[2019 జనవరి 13న హైదరాబాదు మహాబోధి బుద్దవిహారలో మాననీయ భిక్ఖు భోధి ఉపన్యసించారు. ఇంగ్లీషులో సాగిన ఆ ఉపన్యాసం ఆడియో ఆధారంగా డి. చంద్రశేఖర్ చేసిన సంక్షిప్త అనువాదం యిది. బుద్ధవచనం పత్రికకు వారు పంపిన అభినందన పత్రం English Copy కూడ పాఠకులకు అందుబాటులో ఉంది.]

ప్రధాన నాగరికతలకు నెలవైన అన్ని ప్రాంతాలు, ప్రపంచ నాగరికతకు తమ ప్రత్యేకమైన అంశాలను అందించాయి. సంగ్రహంగా చెప్పాలంటే, క్రీ.పూ. 6వ శతాబ్దిలో చైనాలో పుట్టి పెరిగిన సంస్కృతి సఖ్యత, పరస్పర గౌరవం అనే సూత్రాలతో కూడిన మానవసంబంధాల ఆధారంగా, భిన్నమైన సామాజిక వర్గాలను కలిపి ఒక సామరస్యమైన సమాజాన్ని నిర్మించే బోధనలను అందించింది. అదే కన్ఫ్యూషియస్ దార్శనికత.

14-16 శతాబ్దాల మధ్య యూరపులో జరిగిన సాంస్కృతిక పునరుజ్జీవనం ద్వారా పశ్చిమ దేశాలు, సహేతుకమైన ఆలోచనను ఉపయోగించి సత్యాన్ని అన్వేషించటం అనే భావనను ప్రపంచ నాగరికతకు అందించాయి. హేతుబద్ధమైన చింతన ఒకవైపు అన్ని రకాల భౌతిక, జీవ శాస్త్రాలను, టెక్నాలజీని అభివృద్ది చేసింది. హేతువిజ్ఞానం అందించిన మరో ప్రయోజనం ప్రజాస్వామిక పాలన; సాంఘిక చైతన్యం, ప్రజాఉద్యమం అనే భావనలను ప్రజాస్వామ్య పాలనకు, మానవ హక్కుల పరిరక్షణకు ఒక సాధనంగా అందించింది.

భారతదేశపు నాగరికతలో భాగమైన వివిధ ప్రాతాలు, ప్రపంచ నాగరికతకు అందించిన ప్రయోజనం ధార్మికత. అంతర్ముఖ శోధనను, సమున్నత మనోస్థితులను ఉపయోగించి, ప్రకృతి మరియు విశ్వం గురించి, మానవుని మనసు గురించి లోతైన జ్ఞానాన్ని కనుగొనటానికి అది ప్రయత్నించింది. భారతదేశ చరిత్ర క్రమంలో ఉద్భవించిన అన్ని ధార్మిక విధానాల్లో అత్యంత స్పష్టంగా, గంభీరంగా ప్రకటితమైన ధర్మం బుద్ధవచనం, అంటే గౌతమ బుద్ధునిబోధనలు.

క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్ది నుండి వెయ్యి సంవత్సరాలకు పైగా, బౌద్ధం భారతదేశం అంతటా విస్తరించి వర్ధిల్లింది. ఈ కాలంలో భారత సమాజం వివిధ రంగాల్లో ముందెన్నడూ లేని ప్రగతిని సాధించింది. తరువాత జరిగిన వివిధ పరిణామాల కారణంగా, క్రీ.శ. 12వ శతాబ్ది నుండి బౌద్ధం తన మాతృభూమిలో దాదాపు కనుమరుగైంది; నేడు దాని వైభవాన్ని చాటిచెప్పే ప్రాచీన కట్టడాలు శిధిల రూపంలో భారతదశం అంతటా కనిపిస్తున్నాయి. 20వ శతాబ్ది నాటికి బౌద్ధం బెగాల్, కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనుగడలో ఉంది.

నేడు భారతదేశంలో బౌద్ధ పునరుద్భవం జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బౌద్ధం పట్ల పెరుగుతున్న యీ ఆసక్తి సరైన మార్గంలో సాగాలంటే, భారతదేశానికి బౌద్ధం అందించగల నిర్దిష్టమైన నైతిక, ధార్మిక ప్రయోజనాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి. భారతదేశం తన ప్రాచీన వారసత్వాన్ని పూర్తిగా వదిలేసి, పశ్చిమ దేశాలను గుడ్డిగా అనుసరిస్తే, జీవితానికి అవసరమైన సమున్నత లక్ష్యాలు లేక అది వస్తువాదం, వ్యాపార సంస్కృతి అనే ఊబిలో పడిపోగలదు. భారతదేశం గంభీరమైన ధార్మికత గల దేశం. అయితే, నేటి ప్రపంచంలో మనకు ఆధునిక భావాలతో సఖ్యత కలిగిన మతం అవసరం. బుద్ధుని ధర్మం సమున్నత ధార్మిక విలువల పట్ల నిబద్ధతను, ఆధునిక విజ్ఞానశాస్త్రం అందించిన విమర్శనాత్మక చింతనను ఉత్తమరీతిలో మేళవించ గల ధర్మమని నేను నమ్ముతున్నాను.

