2019 మార్చి-మే నెలల మధ్య ఆంధ్రభూమి దినపత్రికలో, వుప్పల నరసింహం అనే రచయిత, బౌద్ధాన్ని విమర్శిస్తూ వరుసగా పదిహేను వ్యాసాలు రాశారు ( వాటిలో కొన్ని వ్యాసాలు ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు ). మరికొన్ని పత్రికల్లో కూడ ఆయన ఇటువంటి వ్యాసాలు రాశారు, ఇంకా రాస్తున్నారు.

ఈ వ్యాసాల్లో రచయిత, “ఈనాటి బౌద్ధులు ‘మిడిమిడి జ్ఞానంతో’ ఉన్నార”ని అంటూ, వారు “వాస్తవికత అనేది ఒకటుందని విస్మరించరాదు”, “సూక్ష్మ విశ్లేషణాజ్ఞానంతో పరిశీలించాలి”, “లోతుగా పరిశీలన చెయ్యాలి”, “తార్కికతను, హేతువును…సమాధి చెయ్యరాదు” అని బౌద్ధులకు హితబోధ చేశారు. వీటిని చదివిన పాఠకులు, సదరు రచయిత తాను రాస్తున్న విషయం గురించి తగిన పరిజ్ఞానంతో, హేతుబద్ధమైన తార్కికమైన సూక్ష్మ విశ్లేషణా జ్ఞానంతో, లోతైన పరిశీలనతో  ఈ వ్యాసాలను రాసివుంటారని ఆశించటం సహజం. మరి, సదరు వ్యాసాలు నిజంగా అటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయా, లేదా? పరిశీలించి చూద్దాం.

వుప్పల నరసింహం గారు బౌద్ధాన్ని విమర్శిస్తూ రాసిన వ్యాసాల్లో, బుద్ధుని మూల బోధనల నుండి గాని, లేదా ఇతర బౌద్ధగ్రంథాల నుండి గాని ఉటంకించిన ఒక్క వాక్యం కనిపించదు; ఆధునిక కాలంలో బౌద్ధంపై వెలువడిన ప్రామాణిక రచనల నుండి స్వీకరించిన వాక్యమైనా వాటిలో మచ్చుకు కూడ లేదు. కనీసం, గతంలో బౌద్ధాన్ని విమర్శించిన వారి రచనలను సయితం రచయిత సంప్రదించినట్లు కనిపించదు. ఈ వ్యాసాలను పైపైన చదినా కూడ, బుద్ధుని జీవితము, బోధనలు, బౌద్ధచరిత్ర గురించి, ఈ వ్యాసాల్లో అందించిన ప్రాథమిక సమాచారం సయితం తప్పుల తడకలుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకు సాక్ష్యంగా కొన్ని ఉదాహరణలు చూడండి:

