“ఒకే ఒక్కదారి (అష్టాంగమార్గం)” అనే పేరుతో బొర్రా గోవర్ధన్ రాసిన పుస్తకం 2018 సెప్టెంబరులో వెలువడింది. ఇది లతారాజా ఫౌండేషన్, హైదరాబాద్ వారి ప్రచురణ. 168 పేజీల ఈ పుస్తకం ధర 150 రూపాయలు.

ఈ పుస్తకంలో, బుద్ధుడు బోధించిన అష్టాంగమార్గాన్ని సులభ శైలిలో వివరించటానికి ప్రయత్నించినట్లు రచయిత చెప్పుకున్నారు. కనుక, యిది బుద్ధవచనాన్ని అనుసరించి రాయబడిందని పాఠకులు ఆశించటం సహజం. పైపైన చూస్తే, యిది నిజంగా బుద్ధవచనాన్ని అనుసరించి రాసిన పుస్తకమనే అనిపిస్తుంది. కాని ఒకింత లోతుగా పరిశీలించి చూస్తే, దీనిలో వివరించిన ‘ఒకే ఒక్కదారి’ బుద్ధవచనంలోని అష్టాంగమార్గాన్ని వివరించటంలో కచ్చితత్వాన్ని పాటించలేదని తెలుస్తుంది.

ఈ పుస్తకంలో బౌద్దేతరుల రచనల నుండి ఉటంకించిన వాక్యాలు విరివిగా ఉన్నాయి. కాని బుద్ధవచనం నుండి లేదా ప్రామాణిక ఆధునిక బౌద్ధరచనల నుండి గాని, యథాతథంగా ఉటంకించిన వాక్యాలు దీనిలో దాదాపు లేవనే చెప్పాలి. కేవలం రెండు చోట్ల [68, 73 పేజీల్లో] బుద్ధుని మాటలుగా చెప్పిన వాక్యాలు ఉన్నా, అవి బౌద్ధగ్రంథాల నుండి స్వీకరించినవి కావని కచ్చితంగా చెప్పవచ్చు. బౌద్ధాన్ని సులభ శైలిలో వివరించాలని తలపెట్టిన యీ రచనలో, ఉపాదాన, స్కంధ, ఓపనాయికో, ప్రతీత్యసముత్పాదం తదితర కీలకమైన పదాలకు అర్థాలు కనిపించవు. దీనిలో వివరించ దలచిన అసలు విషయం పట్ల తగిన అధ్యయనం, అవగాహన కొరవడినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికితోడు, బౌద్ధంతో పొసగని కొన్ని అభిప్రాయాలను బౌద్ధానికి ఆపాదించే ప్రయత్నం జరగటంతో, ఎంచుకున్న విషయం గందరగోళానికి గురైంది.

ఈ పుస్తకం, బౌద్ధ సాహిత్యాన్ని ‘తేలిగ్గా వంటబట్టేలా’ అందించే రచనలకు దారి చూపించగలదని రచయిత ఆశించారు. కాని, పైన పేర్కొన్న కారణాల వల్ల, పుస్తకంలో అసలు విషయం కలగాపులగమై, బుద్ధుని అష్టాంగమార్గం స్పష్టంగా వివరించబడలేదు సరికదా, దానిపై మరింత గందరగోళానికి తావిచ్చింది.

*        *        *

‘ఒకే ఒకదారి’ అనే రచనపై స్థూలంగా పైన ప్రకటించిన అభిప్రాయానికి దారితీసిన కొన్ని కారణాలను కింది విధంగా చెప్పవచ్చు.

ఒకటి: నాలుగు ఆర్యసత్యాల్లో “మొదటి మూడూ, బుద్ధుడే కాదు, అనేక మంది చింతనాపరులు వాటి గురించి చెప్పారు” అని రచయత అన్నారు [పేజి 13]. ఇటువంటి అభిప్రాయం బౌద్ధ గ్రంథాల్లో లేదా ప్రామాణిక బౌద్ధ రచనల్లో ఎక్కడా కనిపించదు. నాలుగు ఆర్యసత్యాలు, ప్రత్యేకించి దుఃఖకారణ సత్యం, అంటే ప్రతీత్యసముత్పాదం, బుద్ధుని స్వంత ఆవిష్కరణ అని బౌద్ధ గ్రంథాలు పదేపదే నొక్కిచెప్పాయి. ప్రపంచ వ్యాపితంగా బౌద్ధ పండితులు లేక బౌద్దేతరులు గాని, ఎవరూ దీనిపై భిన్నాభిప్రాయం వ్యక్తం చెయ్యలేదు. కనుక, ఆర్యసత్యాల్లో మొదటి మూడింటిని ‘అనేక మంది చింతనాపరులు చెప్పారు’ అనటం పూర్తిగా నిరాధారమైన ప్రకటన.