ఈ ఉపన్యాసంలో నేను బౌద్ధానికి గల, ప్రత్యేకించి ఆధునిక జీవితానికి అన్వయించగల, ఐదు లక్షణాలను నొక్కిచెప్పదలిచాను. “బౌద్ధం” అని అన్నప్పుడు ప్రాచీన కట్టడాలు, ఆచారాలు, తంతులు మొదలైనవి గుర్తుకొస్తాయి. అయితే, నేను బౌద్ధం గురించి చెప్పేటప్పుడు క్రీ.పూ. 5వ శతాబ్దిలో జీవించిన, చారిత్రిక బుద్ధుడు లేక గౌతమ శాక్యముని బోధనల గురించి మాట్లాడుతున్నాను. ఇవి మూల పాలిగ్రంథాల్లో, యితర ప్రాచీన భాషల్లో లభించినవి. వీటిలోని బోధనలను పరిశీలిస్తే, అవి ఎవరో 21వ శతాబ్దికి చెందిన వ్యక్తి బోధించినట్లు, మనకు సమకాలికమైనవిగా ఉంటాయి. ఆ బోధనలకు గల ఐదు ముఖ్య లక్షణాలను యిప్పుడు వివరిస్తాను.

(1) బౌద్ధ వాస్తవిక దృక్పథం. బుద్ధుడు జీవితాన్ని వాస్తవిక దృక్పథంతో పరిశీలించాడు. తన బోధనల్ని గుడ్డిగా విశ్వసించమని, వాటిని ప్రశించారాదని ఆయన చెప్పలేదు; వాటిని విమర్శనాత్మకంగా పరిశీలించమని అన్నాడు. తన బోధనలు ప్రత్యక్షంగా తెలుసుకోదగినవని (సందిట్ఠికో ) అన్నాడు. వాటిని కేవలం గురువు మీది గౌరవంతో గాక, కంసాలి ఒక లోహాన్ని పరిశీలించి అది నిజమైన బంగారమా, కాదా అని నిర్ధారించినట్లు, స్వంత ఆలోచనతో ఆమోదించాలి.

అంతేగాక, బుద్ధుడు మానవ జీవితపు మూలసమస్య గురించి, అంటే దుఃఖం గురించి సూటిగా మాట్లాడాడు. ఆయన అధిభౌతిక సిద్ధాంతాల మీద, దేవునిపట్ల గల విశ్వాసాల మీద ఆధారపడలేదు. దుఃఖం అనేది, దురాశ తదితర మానసిక జాడ్యాల కారణంగా మనసులో ఉత్పన్నమౌతుందని నేరుగా చూపించాడు. దీన్ని మనం స్వయంగా చూసి నిర్ధారించుకోవచ్చు. మనకు దుఃఖం కలిగినప్పుడు, లోతుగా పరిశీలిస్తే, మనం వస్తువులను అవి ఉన్నట్లు గాక, మరోరకంగా ఉండాలని, వాస్తవిక ప్రప్రపంచం నుండి అవాస్తమైనవి కావాలని కోరుకున్నప్పుడు మనలో దుఃఖం ఉత్పన్నమౌతుందనే విషయాన్ని తెలుసుకోగలుగుతాం.

మనిషి చేసే సకల కార్యాలు, అన్ని రకాల అభివృద్ధి పనులు, టెక్నాలజీలు, సామాజిక మార్పులు, విప్లవాలు అన్నీ సుఖశాంతులతో జీవించటానికే. కాని మనిషి దురవస్థకు అసలు కారణం మనసులోనే అంటే, సంపదల కోసం, భోగాల కోసం, ఆధిక్యత కోసం పాకులాడటంలోనే ఉందని బుద్ధుడు చెప్పాడు. ఈ ఆరాటాన్ని తగ్గించటం, అదుపుచెయ్యటం, అంతిమంగా దాన్ని తొలగించటం ద్వారానే మనిషి సుఖశాంతులను పొందగలడని ఆయన బోధించాడు.

