[ఇది పాలి గ్రంథమైన అంగుత్తరనికాయలో చతుక్కనిపాతలోని 193వ సుత్తానికి సంక్షిప్త తెలుగు అనువాదం. ఈ అనువాదంలో, పాలి సుత్తాల్లో సహజంగా కనిపించే, (నేటి పాఠకులకు విసుగు పుట్టించే!) పునరుక్తిని, కొంతమేర తొలగించటం జరిగింది. అయినా, బుద్ధుని ఉపదేశాలను వాటి నిజమైన స్పూర్తిలో గ్రహించాలంటే, వాటిని పాఠకులు, బుద్ధునికాలపు పాలి నుడికారాన్ని ఆస్వాదిస్తూ ఓపికతో చదవటం అవసరం. అందుకే, అనువాదంలో పాలి నుడికారం చెదిరిపోకుండా జాగ్రత్త వహించటం జరిగింది. – అనువాదకుడు]
ఒక సమయాన భగవానుడు (బుద్ధుడు) వైశాలిలో మహావనం నందలి కూటగారశాలలో ఉన్నాడు. అప్పుడు లిచ్ఛవి (జాతికి చెందిన) భద్దియ భగవానుని వద్దకు వెళ్లి, ఆయనకు అభివాదంచేసి, ఒకపక్కన కూర్చున్నాడు. అలా కూర్చున్న భద్దియ బుద్ధునితో యిలా అన్నాడు:
“భంతే, ‘శ్రమణ గౌతముడు మాయావి, అతనికి పరివర్తనమాయ తెలుసు; ఇతర (ధార్మిక) శాఖలకు చెందిన శిష్యులను పరివర్తన చేస్తాడు’ అని నేను విన్నాను. భంతే, అలా చెప్పేవారు అభూత కల్పనలతో వక్రీకరించక, భగవానుడు చెప్పినదాన్నే చెబుతున్నారా? వారు విమర్శకు, నిందలకు తావివ్వని రీతిలో, ధర్మానుగుణంగా మాట్లాడుతున్నారా? భగవానుని వక్రీకరించటం తగదని నేను అనుకుంటున్నాను.”
“భద్దియ, ఈ విషయంలో నువు – చాలకాలంగా వింటున్నదని గాక, సంప్రదాయమని గాక, ఎప్పుడో ఎక్కడో విన్నదని గాక, గ్రంథాల్లో చెప్పబడిందని గాక, తర్కబద్ధమైందని గాక, హేతుబద్ధమైందని గాక, తర్కవితర్కం ద్వారా గాక, నీ దృష్టిని పోలివుందని గాక, ఆకర్షణీయంగా ఉందని గాక, గురువు మీది గౌరవంతో గాక, ‘ఈ ధర్మాలు హానికరమైనవి, ఇవి నిదించదగినవి, విజ్ఞులు గర్హించేవి; ఆమోదించి ఆచరిస్తే యివి హాని, దుక్ఖం కలిగిస్తాయి’ అని నువు స్వయంగా తెలుసుకున్నప్పుడు, వాటిని విడనాడాలి.
(1) “భద్దియ, మనిషిలో లోభం (దురాశ) జనిస్తే, అది అతనికి మేలుచేస్తుందా లేక కీడుచేస్తుందా?…. నువు ఏమనుకుంటున్నావు?”
“కీడుచేస్తుంది, భంతే.”
“భద్దియ, లోభానికిలోనై దాని వశంలో చిక్కిన దురాశాపరుడు జీవహింస, దొంగతనం చేస్తాడు; వ్యభిచరిస్తాడు, అబద్ధాలు చెబుతాడు; ఇతరులను యిటువంటి పనులకు ప్రేరేపిస్తాడు. ఇది అతనికి దీర్ఘకాలం కీడు, దుక్ఖం కలిగించదా?”
“అవును, భంతే.”
(2) “భద్దియ, మనిషిలో ద్వేషం జనిస్తే, అది అతనికి మేలుచేస్తుందా లేక కీడుచేస్తుందా?…. నువు ఏమనుకుంటున్నావు?”
“కీడుచేస్తుంది, భంతే.”
“భద్దియ, ద్వేషాకిలోనై దాని వశంలో చిక్కిన ద్వేషపరుడు జీవహింస, దొంగతనం చేస్తాడు; వ్యభిచరిస్తాడు, అబద్ధాలు చెబుతాడు; ఇతరులను యిటువంటి పనులకు ప్రేరేపిస్తాడు. ఇది అతనికి దీర్ఘకాలం కీడు, దుక్ఖం కలిగించదా?”
“అవును, భంతే.”
(3) “భద్దియ, మనిషిలో మోహం జనిస్తే, అది అతనికి మేలుచేస్తుందా లేక కీడుచేస్తుందా?…. నువు ఏమనుకుంటున్నావు?”
“కీడుచేస్తుంది, భంతే.”
