రచన: డి. చంద్రశేఖర్

2019 మార్చి-మే నెలల మధ్య ఆంధ్రభూమి దినపత్రికలో, వుప్పల నరసింహం అనే రచయిత, బౌద్ధాన్ని విమర్శిస్తూ వరుసగా పదిహేను వ్యాసాలు రాశారు ( వాటిలో కొన్ని వ్యాసాలు ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు) . మరికొన్ని పత్రికల్లో కూడ ఆయన ఇటువంటి వ్యాసాలు రాశారు, ఇంకా రాస్తున్నారు. ఈ వ్యాసాల్లో, బుద్ధుని జీవితం మరియు ఆయన బోధించిన ధర్మం గురించి, బుద్ధుని కాలం నుండి నేటి వరకు ఆ ధర్మాన్ని అనుసరించిన వారి గురించి, సదరు ధర్మాచరణ వల్ల కలిగిన ఫలితాల గురించి రచయిత నిశితమైన విమర్శలు చేశారు. ఈ  వ్యాసాల్లో పునరుక్తి విపరీతంగా ఉంది. కనుక, వాటన్నిటిని విడివిడిగా పరిశీలించటం అనవసరం. అయితే, వాటిలో లేవనెత్తిన కొన్ని ప్రధానమైన విమర్శలను, అంశాలవారీగా పరిశీలించి చూద్దాం.

ఆధునిక కాలంలో, బౌద్ధాన్ని అభినందించే వారి గురించి, రచయిత వుప్పల నరసింహం గారు తన వ్యాసాల్లో వ్యక్తంచేసిన అభిప్రాయం ఎలావుందో చూడండి: “రెండున్నర వేల సంవత్సరాల క్రితంనాటి భావజాలం, భావావేశం ఇప్పటికీ అన్వయమ”ని భావించే, “ఇప్పటికీ మానవచైతన్యం బుద్ధుని కాలం చుట్టూనే పరిభ్రమిస్తుందని భ్రమపడే” ఈనాటి బౌద్ధులు, “కాలంచెల్లిన ‘జ్ఞానం’ చూరుపట్టుకుని” వేళాడుతూ, “అంధత్వంతో బౌద్ధం భాగ్యవంతమైందని, ‘ధమ్మసారం సుసంపన్నమైంద’ని ప్రపంచాన్ని నమ్మించటానికి పూనుకుంటున్నారు.” అంతేకాదు, అటువంటి బౌద్ధులు, “బుద్ధుని కాలం నాటి ఆలోచనలు, చైతన్యం, భావజాలంతో జలకాలాడుతామని వాదిస్తూ… అజ్ఞానంతో, మూఢభక్తితో, అంధవిశ్వాసంతో ఊరేగడం వల్ల సమాజానికి మేలు చేసినట్లు ఎంతమాత్రం కాద”ని ఆయన హితవు పలికారు.

ఈ రకమైన అభిప్రాయాలను ప్రకటించే వాక్యాలు, మనం చర్చిస్తున్న వ్యాసాల్లో విరివిగా ఉన్నాయి. వాటి ద్వారా తెలిసేది ఏమిటంటే, రచయితకు ఈనాటి బౌద్ధుల మీద, బౌద్ధాన్ని అభినందించే వారి మీద చాల చులకనైన అభిప్రాయం ఉంది. ‘అజ్ఞానం, మూఢభక్తి, అంధవిశ్వాసం’ కలిగిన కొద్దిమంది మాత్రమే బౌద్ధాన్ని అభినందించి, అనుసరిస్తున్నారని ఆయన అంటున్నారు. దీనినే మరో కోణంలో చూస్తే, బౌద్ధాన్ని అభినందించే వారు అందరూ అజ్ఞానులు, మూఢభక్తులు, అంధవిశ్వాసులు అని ఆయన చెప్పదలిచారు.