(2) బౌద్ధ నైతిక నిర్మలత్వం. బుద్ధుడు నైతిక ప్రవర్తనను ధార్మిక జీవితానికి పునాదిగా భావించాడు, అది ఆయన బోధనల అంతటా అల్లుకుని కనిపిస్తుంది. బౌద్ధ మార్గంలోని అత్యున్నత దశలన్నీ – ధ్యాన స్థితులు, సంబోధిని పొందటం వంటివి – పరిశుద్ధమైన ప్రవర్తనపై ఆధారపడి ఉంటాయి. ఇతరులకు హాని కలిగించ కూడదు అనేది బౌద్ధ నైతికతకు పునాది. గృహస్తులు పాటించ వలసిన పంచశీలలో బుద్ధుడు తన నైతిక బోధనను సంక్షిప్తంగా పేర్కొన్నాడు: జీవహింస, దొంగతనం, కామ దురాచారం, అబద్ధాలాడటం, మత్తుపదార్ధాల సేవనం – ఈ ఐదింటిని విరమించటం. కాని నిర్దిష్ట నియమాలకు అతీతంగా, బౌద్ధ నైతికతను నడిపించే సూత్రాలు ఏమిటంటే, అపారమైన మైత్రి, కరుణ. ఈ గుణాలను నొక్కిచెప్పటం ద్వారా, ఆధునిక ప్రపంచంలో పెచ్చరిల్లుతున్న హింస, ద్వేషం, క్రూరత్వం వంటి ధోరణులకు బౌద్ధం ఒక పరిష్కారాన్ని సూచిస్తున్నది.

(3) బౌద్ధ సార్వజనీనత. ఇతర భారతీయ ధార్మిక శాఖలకు భిన్నంగా, ప్రతిఒక్కరూ నైతికంగా ధార్మికంగా వృద్ధిచెందగల సామర్ధ్యం కలవారేనని, అందరూ అత్యున్నత ఫలితాన్ని అందుకోటానికి అర్హులేనని బుద్ధుడు ప్రకటించాడు. ఈ విషయంలో బౌద్ధం, ‘ధార్మిక సిద్ధి ఉన్నత కులస్తులకు మాత్రమే సాధ్యమ’ని చెప్పిన యితర భారతీయ శాఖలకు భిన్నంగా నిలబడింది. ఉచ్ఛ నీచ కులస్తులు, ధనికులు పేదలు, ఆడ మగ అనే భేదం పాటించకుండా, బుద్ధుడు బహిరంగంగా అందరికీ ధర్మాన్ని బోధించాడు. అందరూ దుఃఖానికి లోనయ్యేవారే; అందరూ అష్టాంగమార్గాన్ని అనుసరించటానికి సమర్ధులే; అందరూ నిర్వాణం పొందటానికి అర్హులే. దళితునిగా పుట్టి అర్హతుడైన సునీత, కరడుగట్టిన నేరస్తునిగా జీవించి అర్హత్వం పొందిన అంగుళీమాల యిందుకు చక్కటి ఉదాహరణ.

(4) బౌద్ధ మనోవిజ్ఞాన దృక్పథం. దుఃఖం మనసులో ఉత్పన్నమౌతుందని బుద్ధుడు చెప్పినందున, ఆయన బోధనలు మనసు గురించి సవివరమైన విశ్లేషణను అందించాయి. ఏ మానసిక అంశాలు దుక్ఖాన్ని కలిగిస్తాయో, ఏ అంశాలు సుఖసంతోషాలకు దోహదంచేస్తాయో వివరించబడింది. మనసుకు సంబంధించిన వాస్తవాలను చిత్తశుద్దితో తెలుసుకోటానికి, సహజ మానసిక సామర్ధ్యాలను పూర్తిగా వికసింపచెయ్యటానికి, మానసిక పరివర్తన పొందటానికి బౌద్ధ మనోవిజ్ఞానం ఉపకరిస్తుంది. ఇది ఆధునిక సైకాలజి చెప్పే అవగాహనకు చాల దగ్గరగా ఉంది. కాని అది ఒక భిన్నమైన సమున్నతమైన లక్ష్యం కలది. దాని ఉద్దేశం కేవలం మానసిక రుగ్మతలను ఉపశమింప చెయ్యటం కాదు. సంపూర్ణమైన మానసిక స్వస్థతను, అంటే రాగం, ద్వేషం, మొహం తదితర రుగ్మతల నుండి విముక్తి పొందిన మానసిక స్థితిని అందుకోవటమే దాని అంతిమ లక్ష్యం.