“భద్దియ, మొహానికిలోనై దాని వశంలో చిక్కిన అజ్ఞాని జీవహింస, దొంగతనం చేస్తాడు; వ్యభిచరిస్తాడు, అబద్ధాలు చెబుతాడు; ఇతరులను యిటువంటి పనులకు ప్రేరేపిస్తాడు. ఇది అతనికి దీర్ఘకాలం కీడు, దుక్ఖం కలిగించదా?”
“అవును, భంతే.”
(4) “భద్దియ, మనిషిలో ఉద్రేకం జనిస్తే, అది అతనికి మేలుచేస్తుందా లేక కీడుచేస్తుందా?…. నువు ఏమనుకుంటున్నావు?”
“కీడుచేస్తుంది, భంతే.”
“భద్దియ, ఉద్రేకానికిలోనై దాని వశంలో చిక్కిన ఉద్రేకి జీవహింస, దొంగతనం చేస్తాడు; వ్యభిచరిస్తాడు, అబద్ధాలు చెబుతాడు; ఇతరులను యిటువంటి పనులకు ప్రేరేపిస్తాడు. ఇది అతనికి దీర్ఘకాలం కీడు, దుక్ఖం కలిగించదా?”
“అవును, భంతే.”
“ఇవి కుశలధర్మాలా లేక అకుశలధర్మాలా? …. భద్దియ, నువు ఏమనుకుంటున్నావు?”
“అకుశల ధర్మాలు, భంతే.”
“ఇవి నిందించదగినవా లేక అభినందించదగినవా?”
“నిందించదగినవి, భంతే.”
“ఇవి విజ్ఞులు గర్హించేవా లేక ప్రశంసించేవా?”
“విజ్ఞులు గర్హించేవి, భంతే.”
“ఆమోదించి ఆచరిస్తే, ఇవి కీడు దుక్ఖం కలిగిస్తాయా, లేదా? …. నువుఏమన్నుకుంటున్నావు?”
“ఆమోదించి ఆచరిస్తే, ఇవి కీడు దుక్ఖం కలిగిస్తాయి, భంతే.”
“అందుకే, భద్దియ, ‘చాలకాలంగా వింటున్నదని గాక, …. గురువు మీది గౌరవంతో గాక, ‘ఈ ధర్మాలు హానికరమైనవి, ఇవి నిదించదగినవి, విజ్ఞులు గర్హించేవి; ఆమోదించి ఆచరిస్తే యివి హాని, దుక్ఖం కలిగిస్తాయి’ అని నువు స్వయంగా తెలుసుకున్నప్పుడు, వాటిని విడనాడాలి’ అని చెప్పటానికి కారణం యిదే.”
* * *
“భద్దియ, చాలకాలంగా వింటున్నదని గాక, సంప్రదాయమని గాక, ఎప్పుడో ఎక్కడో విన్నదని గాక, గ్రంథాల్లో చెప్పబడిందని గాక, తర్కబద్ధమైందని గాక, హేతుబద్ధమైందని గాక, తరకవితర్కం ద్వారా గాక, నీ దృష్టిని పోలివుందని గాక, ఆకర్షణీయంగా ఉందని గాక, గురువు మీది గౌరవంతో గాక, ‘ఈ ధర్మాలు హితకరమైనవి, ఇవి నిదించదగినవి కావు, విజ్ఞులు ప్రశంసించేవి; ఆమోదించి ఆచరిస్తే యివి హితము, సుఖము కలిగిస్తాయి’ అని నువు స్వయంగా తెలుసుకున్న వాటిని ఆమోదించి ఆచరించాలి.”
(1) “భద్దియ, మనిషిలో లోభం (దురాశ) లేకపోతే, అది అతనికి మేలుచేస్తుందా లేక కీడుచేస్తుందా?…. నువు ఏమనుకుంటున్నావు?”
“మేలుచేస్తుంది, భంతే.”
“భద్దియ, లోభానికిలోనుగాక దానికి వశంకాని వ్యక్తి జీవహింస, దొంగతనం చెయ్యడు; వ్యభిచరించడు, అబద్ధాలు చెప్పడు; ఇతరులను యిటువంటి పనులకు ప్రేరేపించడు. ఇది అతనికి దీర్ఘకాలం హితము, సుఖము కలిగించదా?”
“అవును, భంతే.”
(2) “మనిషిలో ద్వేషం లేకపోతే, అది అతనికి మేలుచేస్తుందా లేక కీడుచేస్తుందా?…. నువు ఏమనుకుంటున్నావు?”
“మేలుచేస్తుంది, భంతే.”
“భద్దియ, ద్వేషరహితుడై దానికి వశంకాని వ్యక్తి జీవహింస, దొంగతనం చెయ్యడు; వ్యభిచరించడు, అబద్ధాలు చెప్పడు; ఇతరులను యిటువంటి పనులకు ప్రేరేపించడు. ఇది అతనికి దీర్ఘకాలం హితము, సుఖము కలిగించదా?”
“అవును, భంతే.”
(3) “మనిషిలో మోహం లేకపోతే, అది అతనికి మేలుచేస్తుందా లేక కీడుచేస్తుందా?…. నువు ఏమనుకుంటున్నావు?”
“మేలుచేస్తుంది, భంతే.”
