(మజ్ఝిమనికాయ 41)

ఒక సమయంలో బుద్ధభగవానుడు కోసలలో పర్యటిస్తూ పెద్ద భిక్షుసంఘంతో సాలా అనే పేరుగల బ్రాహ్మణగ్రామాన్ని చేరుకొన్నాడు. సాలా గ్రామంలోని బ్రాహ్మణ గృహపతులు, ”శాక్యపుత్రుడు శ్రమణగౌతముడు పెద్ద భిక్షుసంఘంతో, కోసలలో చారిక చేస్తూ, తమ ఊరికి వచ్చాడని విన్నారు. అప్పుడు వారు ‘ఎన్నోవిధాలుగా ఆ భగవానుని మంగళమయ కీర్తి అంతటా వ్యాపించి ఉంది. అటువంటి అర్హతుల దర్శనం మంచిది’ అనుకున్నారు.

అప్పుడు సాలేయ్యక బ్రాహ్మణ గృహపతులు భగవానుని వద్దకు చేరుకొన్నారు. చేరుకొని కొందరు భగవానునికి నమస్కరించి ఒకపక్కన కూర్చున్నారు.  కొందరు భగవానుని కుశలప్రశ్నలడిగి ఒకపక్కన కూర్చున్నారు. కొందరు భగవానునివైపు చేతులు జోడించి ఒకపక్కన కూర్చున్నారు. కొందరు భగవానునివద్ద నామగోత్రాలు చెప్పుకొని ఒకపక్కన కూర్చున్నారు. కొందరు మౌనంగానే ఒకపక్కన కూర్చున్నారు. అప్పుడు వారు భగవానుని ”శ్రీమాన్‌ గౌతమా, కొందరు చనిపోయిన తర్వాత అపాయాన్ని, దుర్గతిని, నరకాన్ని పొందటానికి, మరికొందరు చనిపోయిన తర్వాత సుగతిని, స్వర్గాన్ని పొందటానికి కారణమేమి?” అని అడిగారు.

”గృహపతులారా, అధర్మాచరణ వలన, అన్యాయాచరణ వలన ఇక్కడ కొందరు చనిపోయిన తర్వాత అపాయాన్ని, దుర్గతిని, నరకాన్ని పొందుతున్నారు. మరికొందరు ధర్మాచరణ వలన, న్యాయాచరణ వలన చనిపోయిన తర్వాత సుగతిని, స్వర్గలోకాన్ని పొందుతున్నారు” అన్నాడు భగవానుడు.

”శ్రీమాన్‌ గౌతమా, ఇలా సంక్షిప్తంగా కాక, విపులంగా అర్థాన్ని విడదీసి చెప్పితే మేము వివరంగా తెలుసుకొంటాము”

”అయితే గృహపతులారా, శ్రద్ధగా వినండి, చెపుతాను”

”అలాగే శ్రీమాన్‌”

”గృహపతులారా, శరీరంతో అధర్మాన్ని ఆచరించటం, అన్యాయాన్ని ఆచరించటం మూడు విధాలుగా ఉంటుంది. మాటలతో అధర్మాన్ని ఆచరించటం, అన్యాయాన్ని ఆచరించటం నాలుగు విధాలుగా ఉంటుంది. మనస్సుతో అధర్మాన్ని ఆచరించటం, అన్యాయాన్ని ఆచరించటం మూడు విధాలుగా ఉంటుంది.

”గృహపతులారా, శరీరంతో మూడు విధాలుగా అధర్మాన్ని, అన్యాయాన్ని ఆచరించటం ఎలా ఉంటుంది? ఇక్కడ గృహపతులారా, కొందరు లోభులై, దయలేనివారై ప్రాణులను చంపి, చేతికి రక్తం అంటినవారౌతారు.

”గ్రామం నుండి గాని, అడవి నుండిగాని ఇవ్వనిదే పరధనాన్ని తీసుకొని, దొంగతనం చేస్తారు.