(5) బౌద్ధ ఆచరణాత్మక పధ్ధతి. భారతీయ ధార్మికతకు బుద్ధుడు చేకూర్చిన మరో గొప్ప ప్రయోజనం ఏమిటంటే, అత్యున్నత లక్ష్యమైన నిర్వాణాన్ని చేరుకోటానికి స్పష్టమైన నిర్దుష్టమైన మార్గాన్ని బోధించటం. గురువుల దయాదాక్షిణ్యాల మీద, గూఢమైన మంత్రాల మీద లేక మాంత్రిక తంతుల మీద ఆధారపడకుండా ప్రతిఒక్కరు అర్థంచేసుకోటానికి, ఆచరించటానికి, దాని నుండి ప్రయోజనం పొందటానికి అనువుగా స్పష్టమైన సోపానాల్లో, సరైన క్రమంలో ధర్మాన్ని బోధించటం. దీనిలో పంచశీల, దశ కుశల కర్మలు, అష్టాంగమార్గం ఉన్నాయి. ఇవి స్పష్టమైన, వాస్తవికమైన, నైతికంగా ఉన్నతీకరించే బోధనలు. మన జీవితాల్లో పరివర్తన కోసం, మన సమాజానికి, ప్రపంచానికి ప్రయోజనం కలిగించేటందుకు మనమంతా వీటిని ఉపయోగించవచ్చు. బౌద్ధం చెప్పిన ధ్యాన పద్ధతులు, నేడు ప్రత్యేకించి ఎంతో ప్రాముఖ్యత గలవి. ఈ ధ్యాన పద్ధతులు మనసు గురించి తెలుసుకోటానికి, పరివర్తనకు, మానసిక విముక్తికి ఉపకరిస్తాయి.

బుద్ధుని బోధనలకు గల యీ ఐదు లక్షణాలు – వాస్తవిక దృక్పథం, నైతిక నిర్మలత్వం, సార్వజనీనత, మనోవిజ్ఞాన దృక్పథం, ఆచరణాత్మక పధ్ధతి – ఆధునిక భావాల స్ఫూర్తిని ప్రతిధ్వనిస్తాయి.

*        *        *

చివరిగా, నేటి బౌద్ధులు లేక బౌద్ధం ఎదుర్కుంటున్న ప్రత్యేకమైన సమస్య గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఈనాడు మనం ఎదుర్కుంటున్న ప్రత్యేకమైన సవాలు ఏమిటంటే, వ్యక్తిగత జీవితాలను అర్థవంతంగా సుఖవంతంగా జీవించటానికి సహకరించటమే గాక, నేటి సమాజపు దురవస్థను  నివారించటానికి కూడ సుసంపన్నమైన బుద్ధుని బోధనలను ఉపయోగించాలి.

నేటి ప్రపంచం ఎదుర్కుంటున్న తీవ్రమైన సమస్యల గురించి చెప్పాలంటే, వాటిలో మొదటిది, నిరంతరం పెరుగుతున్న ఆర్ధిక అసమానతలు: ప్రపంచంలోని సంపద అతికొద్దిమంది సంపన్నుల చేతుల్లో పోగుపడటం, అధిక శాతం ప్రజలు పేదరికంతో సతమతమై జీవించటం. రెండు, ప్రపంచ వ్యాపితంగా వివిధ జాతులు, మతాలు, ప్రాంతాల మధ్య ఆధిక్యత కోసం సాగుతున్న వివాదాలు, ఘర్షణలు, హింస, యుద్ధాలు. ఇక మూడవది, ప్రపంచ వ్యాపితంగా మానవులందరూ ఎదుర్కుంటున్న సమస్య పర్యావరణ విధ్వంసం. ఇది మానవుని మనుగడనే ప్రశ్నిస్తున్న సవాలు.

బౌద్ధులుగా మనం ధర్మంలోని నైతిక సూత్రాల స్ఫూర్తితో, అంటే మైత్రి కరుణల స్ఫూర్తితో మరింత నీతివంతమైన సమాజాన్ని, మరింత న్యాయమైన ఆర్ధికవిధానాలను, పర్యావరణానికి హాని కలిగించని మెరుగైన సాంకేతిక సాధనాలను సృష్టించాలి. ఈ విషయాల్లో సామాజిక చైతన్యం, మెరుగైన న్యాయం, ప్రజాస్వామ్యం వంటి భావాలతో సుసంపన్నమైన పాశ్చాత్యుల చరిత్ర నుండి బౌద్ధులు నేర్చుకోవచ్చు. ప్రాచీన బౌద్ధం బోధించిన నైతిక విలువలను, ఆధునిక పాశ్చాత్య సమసమాజ భావనతో మేళవించటం ద్వారా, భారతదేశం ప్రపంచ నాగరికతకు ఒక విశిష్టమైన ఉపకారాన్ని చేకూర్చగలదు. నేటి ప్రపంచీకరణ శకంలో మానవాళికి తన ప్రత్యేకమైన ఉపకారాన్ని అందించటానికి, బహుశా, భారతదేశం ముందున్న అత్యంత పెద్ద సవాలు, అత్యంత గొప్ప అవకాశం కూడ యిదే.