“భద్దియ, మోహానికిలోనుగాక దానికి వశంకాని వ్యక్తి జీవహింస, దొంగతనం చెయ్యడు; వ్యభిచరించడు, అబద్ధాలు చెప్పడు; ఇతరులను యిటువంటి పనులకు ప్రేరేపించడు. ఇది అతనికి దీర్ఘకాలం హితము, సుఖము కలిగించదా?”
“అవును, భంతే.”
(4) “మనిషిలో ఉద్రేకం లేకపోతే, అది అతనికి మేలుచేస్తుందా లేక కీడుచేస్తుందా?…. నువు ఏమనుకుంటున్నావు?”
“మేలుచేస్తుంది, భంతే.”
“భద్దియ, ఉద్రేకానికిలోనుగాక దానికి వశంకాని వ్యక్తి జీవహింస, దొంగతనం చెయ్యడు; వ్యభిచరించడు, అబద్ధాలు చెప్పడు; ఇతరులను యిటువంటి పనులకు ప్రేరేపించడు. ఇది అతనికి దీర్ఘకాలం హితము, సుఖము కలిగించదా?”
“అవును, భంతే.”
“ఇవి కుశలధర్మాలా లేక అకుశలధర్మాలా? …. భద్దియ, నువు ఏమనుకుంటున్నావు?”
“కుశల ధర్మాలు, భంతే.”
“ఇవి నిందించదగినవా లేక అభినందించదగినవా?”
“అభినందించదగినవి, భంతే.”
“ఇవి విజ్ఞులు గర్హించేవా లేక ప్రశంసించేవా?”
“విజ్ఞులు ప్రశంసించేవి, భంతే.”
“ఆమోదించి ఆచరిస్తే, ఇవి హితము సుఖము కలిగిస్తాయా, లేదా? …. నువుఏమన్నుకుంటున్నావు?”
“ఆమోదించి ఆచరిస్తే, ఇవి హితము సుఖము కలిగిస్తాయి, భంతే.”
…….
“భద్దియ, లోకంలోని సత్పురుషులు తమ శిష్యులకు, ‘అయ్యా, నువు నిరంతరం లోభాన్ని వదిలించుకుంటూ గడపాలి. లోభాన్ని నిరంతరం వదిలించుకుంటూ గడిపితే, లోభంతో జనించే కాయక, వాచిక, మానసిక కర్మలు (చర్యలు) నువు చెయ్యవు. నువు నిరంతరం ద్వేషాన్ని వదిలించుకుంటూ …. నువు నిరంతరం మొహాన్ని వదిలించుకుంటూ …. నువు నిరంతరం ఉద్రేకాన్ని వదిలించుకుంటూ గడపాలి. (అప్పుడు) ద్వేషంతో …. మోహంతో …. ఉద్రేకంతో జనించే కాయక, వాచిక, మానసిక కర్మలు నువు చెయ్యవు.”
భగవానుడు అలా చెప్పగానే, లిచ్ఛవి భద్దియ భగవానునితో యిలా అన్నాడు: “ఆశ్చర్యం, భంతే, అద్భుతం! తలక్రిందులైనదాన్ని నిటారుగా నిలిపినట్లు, మరుగునపడినదాన్ని వెలికితీసినట్లు, దారితప్పిన వానికి దోవ చూపినట్లు, చూపున్నవారు చూడగల విధంగా చీకటిలో వెలుగుదివ్వె పట్టినట్లు – పరిపరి విధాల భగవానుడు ధర్మాన్ని వివరించారు. భంతే, నేను భగవానుణ్ణి, ధర్మాన్ని, సంఘాన్ని శరణువేడుతున్నాను. నేటినుండి నా జీవితపర్యంతం, భగవానుడు నన్ను ఉపాసకునిగా స్వీకరించుగాక!”
“భద్దియ, నేను నీతో, ‘రా భద్దియ, నా శిష్యిరికం తీసుకో, నేను నీ గురువునౌతాను’ అని చెప్పానా?”
“లేదు, భంతే.”
“నేను యిలా చెబుతున్నా, యిలా ప్రకటిస్తున్నా, కొందరు శ్రమణులు బ్రాహ్మణులు ‘శ్రమణ గౌతముడు మాయావి, అతనికి పరివర్తనమాయ తెలుసు; ఇతర (ధార్మిక) శాఖలకు చెందిన శిష్యులను పరివర్తన చేస్తాడు’ అని అసత్యాన్ని, తుచ్చమైన మాటలను, తప్పుడు మాటలను, అభూతకల్పనలను చెబుతూ, నన్ను వక్రీకరిస్తున్నారు.”
“భంతే, దివ్యమైనది ఈ పరివర్తనమాయ, కళ్యాణప్రదమైనది ఈ పరివర్తనమాయ. నా బంధువులు, మిత్రులు యిలా పరివర్తన చెందితే, అది వారికి దీర్ఘకాలం సుఖహితాలను కలిగిస్తుంది.”
అనువాదం: డి.చంద్రశేఖర్
Excellent.
Wonderful