రెండు: 23వ పేజిలో, సంస్కార దుఃఖం అనే విషయాన్ని వివరిస్తూ, “రంగు, రుచి, వాసనలు ఇవ్వన్నీ రూపస్కంధాలు” అని రచయిత అన్నారు. పంచస్కంధాల్లో ‘రూప’ అనే పదాన్ని పూర్తిగా అపార్థం చేసుకున్న వాక్యం యిది. మనిషి ఐదు స్కంధాల (రూప, వేదన, సంజ్ఞ, సంఖార, విజ్ఞాన అనే రాసుల) నిర్మితమని బుద్ధుడు చెప్పాడు. వీటిలో ‘రూప’ అనే పదం వ్యక్తి భౌతిక కాయాన్ని, మిగతా నాలుగు మానసిక అంగాలను వ్యక్తంచేసే పదాలు. అంతేగాని ‘రూపస్కంధం’ అనేది రంగు, రుచి, వాసనలు గల బాహ్య వస్తువును లేదా వ్యక్తులను సూచించే పదం కాదు. తరువాత, 25వ పేజిలో, “స్కంధాల సంఘటన (కలయిక) విఘటన (విడిపోవటం) లే కర్మ” అని రచయిత అన్నారు. అంతేకాదు, “ఇలా కలిసి, విడిపోవటం సహజం. అదే ప్రాకృతిక ధర్మం” అని కూడ ప్రకటించారు. కర్మ గురించి యిలాంటి నిర్వచనం బుద్ధుని బోధనల్లో ఎక్కడా కనిపించదు. పైగా “చేతననే నేను కర్మ అంటాను” [అంగుత్తరనికాయ 6:63] అని బుద్ధుడు చెప్పిన నిర్వచనానికి యిది పూర్తి విరుద్ధంగా ఉంది.

మూడు: దుఃఖనిరోధం గురించి చెబుతూ 28వ పేజిలో, “సమాజానికి దూరంగా, మనుషులతో, సమాజంతో పనిలేకుండా ఎదో అడవి మూలకు చేరి బతికేవారికి ఎలాంటి “నిరోధాలు” అవసరం లేదు. ఎందుకంటే…. వారికి మనుషులతో, సమాజంతో సంపర్కం ఉండదు కాబట్టి. అలాంటి వారికి మనోఘర్షణలు ఉండవు” అని రచయిత చెప్పారు. ఇది బుద్ధుని తత్వానికి పూర్తిగా విరుద్ధం. అవిద్యావంతులైన వారు, సమాజానికి దూరంగా అడవుల్లో జీవించినా కూడ దుఃఖం నుండి తప్పించుకోలేరని బుద్దుడు అనేక సుత్తాల్లో చెప్పాడు. ఉదాహణకు మజ్ఝమనికాయలోని భయభేరవసుత్తం చూడండి.

నాలుగు: అష్టాంగమార్గాన్ని వివరించే అధ్యాయం శీర్షిక “ఆటంకాలు లేవు …. అవరోధాలు రావు” అనే మాటలతో మొదలైంది [పేజి 31]. ఇది కూడ బుద్ధవచన స్ఫూర్తికి విరుద్ధమైందే. దుఃఖవిముక్తి మార్గంలో సాధకునికి ఐదు అవరోధాలు (పంచనీవరణలు) ఎదురౌతాయని, వాటిని అధిగమించకుండా సాధనలో ముందుకు సాగలేమని బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు. మనం చర్చిస్తున్న పుస్తకం 142వ పేజిలో రచయిత కూడ దీన్ని అంగీకరించారు. మరి “ఆటంకాలు లేవు …. అవరోధాలు రావు” అనటం దీనికి విరుద్ధం కాదా!