కాని వాస్తవానికి, ఆధునిక బౌద్ధచరిత్ర ఇందుకు పూర్తి భిన్నంగా సాగింది. బౌద్ధ చరిత్ర గురించి వివరిస్తూ స్వామి వివేకానంద చెప్పిన మాటలు, ఈ సందర్భంగా గమనించదగినవి. “చారిత్రకంగా బౌద్ధం అత్యంత ముఖ్యమైన మతమ”నే విషయాన్ని వివరిస్తూ, ఒక ఉపన్యాసంలో ఆయన యిలా అన్నారు: “ప్రపంచం ఇంతవరకూ చూసిన ధార్మిక ఉద్యమాల్లో బౌద్ధం అత్యంత శక్తివంతమైనది, అది మానవజాతిని ముంచెత్తిన అత్యంత బృహత్తరమైన ధార్మిక కెరటం. ఎదోఒక రూపంలో దాని ప్రభావానికి గురికాని నాగరికత ప్రపంచంలో లేదు.” [Buddha’s Message To The World, San Fransisco, మార్చి 18, 1900].

ఇక బౌద్ధతత్త్వం గురించి వ్యాఖ్యానిస్తూ, ప్రముఖ తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ యిలా అన్నారు: “తొలినాటి బౌద్ధం, తత్వశాస్త్ర చరిత్రకు తెలిసిన అత్యంత మౌలిక (original) చింతనల్లో ఒకటని చెప్పటంలో సందేహంలేదు. దాని మౌలిక భావనల్లో, అంతఃసారంలో, బౌద్ధం ఆధునిక శాస్త్రవిజ్ఞానంతో దాదాపు సరిపోలుతుంది.” [Idian Philosophy, vol.I, ch.VII]

ఈ ‘బృహత్తర ధార్మిక కెరటం’, ఈ ‘మౌలిక భావజాలం’ గత చరిత్రలోనే గాక, ఆధునిక శకంలో కూడ తన స్వతస్సిద్ధమైన (original) శక్తిని చాటిచెప్పింది. అది ఎలాగో కింద చూడండి.

పందొమ్మిదో శతాబ్దం మధ్యలో పాశ్చాత్యులకు బౌద్ధ సాహిత్యంతో, బౌద్ధాన్ని అనుసరించే ఆసియాదేశాల ప్రజలతో,  నేరుగా పరిచయం కలిగింది. ఆనాడు, ఆసియా దేశాల బౌద్ధులు ఎవరూ యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలకు వెళ్లి బౌద్ధాన్ని ప్రచారం చెయ్యలేదు. అందుకు మారుగా, పశ్చిమదేశాల పండితులు స్వయంగా శ్రీలంక, బర్మా, థాయిలాండ్, చైనా, జపాన్ వంటి దేశాలకు వచ్చి, బుద్ధుని బోధనలను అధ్యయనం చేశారు. పాలి తదితర భాషల్లో గల బౌద్ధగ్రంథాలను ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్ వంటి పాశ్చాత్య భాషల్లోకి అనువదించి, బౌద్ధాన్ని వివరిస్తూ రచనలు చేసి, బుద్ధవచనాన్ని తమ దేశాల ప్రజలకు అందించారు.

బుద్ధుని జీవితాన్ని వర్ణిస్తూ, 1879లో ఎడ్విన్ ఆర్నాల్డ్ రాసిన పద్యకావ్యం “The Light of Asia” అమితమైన ప్రజాదరణ పొందింది. గత వంద సంవత్సరాలకు పైగా, బుద్ధుని బోధనలను వివరిస్తూ, అనేక భాషల్లో, అసంఖ్యాకమైన రచనలు వెలువడుతూనే ఉన్నాయి. నాటి నుండి నేటి వరకు పాశ్చాత్య దేశాల్లో బౌద్ధధర్మం క్రమంగా విస్తరిస్తూనే ఉంది. గత అరవై ఏళ్లుగా, యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, చివరకు ఇటీవల ఆఫ్రికాలో కూడ బౌద్ధవిహారాలు, ధ్యానకేంద్రాలు వెలిశాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దాదాపు అన్ని యూనివర్సిటీలు, బుద్ధిజంపై కోర్సులు నడుపుతున్నాయి; బౌద్ధ అధ్యనం కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశాయి. బయటివారి ప్రోద్బలం లేకుండా, స్వచ్ఛందంగా లభించిన ఇటువంటి ఆదరణ, బహుశా, ఏ ఇతర మతానికి లభించలేదేమో. ఎటువంటి ఆయుధాలు, అధికార, ఆర్ధిక, అంగ బలాలు లేకుండానే, కేవలం దాని బోధనలకు గల స్వయంశక్తి ద్వారానే, బౌద్ధం నేడు నిజమైన ప్రపంచ ధర్మంగా నెలకొంది.