”ఇంకా తల్లిరక్షణలో ఉన్న, తండ్రిరక్షణలో ఉన్న, తలిదండ్రుల రక్షణలో ఉన్న, సోదరుని రక్షణలో ఉన్న బంధువుల రక్షణలో ఉన్న, గోత్రీకుల రక్షణలో ఉన్న, ధర్మరక్షణలో ఉన్న, భర్తను కలిగిన, న్యాయరక్షణలో ఉన్న, చివరకు సంబంధం కుదిరిన స్త్రీతో సంగమించి కామమిథ్యాచారానికి పాల్పడుతారు.

”గృహపతులారా, మాటలతో నాలుగు విధాలుగా అధర్మాన్ని, అన్యాయాన్ని ఆచరించటం ఎలా ఉంటుంది? గృహపతులారా, ఇక్కడ ఒకడు అసత్యవాది అవుతాడు. న్యాయస్థానంలో కాని, పరిషత్తులో కాని, బంధువుల మధ్య కాని, శ్రేణి మధ్యలో కాని, రాజకులం మధ్యలో కాని, ఒక సాక్షిగా ‘నీకు తెలిసినదే చెప్పు’ అన్నపుడు అతడు తెలియకున్నా ‘తెలుసు’ అంటాడు, తెలిసినా ‘తెలియలేదు’ అంటాడు, చూడకున్నా ‘చూశాను’ అంటాడు, చూసినా ‘చూడలేదు’ అంటాడు, ఇలా తనకోసం కాని, పరులకోసం కాని సంపదలను కోరి, తెలిసి తెలిసీ అబద్దాలు పలుకుతాడు.

”చాడీలు చెపుతాడు. ఇక్కడవిని, ఇక్కడివారి మీద భేదం కలిగించటానికి అక్కడ చెపుతాడు. అక్కడవిని, అక్కడివారి మీద భేదం కలిగించటానికి ఇక్కడ చెపుతాడు. ఇలా ఐకమత్యంగా ఉన్నవారిని విడదీస్తాడు. వర్గంలో ఆనందిస్తూ, వర్గంలో సంతోషిస్తూ, వర్గాలుగా విడదీసే మాటలు మాట్లాడుతుంటాడు.

”పరుషంగా మాట్లాడుతాడు. ఇతరులకు వెగటు కలిగించే, ఇతరులకు చేదుగా అనిపించే, పరులను అవమానించే, కోపాన్ని కలిగించే మాటలను, వారి మనశ్శాంతి చెడిపోయే విధంగా మాట్లాడుతాడు.

”వదరుబోతుగా ఉంటాడు. సందర్భం లేకుండా, శాస్త చెప్పనిదాన్ని, ధమ్మంలో లేనిదాన్ని, వినయంలో లేనిదాన్ని చెపుతాడు. పనికిమాలిన మాటలు మాట్లాడుతాడు. దేశకాలాల స్పృహ లేకుండా, అంతులేకుండా, అనర్థాన్ని కలిగించేవిధంగా మాట్లాడుతాడు. గృహపతులారా, అతడు ఇలా నాలుగు విధాలుగా మాటలతో అధర్మాన్ని, అన్యాయాన్ని ఆచరిస్తాడు.

”గృహపతులారా, మనస్సుతో మూడు విధాలుగా అధర్మాన్ని, అన్యాయాన్ని ఎలా ఆచరిస్తాడు? ఇక్కడ గృహపతులారా, ఒకడు లోభిగా ఉంటాడు, అతడు ఇతరుల ధనాన్ని చూసి ‘ఈ ఇతరుల సొమ్ము నాదైతే బాగుంటుంది’ అనుకొంటాడు.

”ద్వేషచిత్తుడై ఉంటాడు. దుష్టమనస్సుతో, దుష్టసంకల్పంతో ‘ఈ ప్రాణులు చంపబడుదురు గాక! హింసింపబడుదురు గాక! నశింతురు గాక’ అనుకొంటాడు.

