, దాదాపు ప్రతివారం వెలువడుతున్నాయి. అయినా, ప్రధాన ప్రచార సాధనాలు వీటిపట్ల తగిన ఆసక్తి కనబర్చటంలేదు. కళ్ళముందే నిలుచున్న ప్రమాదాన్ని చూడలేని అంధత్వానికి ఇదొక సూచిక. అగ్నిపరియాయ సుత్తం అనే ప్రసిద్ధమైన బుద్ధుని ఉపదేశం ఒకటుంది. ఇది “అన్నీ మండుతున్నాయి” అనే మాటలతో మొదలవుతుంది. మహాయాన గ్రంథాల్లో సద్ధర్మపుండరీక సూత్రం “తగలబడుతున్న నివాసం” అనే ఉపమానంతో, ఇదే భావాన్ని వివరించింది. తమ ఇల్లు మంటల్లో కాలిపోతున్నా, దాన్ని ఏమాత్రం గమనించకుండా, ఆ ఇంట్లో పిల్లలు బొమ్మలాట ఆడుతుంటారు. ఈ కథలో ఇల్లంటే ప్రపంచం, తెలివిలేని ఆ పిల్లలే ప్రజలు, అంటే మనమే. మన ఇంటికి చెదలు పట్టినా, అది నిలువునా కూలిపోతున్నా పట్టించుకోకుండా, మనం రోజువారి కార్యకలాపాల్లో మునిగిపోతున్నాం.
ఈనాడు, ప్రపంచం గురించి ‘తగలబడుతున్న నివాసం’ అనే భావన వాస్తవ రూపంలో కనిపిస్తున్నది. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న చిహ్నాలు ప్రతిఏటా మరింత తీవ్రంగా, మరింత విధ్వంసకరంగా, మరింత ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. విధ్వంసకరమైన పెనుతుఫానులు, వరదలు, తీరాలను వెంటాడుతున్న వడగాల్పులు, అడవులను బూడిద దిబ్బలుగా మారుస్తున్న కార్చిచ్చులు – ఇవన్నీ పర్యావరణ పతనాన్ని సూచించే చిహ్నాలు మాత్రమే. దీని దీర్ఘకాలిక పర్యవసానాలు మరింత ప్రమాదకరమైనవి. భవిషత్తులో, భూమండలంలోని అన్ని ప్రాంతాలు మానవ నివాసానికి పనికిరాకుండా పోవచ్చు. దీనితో, మనం కనివిని ఎరుగని రీతిలో కోట్ల సంఖ్యలో ప్రజలు చనిపోవటం, వలస పోవటం జరగవచ్చు. ప్రపంచంలో ఆహార కొరత అనూహ్యంగా పెరిగిపోయి, ఆకలితో అలమటించేవారి సంఖ్య మన అంచనాలకు అందకపోవచ్చు. ప్రపంచ దేశాలన్నిటా క్రూరత్వం పెచ్చరిల్లి, అంతిమంగా నాగరికత పునాదులు సయితం ధ్వంసం కావచ్చు.
పర్యావరణ సమస్య నేపధ్యం ఏమిటో మనకు తెలుసు. అందుకు దారితీసిన కారణాలను కచ్చితమైన ఆధారాలతో శాస్త్రీయంగా నిర్ధారించటం జరిగింది: శిలాజ ఇంధనాలపై ఆధారపడటం, మూర్ఖంగా అడవులను నరికెయ్యటం, పారిశ్రామిక నమూనాలో సాగుతున్న వ్యవసాయం, మతిపోగొట్టే నిరంతర ఉత్పత్తి వినియోగ వలయంపై ఆధారపడిన ఆర్ధికవ్యవస్థ. బుద్ధుడు చెప్పిన రోగనిర్ధారణ, మనల్ని మరింత లోతుకు వెళ్ళమని చెబుతుంది. పర్యావరణ సంక్షోభానికి మూలకారణం మానవుని మానసిక రుగ్మతల్లో దాగుందని చెబుతుంది. అంటే, దురాశ, అజ్ఞానం కలగలసి అసలు సమస్యను సృష్టించాయి. దశాబ్దాల క్రితమే, 1980ల్లోనే, శిలాజ ఇంధన కార్పోరేషన్లకు తమ ఉత్పత్తులు పర్యావరణంలో తీవ్రమైన మార్పులకు దారితీస్తాయని తెలిసింది. కాని, వారు శాస్త్రీయ సాక్ష్యాలను మరుగుపర్చి, శాస్త్రవిజ్ఞానం పట్ల అపనమ్మకాని ప్రచారం చేశారు. లాభాల వేటలోపడి, దురాశ విజ్ఞతను అధిగమించింది. సామాజిక గురుతర బాధ్యతను ఓడించి, కార్పోరేట్ కంపెనీల అభివృద్ధి మంత్రం గెలుపు సాధించింది. సరైన చర్యలు చేపట్టడానికి మారుగా, అలవాటుగా మారిన జీవితం వెంట యథాలాపంగా మనల్ని పరుగులు తీయిస్తున్నది మనలోని అజ్ఞానమే. అంతేకాదు, భూమండల పర్యావరణ వ్యవస్థలు పతనమౌతుంటే, ఈ పరుగుపందెంలో కొందరు గెలుస్తారని మనం భావించటానికి కారణం కూడ మన అజ్ఞానమే.