ఐదు: 64వ పేజిలో, ద్వేషం, అసూయ, క్రోధం, ఈర్ష్య మొదలైన “మానసిక జబ్బులన్నీ ‘అదనపు విలువ’ సృష్టించిన జబ్బులే!” అని రచయిత సూత్రీకరించారు. ఇది “మనో పుబ్బంగమా ధమ్మా” అని చెప్పిన బుద్ధుని తత్వంతో పొసగని అభిప్రాయమని ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం లేదు. నిజానికి, అదనపు విలువ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మార్క్సు కూడ పై సూత్రీకరణను అంగీకరించడు. మార్క్సువాదం ప్రకారం, అదనపు విలువ సమాజ ప్రగతికి జీవగర్ర వంటిది; అది దోపిడికి గురికావటం సామాజిక రుగ్మతలకు కారణం.

ఆరు: అష్టాంగమార్గంలోని ఎనిమిది అంగాలను సూచించే పదాలకు, బౌద్ధగ్రంథాలు స్పష్టమైన నిర్వచనాలు అందించాయి. సంయుత్తనికాయలోని విభంగసుత్తం [45:8] యిందుకు చక్కటి ఉదాహరణ. కాని, మనం చర్చిస్తున్న పుస్తకంలో సదరు నిర్వచనాలు గాని, వాటిని అనుసరించిన దాఖలాలు గాని లేవు. వీటి స్థానంలో, అరకొర జ్ఞానంతో చెప్పిన స్వంత వ్యాఖ్యలే కనిపిస్తాయి. అటువంటి కొన్ని ఉదాహరణలు చూడండి.

(a) ఆర్యసత్యాలను, వాటిలో చివరిదైన అష్టాంగమార్గాన్ని వివరించే సందర్భాల్లో, అన్నిటికంటే ముందు, బుద్ధుడు దీన్ని “మధ్యమమార్గం” అని అన్నాడు. కామసుఖాలు, దేహదండన యోగం అనే అతివాదాలను తిరస్కరించటమే మధ్యమమార్గం. అయితే, ‘ఒకే ఒక్కదారి’ పుస్తకంలో మధ్యమమార్గం అనే  భావన అసలు కనిపించదు.

(b) సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం అనే అంగాలను వివరించే అధ్యాయాల్లో, వీటి గురించి బౌద్ధగ్రంథాలు చెప్పిన వివరణ లేదు. ఈ అంగాల గురించి పుస్తక రచయిత చెప్పినదంతా మామూలు ‘లోకజ్ఞానం’లా ఉంది తప్ప, బుద్ధవచనంతో దానికి పొంతన లేదు. ఉదాహరణకు, సమ్యక్ సంకల్పం అంటే “కామసుఖాలను, ద్వేషపూరితమైన క్రూరమైన ఆలోచనలను విడనాడాలనే తలపు” అని బౌద్ధగ్రంథాలు చెప్పాయి. కాని, పుస్తక రచయిత దీన్ని ‘స్థిరమైన పట్టుదల’ అనే అర్థంలో వివరించారు. [వీటి గురించి సరైన వివరణ కోసం పియదస్సి మహాథేర రచన The Buddha’s Antient Path, 89వ పేజి చూడండి.]

(c) అష్టాంగమార్గంలో మూడవ అంగమైన సమ్యక్ వచనం (సమ్మావాచ) గురించి బుద్ధుడు యిలా చెప్పాడు: “బిక్షువులారా సమ్మావాచ అంటే, అబద్ధపు మాటలు, తంపులమారి మాటలు, దురుసు మాటలు, నిరర్థకమైన మాటలను విరమించటం.” అలాగే, సమ్యక్ యత్నం (సమ్మావాయామ) గురించి బుద్ధుడు చెప్పిన వివరణ యిది: “1. హానికరమైన చెడు ధర్మాలు (ఆలోచనలు, చర్యలు, పరిస్థితులు) తలెత్తకుండా చూడటం 2. ఇప్పటికే ఉత్పన్నమైన హానికరమైన చెడు ధర్మాలను తొలగించటం లేక నిర్మూలించటం 3. హితకరమైన ధర్మాలను ఉత్పన్నం చెయ్యటం 4. ఉత్పన్నమైన హితకర ధర్మాలను సంరక్షించి వృద్ధిచెయ్యటం” [సంయుత్తనికాయ 45:8]. బుద్ధుడు చెప్పిన యిటువంటి నిర్వచనాలు సూటిగా, స్పష్టంగా, సరళంగా ఉంటాయి. అయినా, మనం చర్చిస్తున్న పుస్తకంలో వీటి ప్రస్తావనే కనిపించదు. వీటి స్థానంలో రచయిత స్వంత వ్యాఖలే ఉన్నాయి.