”మిథ్యాదృష్టిని కలిగి, విపరీతదర్శనం కలవాడై ‘దానం లేదు, ఇష్టం లేదు, సమర్పించుకోవటం లేదు, కర్మకు ఫలంగా కలిగే సుఖదుఃఖాలు లేవు. ఈ లోకం లేదు, పరలోకం లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, స్త్రీ పురుష సంయోగం లేకుండా (ఓపపాతికంగా) పుట్టే ప్రాణులు లేరు. లోకంలో స్వయంగా ప్రత్యక్షజ్ఞానాన్ని సాక్షాత్కరించుకొని ఈలోకాన్ని, పరలోకాన్ని తెలుపుతూ సరిగా నడచుకొనే, సరియైన మార్గంలో ఉండే శ్రమణులుగాని, బ్రాహ్మణులుగాని లేరు’ అనుకొంటూ, ఇలా మనస్సుతో అధర్మాన్ని అన్యాయాన్ని ఆచరిస్తాడు.

”ఈ విధమైన అధర్మ, అన్యాయ ఆచరణవలన గృహపతులారా, ఒకడు చనిపోయిన తర్వాత అపాయాన్ని, దుర్గతిని, నరకాన్ని పొందుతాడు.

”గృహపతులారా, శరీరంతో ధర్మాన్ని ఆచరించటం, న్యాయాన్ని ఆచరించటం మూడు విధాలుగా ఉంటుంది. మాటలతో ధర్మాన్ని ఆచరించటం, న్యాయాన్ని ఆచరించటం నాలుగు విధాలుగా ఉంటుంది. మనస్సుతో ధర్మాన్ని ఆచరించటం, న్యాయాన్ని ఆచరించటం మూడు విధాలుగా ఉంటుంది.

”గృహపతులారా, శరీరంతో మూడు విధాలుగా ధర్మాన్ని, న్యాయాన్ని ఆచరించటం ఎలా ఉంటుంది? ఇక్కడ కొందరు ప్రాణాతిపాతాన్ని విరమించుకొంటారు. ప్రాణిహత్య నుండి విరమించుకొని, కర్రను, కత్తిని వదలిపెడతారు. లోభులుకాకుండా, దయకలిగినవారై ప్రాణులను చంపక, చేతికి రక్తం అంటకుండా ఉంటారు.

”ఇవ్వనిదాన్ని తీసుకోరు. గ్రామం నుండి గాని, అడవి నుండిగాని ఇవ్వనిదే పరధనాన్ని తీసుకోరు, దొంగతనం చేయరు.

”ఇంకా కామమిథ్యాచారాన్ని వదలిపెడతారు. తల్లిరక్షణలో ఉన్న, తండ్రిరక్షణలో ఉన్న, తలిదండ్రుల రక్షణలో ఉన్న, సోదరుని రక్షణలో ఉన్న. బంధువుల రక్షణలో ఉన్న, గోత్రీకుల రక్షణలో ఉన్న, ధర్మరక్షణలో ఉన్న, భర్తను కలిగిన, న్యాయరక్షణలో ఉన్న, చివరకు సంబంధం కుదిరిన స్త్రీతో సంగమించరు. కామమిథ్యాచారానికి పాల్పడరు.

”గృహపతులారా, మాటలతో నాలుగు విధాలుగా ధర్మాన్ని, న్యాయాన్ని ఆచరించటం ఎలా ఉంటుంది? గృహపతులారా, ఇక్కడ ఒకడు సత్యవాదిగా ఉంటాడు. న్యాయస్థానంలో కాని, పరిషత్తులో కాని, బంధువుల మధ్య కాని, శ్రేణి మధ్యలో కాని, రాజకులం మధ్యలో కాని, ఒక సాక్షిగా ‘నీకు తెలిసినదే చెప్పు’ అన్నపుడు అతడు తెలిస్తేనే ‘తెలుసు’ అంటాడు. తెలిసినదాన్ని ‘తెలియదు’ అనడు. చూస్తేనే ‘చూశాను’ అంటాడు. చూసినదాన్ని ‘చూడలేదు’ అనడు. ఇలా తనకోసం కాని, పరులకోసం కాని సంపదలను కోరి, తెలిసి తెలిసీ అబద్దాలు పలుకడు.