  1. “చైతన్యాన్ని సుషుప్తిలో బంధించేదే బౌద్ధం!” అనే వ్యాసంలో, సంబోధి పొందక ముందు బుద్ధుడు, “ఆత్మజ్ఞానం గల గురువులను ఆచార్యులను కలిశాడ”ని, “బ్రాహ్మణ సన్యాసుల దగ్గరకు శాస్త్ర పారంగతుల దగ్గరకు సిద్ధార్థుడు పరుగులు తీశాడ”ని రచయిత చెప్పారు. మూల బౌద్ధగ్రంథాల్లో, ఈ విషయాన్ని రుజువుచేసే కించిత్తు ఆధారం కూడ లేదు. తన జ్ఞానోదయానికి ముందు అళారకాలామ, ఉద్దక అనే గురువులను మాత్రమే కలిసినట్లు, బుద్ధుడు అరియపరియేసన సుత్తంలో చెప్పాడు. వీరు బ్రాహ్మణ సన్యాసులు కారని, వైదికేతర శ్రమణ సంప్రదాయానికి చెందిన ధ్యాన గురువులని, రుజువుచేసే సాక్ష్యాలు బౌద్ధగ్రంథాల్లో ఉన్నాయి.
    ..
  2. “బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి … నినాదాలు రూపొందించింది సైతం బుద్ధుని తొలిశిష్యులైన బ్రాహ్మణులే”నని రచయిత అన్నారు [బోధివృక్షం ఓ సంస్కృత పదం?]. ఉత్కళ రాజ్యం నుండి ఉరువేలకప్పకు వచ్చిన తపుస్స, భల్లిక అనే వ్యాపారులు, బుద్ధునికి జ్ఞానోదయమైన కొద్ది రోజులకే బుద్ధుణ్ణి దర్శించటానికి వచ్చారు. జ్ఞానోదయం పిదప బుద్ధునికి భిక్షపెట్టిన తొలి దాతలు వీరే. ఆసందర్భంలో, తొలిసారిగా “బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి” అని పలికిన వారూ వీరేనని వినయపిటకం [I.4] చెబుతుంది.
    ..
  3. “మహిళలను ‘సంఘం’లోకి తీసుకోవాలని బుద్ధునికి సూచించింది బ్రాహ్మణ శిష్యులే”నని రచయిత అంటున్నారు [పై వ్యాసం]. ఇది పూర్తిగా నిరాధారమైన అభిప్రాయం. బుద్ధుని పెంపుడు తల్లి, పినతల్లి అయిన మహాప్రజాపతి గౌతమి అభ్యర్ధన మేరకు, స్త్రీలను ‘సంఘం’లోకి తీసుకోవాలని బుద్ధునికి సూచించిన వ్యక్తి ఆనందుడు. ఈ సంగతి గోతమీ సుత్తంలో [అంగుత్తరనికాయ 8:51] సవివరంగా చెప్పబడింది. దీనికి భిన్నమైన వాదన బౌద్ధగ్రంథాల్లో ఎక్కడా లేదు.
    ..
  4. “రాజగ్రుహలో జరిగిన మొదటి బౌద్ధ మహాసమ్మేళనానికి అక్కడి రాజు అజాతశత్రు అధ్యక్షత వహించాడ”ని రచయిత చెప్పారు [వర్తమానంలో బౌద్ధం ఓ దగా!]. దీనిలో ఏమాత్రం వాస్తవం లేదు. బౌద్ధుల మొదటి సమావేశాలను వారు “ప్రథమ సంగీతి” అని పిలుస్తారు. రాజగృహ సమీపాన గల సప్తపర్ణిని గుహలో మూడు నెలల పాటు జరిగిన, ఈ సమావేశాలకు వసతి, భోజన సదుపాయం కల్పించింది మగథరాజు అజాతశత్రు; బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించింది మహాకాశ్యప భిక్షువు. భిక్షుసంఘ చరిత్ర గురించి కనీస పరిజ్ఞానం కలవారికి సయితం ఈ విషయాలు తెలుసు. అంతేకాదు, ఈ సంగీతిలో ఐదువందల మంది అర్హతులైన భిక్షువులకు మాత్రమే ప్రవేశం లభించిందని వినయపిటకం చెబుతున్నది. గృహస్తులు, అజాశత్రుతో సహా, ఎవరూ దీనిలో పాల్గొన్న దాఖలాలు లేవు.
    ..
  5. ప్రథమ సంగీతిలో, “ఆనందుడు ‘సుత్తపిటకం’ రాసేందుకు…. ఉపాలి ‘వినయపిటకం’ రాసేందుకు నిర్ణయం జరిగింద”ని వ్యాసకర్త చెప్పారు [పై వ్యాసం]. ప్రథమ సంగీతి క్రీ.పూ. 5వ శతాబ్దిలో జరిగిందని చరిత్రకారుల అంచనా. ఆనాటికి భారతదేశంలో, గ్రంథాలు రాయదాగిన స్థాయిలో లిపి అందుబాటులోకి రాలేదు. ఈ సంగతి వ్యాస రచయితకు తెలిసినట్లు లేదు. ప్రథమ సంగీతిలో, ఆనందుడు బౌద్ధసూత్రాలను, ఉపాలి భిక్షునియమాలను మౌఖికంగా వల్లించారు. అప్పుడు వాటిని “పిటక” అనే పేరుతో పిలవలేదని కూడ తెలుస్తుంది. క్రీ.పూ. ఒకటవ శతాబ్దిలో మాత్రమే, శ్రీలంకలో అవి లిఖిత గ్రంథాలుగా రూపొందాయి.