ఇలా మనం వాస్తవాన్ని నిరాకరిస్తూ అలసత్వంలో కొట్టుకుపోతే, చివరకు మనం ‘సమయం మించిపోయింది, పరిస్థితి చేయిదాటి పోయింది’ అనుకునే రోజు వస్తుంది. అటువంటి దుస్థితిని తప్పించుకోవాలంటే, మనం వెనువెంటనే సరైన చర్యలకు పూనుకోవాలి. ఒకానొక ఉపదేశంలో బుద్ధుడు తన శిష్యులను, శిక్షకుని కమిచిని చూసి నాలుగు విధాలుగా స్పందించే, నాలుగు రకాల గుర్రాలతో పోల్చాడు. వాటిలో ఉత్తమమైన గుర్రం కమిచి నీడను చూసిన వెంటనే శిక్షకుని అధీనంలోకి వస్తుంది. అన్నిటికంటే మొద్దురకపు గుర్రం కమిచి దెబ్బ తగిలితేగాని దారికిరాదు. రాబోతున్న పర్యావరణ మార్పుల గురించి సశాస్త్రీయమైన నివేదికల రూపంలో, మనం దశాబ్దాల క్రితమే కమిచి నీడను చూశాం; ఇప్పుడు దాని దెబ్బలు రుచిచూస్తున్నాం. భవిషత్తులో మరింత ప్రాణాంతకమైన దాని ఘాతాలను తప్పించుకోటానికి, మనం ఈ సంక్షోభాన్ని నివారించగల స్పష్టమైన అవగాహనతో, ధైర్యంగా కృషిచెయ్యాలి.
మన సమిష్టి జీవన వ్యవస్థలు, శక్తి ఉత్పాదక విధానాలు, రవాణా పద్ధతులు తదితరమైన వాటిలో కచ్చితమైన మార్పులు చెయ్యవలసిన అవసరముంది. అంతేకాదు, మనలో అంతర్గతంగా, మన జీవిత విలువల్లో, జీవన విధానంలో కూడ మార్పు అవసరమని బుద్ధవచనం చెబుతున్నది. ముఖ్యంగా మన ఆలోచనల్లో, పర్యావరణ సంక్షోభానికి దారితీసిన మన మానసిక స్థితిలో మార్పు రావాలి. అన్నిటినిమించి, దురాశతో, అంతులేని లాభాపేక్షతో, ప్రజలకు ప్రకృతికి వ్యతిరేకంగా హింసాత్మకంగా సాగే పోటీ మరియు దోపిడిలతో నడిపించబడే ఆర్ధిక వ్యవస్థల నుండి మనం వెనక్కు మరలాలి; కొద్దిమంది మాత్రమే వృద్ధిచెంది, కోట్లాది ప్రజలు బతుకుదెరువు కోసం పాకులాడే స్థితిని కల్పిస్తున్న వ్యవస్థల నుండి వెనక్కు మరలాలి. వాటికి మారుగా, ప్రపంచ ప్రజల సమన్వయానికి దోహదంచేసే, సహకారంతో ప్రజల మధ్య సంఘీభావం, ప్రకృతితో సఖ్యత పెంపొందించే సమిష్టి వ్యవస్థల రూపకల్పన చెయ్యాలి. అటువంటి వ్యవస్థలు ప్రజలంతా ఆర్ధికంగా, సాంఘికంగా, మానసికంగా వికసించటానికి దోహదం చెయ్యాలి.
సకల జనుల సుఖసంతోషాలను పెంపొందించటానికి, లోకంపట్ల కరుణతో బుద్ధుడు ఉదయిస్తాడని చెబుతారు. మనం నేడు ఉమ్మడిగా ఎదుర్కుంటున్న ప్రమాదం గురించి, ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుసు. అలాగే, మెరుగైన భవిషత్తుకు సంబంధించి మిణుకుమంటు ఆశల తీరం కూడ కనిపిస్తున్నది. ఇప్పుడు మనం ఆశిస్తున్న భవిషత్తు దిశగా, మనమంతా పయనించాలి. మనం ఏదిశగా వెళ్ళాలో మనకు తెలుసు. కాలం మించిపోక ముందే మనమంతా కదలాలి. …. ధన్యవాదాలు.
(అనువాదం: డి.చంద్రశేఖర్)