”చాడీలు చెప్పడు. ఇక్కడవిని, ఇక్కడివారి మీద భేదం కలిగించటానికి అక్కడ చెప్పడు. అక్కడవిని, అక్కడివారి మీద భేదం కలిగించటానికి ఇక్కడ చెప్పడు. విడిపోయిన వారిని కలిపే, స్నేహాన్ని పెంచే, ఐకమత్యంలో ఆనందింపజేసే, ఐకమత్యంలో సంతోషింపజేసే, ఐకమత్యాన్ని పెంపొందించే మాటలు మాట్లాడుతాడు.

”పరుషంగా మాట్లాడటాన్ని వదలిపెడతాడు. మృదువైన, చెవులకింపైన, ప్రేమనీయమైన, హృదయంగమమైన, అనేకుల మనస్సులకు ఆనందాన్ని కలిగించే, బహుజనులకు సంతోషాన్ని కలిగించే మాటలే మాట్లాడతాడు.

”వదరుబోతుతనాన్ని వదలిపెడతాడు. సందర్భాన్నిబట్టి, అర్థవంతమైనదాన్ని, జరిగినదాన్ని, ధమ్మాన్ని, వినయాన్ని, ప్రయోజనకరమైనదాన్ని మాట్లాడుతాడు. సందర్భాన్నిబట్టి, నిర్దోషంగా, పరిమితంగా మాట్లాడుతాడు. గృహపతులారా, అతడు ఇలా నాలుగు విధాలుగా మాటలతో  ధర్మాన్ని, న్యాయాన్ని ఆచరిస్తాడు.

”గృహపతులారా, మనస్సుతో మూడు విధాలుగా ధర్మాన్ని, న్యాయాన్ని ఎలా ఆచరిస్తాడు? ఇక్కడ ఒకడు లోభిగా ఉండడు, అతడు ఇతరుల ధనాన్ని చూసి ‘ఈ ఇతరుల సొమ్ము నాదైతే బాగుంటుంది’ అనుకోడు.

”ద్వేషచిత్తుడై ఉండడు. మంచి మనస్సుతో, మంచి సంకల్పంతో ‘ఈ ప్రాణులు వైరం లేకుండా ఉందురుగాక! శ్రమలేకుండా ఉందురుగాక, సుఖంగా ఉందురుగాక’ అని ఆలోచిస్తుంటాడు.

”సమ్యక్‌దృష్టిని కలిగి, విపరీతదర్శనం లేనివాడై ‘దానం ఉంది, ఇష్టం ఉంది, సమర్పించుకోవటం ఉంది, కర్మకు ఫలంగా కలిగే సుఖదుఃఖాలు ఉన్నాయి. ఈ లోకం ఉంది, పరలోకం లేదు, తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, స్త్రీ పురుష సంయోగం లేకుండా (ఓపపాతికంగా) పుట్టే ప్రాణులు ఉన్నాయి. లోకంలో స్వయంగా ప్రత్యక్షజ్ఞానాన్ని సాక్షాత్కరించుకొని ఈలోకాన్ని, పరలోకాన్ని తెలుపుతూ, సరిగా నడచుకొనే, సరియైన మార్గంలో ఉండే శ్రమణులు, బ్రాహ్మణులు ఉన్నారు’ అనుకొని, ఇలా మనస్సుతో ధర్మాన్ని, న్యాయాన్ని ఆచరిస్తాడు.

”ఈ విధమైన ధర్మ, న్యాయ ఆచరణవలన గృహపతులారా, ఒకడు చనిపోయిన తర్వాత సుగతిని, స్వర్గాన్ని పొందుతాడు.

”గృహపతులారా, ధమ్మచారి, సదాచారి ‘నేను చనిపోయిన తర్వాత క్షత్రియ సంపన్నులలో పుట్టాలని సంకల్పిస్తే, అతడు చనిపోయిన తర్వాత క్షత్రియ సంపన్నులలో పుట్టటానికి అవకాశం ఉంది. అతడు ధమ్మచారి, సదాచారి కావటమే అందుకు కారణం.

”గృహపతులారా, ధమ్మచారి, సదాచారి ‘నేను చనిపోయిన తర్వాత బ్రాహ్మణ సంపన్నులలో, గృహపతి సంపన్నులలో పుట్టాలని సంకల్పిస్తే, అతడు చనిపోయిన తర్వాత బ్రాహ్మణ సంపన్నులలో, గృహపతి సంపన్నులలో పుట్టటానికి అవకాశం ఉంది. అతడు ధమ్మచారి, సదాచారి కావటమే అందుకు కారణం.