పైన చెప్పినవే గాక, “బోధివృక్షం కింద ధ్యానం చెయ్యమని బ్రాహ్మణ సన్యాసులు బుద్ధునికి సూచించారు”, “క్రీస్తు జననానికి ముందే బుద్ధుని బోధనల మహాత్మ్యం మటుమాయమైంది”, “వర్తమానంలో పాళి భాష దాదాపు కనుమరుగైంది” అంటూ చరిత్ర గురించి, వర్తమానం గురించి కూడ, కనీస అవగాహన లేకుండా చేసిన వ్యాఖ్యలు, ఈ వ్యాసాల్లో కొల్లలుగా ఉన్నాయి. అయితే, వ్యాస రచయిత తాను రాయదలిచిన విషయాన్ని తగిన పరిజ్ఞానంతో, పరిశీలనతో అధ్యయనం చెయ్యలేదని, చరిత్రలోని  వాస్తవాల పట్ల ఆయనకు చిత్తశుధ్ధి లేదని చెప్పటానికి, పైన పేర్కొన్న ఉదాహరణలు చాలు.

*        *        *

బౌద్ధం గురించి అధ్యయనం చేసేవారు, దాన్ని విశ్లేషించదలచిన వారు దృష్టిలో ఉంచుకోవలసిన కొన్ని ప్రాథమిక విషయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని కింది విధంగా చెప్పవచ్చు.

ఒకటి: బుద్ధవచనం గురించి మనం ఎన్ని వ్యాఖ్యానాలు, ఆధునిక రచనలు చదివినా, ఈ విషయంపై ప్రామాణిక సమాచారం కోసం, అంతిమంగా ఆధారపడదగిన గ్రంథాలు త్రిపిటకాలనే విషయం మనం మరువకూడదు.

రెండు: బుద్ధుని బోధనలను సరైన స్ఫూర్తిలో గ్రహించటానికి, మూల బౌద్ధగ్రంథాల్లో ఉపయోగించిన పదజాలం, ప్రత్యేకించి, బుద్ధుడు ఉపయోగించిన విలక్షణమైన నుడికారం గురించి తగిన పరిజ్ఞానం ఉండాలి. దీనితోపాటు, ఆ బోధనలను తగిన మేరకు ఆచరణలో అనుభవ పూర్వకంగా పరిశీలించి చూడాలి.

మూడు: బుద్ధుని బోధనలను విశ్లేషించే వారు, బౌద్ధగ్రంథాల్లో భిక్షువులకు, గృహస్తులకు ఉద్దేశించిన బోధనలను కలగాపులగం చెయ్యకూడదు; వాటిని వర్గీకరించి, వాటి మధ్య గల సారూప్యతను, వ్యత్యాసాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి.

నాలుగు: బౌద్ధతత్వాన్ని విశ్లేషించేటప్పుడు, చరిత్రలో దాని పరిణామక్రమాన్ని పరిశీలించాలి. అంటే, బౌద్ధంలోని ఒకానొక భావన గురించి చెప్పేటప్పుడు, అది నిజంగా బుద్ధుడు బోధించినదా లేక తదనంతరం బౌద్ధ పండితులు   జోడించినదా లేక ఆధునిక రచయితలు కల్పించినదా అనే విషయాన్ని స్పష్టంగా నిర్ధారించుకోవాలి.

పైన పేర్కొన్న విషయాలను పరిగణించకుండా బుద్ధుని బోధనలను విశ్లేషిస్తే, ఆ విశ్లేషణ అరకొరగా లేక అసంపూర్ణంగా మిగిలిపోవటం, లేదా అపార్థానికి గురికావటం, లేదా పూర్తిగా దారితప్పటం ఖాయమని చెప్పవచ్చు. వుప్పల నరసింహం గారి వ్యాసాల్లో, బౌద్ధం గురించి కనీస అధ్యయనం, అవగాహన లోపించింది. ఆయన వాస్తవికతను పూర్తిగా విస్మరించారు; సూక్ష్మ విశ్లేషణాజ్ఞానంతో జరిపిన పరిశీలన వాటిలో అసలు కనిపించదు; ఇక వాటిలో తర్కం, హేతుబద్ధత పూర్తిగా దారితప్పాయి. అయినా నరసింహం గారు, సరైన అధ్యయనం ఎలా ఉండాలో చెబుతూ, బౌద్ధులకు పాఠాలు నేర్పాలని ప్రయత్నించటం శోచనీయం. అధ్యయనం కొరవడిన ఇటువంటి ఉద్బోధన అటు రచయితకు, ఇటు పాఠకులకు కూడా, ఉపకారం  చెయ్యదు సరికదా  అపకారం చేస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు.

రచన: డి. చంద్రశేఖర్