ఇలా ప్రపంచ వ్యాపితంగా, బౌద్ధాన్ని అభినందించి ఆదరించిన వారు అందరూ అజ్ఞానులు, ఆవేశపరులు లేదా అమాయకులు అని ముద్రవెయ్యటం అంటే, వాస్తవాన్ని చూడటానికి నిరాకరించటమే. నిజానికి, పశ్చిమ దేశాల్లో పెల్లుబికిన సాంస్కృతిక పునరుజ్జీవన వారసత్వాన్ని అందుకున్న అనేక మంది మేధావులు బౌద్ధం పట్ల ఆకర్షితులయ్యారు. మాక్స్ ముల్లర్, విలియం జేమ్స్, బెర్ట్రాండ్ రస్సెల్, ఐన్ స్టైన్, అల్డస్ హక్స్లె, హెచ్.జి.వెల్స్, ఎరిఖ్ ఫ్రాం వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎందరో పండితులు, మేధావులు, శాస్త్రవేత్తలు బౌద్ధాన్ని అభినందించారు.

ఇటు భారతదేశంలో కూడ, గత వంద సంవత్సరాలకు పైగా బౌద్ధాన్ని అభినందించిన వారికి కొదువలేదు. ఉదాహరణకు, 1935లో మహాబోధి సొసైటి (కలకత్తా) నిర్వహించిన, బుద్ధపూర్ణిమ వేడుకలకు అధ్యక్షత వహించిన ‘విశ్వకవి’ రవీంద్రనాథ్ ఠాగూర్, తన ఉపన్యాసంలో యిలా అన్నారు: “నేను ఈ వైశాఖ పూర్ణిమ నాడు జరిగే బుద్ధభగవానుని జన్మదిన వేడుకల్లో పాల్గొనటానికి, ఈ భూమిపై జన్మించిన అత్యుత్తమ మానవుడని నేను అతరాత్మ పూర్వకంగా భావించే బుద్ధునికి, శిరసు వంచి నమస్కరించటానికి వచ్చాను. ఈ సందర్భానికి తగినట్లు, యథావిధిగా నేను ప్రదర్శిస్తున్న అభిమానం కాదు ఇది. నా అంతరాత్మ యొక్క అత్యంత లోతైన ఏకాంతంపు సమయాల్లో, పదేపదే నేను ఆయనకు అర్పించే శ్రద్దాంజలినే, ఈరోజు నేను ఇక్కడ ఆయనకు అర్పిస్తున్నాను. [Journal of the Mhabodhi Society, vol. 69]. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక్కరే కాదు, ధర్మానంద కోసంబీ, రాహుల్ సాంకృత్యాయన, ఆనంద కౌశాల్యాయన, జగదీశ కశ్యప్, జవహర్లాల్ నెహ్రూ, బి.ఆర్.అంబేడ్కర్ వంటి ప్రముఖులు ఎందరో బౌద్ధాన్ని అభినందించి, అక్కున చేర్చుకున్నారు.

పైన పేర్కొన్న వాస్తవాలను గుర్తించకుండా, ‘బౌద్ధం కాలంచెల్లిన జ్ఞానం’ అని తీర్మానించటం, బౌద్ధాన్ని అభినందించేవారు ‘అజ్ఞానులు, మూఢభక్తులు, అంధవిశ్వాసుల’ని, వారు ‘ఆత్మవంచన చేసుకుంటున్నార’ని ప్రచారం చెయ్యటం సమంజసం కాదు. ఇది విజ్ఞతగల రచయితలు చెయ్యదగిన పని ఎంతమాత్రం కాదు.