”గృహపతులారా, ధమ్మచారి, సదాచారి ‘నేను శరీరం భిన్నమై, చనిపోయిన తర్వాత చతుమహారాజిక దేవతలలో పుట్టాలని సంకల్పిస్తే, అతడు చనిపోయిన తర్వాత చతుమహారాజికదేవతలలో పుట్టటానికి అవకాశం ఉంది. అతడు ధమ్మచారి, సదాచారి కావటమే అందుకు కారణం.

”గృహపతులారా, ధమ్మచారి, సదాచారి ”నేను చనిపోయిన తర్వాత త్రయస్త్రింశ దేవతలలో … యామదేవతలలో … తుషితదేవతలలో … నిర్మాణరతి దేవతలలో … పరనిర్మితవశవర్తిదేవతలలో … బ్రహ్మకాయికదేవతలలో … ఆభా దేవతలలో … పరిత్తాభ దేవతలలో … అప్రమానాభదేవతలలో … ఆభాస్వర దేవతలలో … పరిత్తశుభదేవతలలో … అప్రమాణశుభదేవతలలో … శుభకీర్ణదేవతలలో … వేహప్ఫలదేవతలలో … అవిహా దేవతలలో … అతప్పదేవతలలో … సుదర్శనదేవతలలో … సుదర్శిదేవతలలో … అకనిష్ఠ దేవతలలో … ఆకాశానంత్యాయతనాన్ని పొందిన దేవతలలో … విజ్ఞానానంత్యాయతనాన్ని పొందిన దేవతలలో … అకించన్యాయతనాన్ని పొందిన దేవతలలో, నేవసంజ్ఞానాసంజ్ఞాయతనాన్ని పొందిన దేవతలలో పుట్టాలని సంకల్పిస్తే, అతడు చనిపోయిన తర్వాత నేవసంజ్ఞానాసంజ్ఞాయతనాన్ని పొందిన దేవతలలో పుట్టటానికి అవకాశం ఉంది. అతడు ధమ్మచారి, సదాచారి కావటమే అందుకు కారణం.

”గృహపతులారా, ధమ్మచారి, సదాచారి ‘నేను చిత్తమలినాలు నశించగా, నిర్మలమైన చిత్తవిముక్తిని, ప్రజ్ఞావిముక్తిని, ఈ జన్మలోనే స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకొని, పొందుతాను’ అని సంకల్పిస్తే అతడు చిత్తమలినాలు నశించగా, ఈజన్మలోనే స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకొని, నిర్మలమైన చిత్తవిముక్తిని, ప్రజ్ఞావిముక్తిని పొందటానికి అవకాశం ఉంది. అతడు ధమ్మచారి, సదాచారి కావటమే అందుకు కారణం.”

అలా చెప్పగా సాలేయ్యక బ్రాహ్మణ గృహపతులు భగవానునితో ఇట్లన్నారు: ”సుందరం శ్రీమాన్‌ గౌతమా, సుందరం. శ్రీమాన్‌ గౌతమా, బోర్లపడ్డదాన్ని చక్కగా నిలిపినట్లు, మూసినదాన్ని తెరిచినట్లు, మూఢునికి త్రోవచూపినట్లు, చీకటిలో కన్నులు కలవాడు చూడటానికి వీలుగా నూనెదీపం పట్టినట్లుగా, శ్రీమాన్‌ గౌతములవారు అనేకవిధాలుగా ధమ్మాన్ని ప్రకాశింజేశారు. ఇదిగో మేము శ్రీమాన్‌ గౌతములవారిని శరణు పొందుతున్నాము, ధమ్మాన్ని, భిక్షుసంఘాన్ని కూడా. నేటి నుండి మా కంఠంలో ప్రాణాలున్నంతవరకు శ్రీమాన్‌ గౌతములు మమ్ములను శరణాగత ఉపాసకులుగా గుర్తుంచుకొందురు గాక!”’

అనువాదం: భిక్ఖు ధమ్మరక్ఖిత