(d) సమ్యక్ స్మృతి అంటే “నిరంతరం గుర్తుపెట్టుకోవడం” [పేజి 123] అని, రచయిత చెప్పిన నిర్వచనం సరికాదు. స్మృతి అనే సంస్కృత పదానికి (పాలిలో సతి) ‘గతాన్ని గుర్తుపెట్టుకోవటం’, ‘వర్తమానాన్ని గమనించటం లేక ఎరుకలో ఉండటం’ అనే రెండు అర్థాలు ఉన్నాయి. బుద్ధుడు సూచించిన ధ్యానంలో యీ పదం రెండవ అర్థంలోనే ఉపయోగించబడింది. కనుక, సమ్యక్ స్మృతి అంటే ‘నిరంతరం గుర్తుపెట్టుకోవటం’ కాదు. తరువాత, కాయానుపస్సనా అనే దానికి రచయిత చెప్పిన వివరణ యిది: “శరీరం, శారీరక సౌందర్యం, శారీరక వాంఛలే సమస్త సుఖాల మార్గం అనుకునే అకుశల భావాల్ని నిరంతరం దూరం చేసుకుంటూ ఉండాలి. శారీరక ఆరోగ్యం పట్లే కుశల భావాలతో ఉండాలి. ఇందుకోసం ఇంద్రియాల్ని అదుపులో ఉంచుకోవాలి.” కాయానుపస్సనా గురించి బౌద్ధ గ్రంథాలు చెప్పిన విషయాలతో కనీస పరిచయం లేకుండా రచయిత చెప్పిన వివరణ యిది. ఇక వేదనానుపస్సనా, చిత్తానుపస్సానా, ధమ్మానుపస్సానా అనేవాటికి చెప్పిన వివరణలు కూడా దాదాపు యిలాగే ఉన్నాయి. (వివరాలకోసం సతిపట్ఠానసుత్తం చూడండి.)

(e) చివరి అధ్యాయంలో, ధ్యానం ప్రధానంగా రెండు విధాలు అంటూ, రచయిత చిత్తఏకాగ్రత, విపస్సనా అనే వాటిని పేర్కొన్నారు [పేజి 158]. కాని బౌద్ధ గ్రంథాల ప్రకారం యివి సమథ, విపస్సనా [సమథవిపస్సనాసుత్తం, సంయుత్తనికాయ 43:2]. ‘ఒకే ఒక్కదారి’లో సమథ అనే భావన ఎక్కడా కనిపించదు. ఇక, విపస్సనా అంటే, అస్తిత్వపు మూడు మౌలిక లక్షణాల – అనిత్య, దుఃఖ, అనాత్మ-  వెలుగులో జీవితాన్ని యథాభూతంగా దర్శించటమని బౌద్ధగ్రంథాలు చెప్పాయి. కాని, ఈ పుస్తకంలో విపస్సనా గురించి చర్చించిన సందర్భంలో త్రిలక్షణాల ప్రస్తావనే లేదు.

సమ్యక్ సమాధి గురించి రాయబోయే ముందు [పేజి 146లో] రచయిత చెప్పిన యీ మాటలు చదవండి: “నేను ఇక్కడ సమాధి స్థితిని రాయాలంటే ఆస్థితి అనుభవించి రాయాలి. అలా రాస్తే ఇది ‘రచన’ అవదు అనుభవైక వేద్యం అవుతుంది. ఆ అనుభూతిని అక్షరాల్లో ఇమడ్చలేము. ఏ అనుభూతినీ ఖచ్చితంగా వ్యక్తం చేసే విధానం ఇంతవరకు లేదు. రాదు.” ఈ వాక్యాల్లోని తార్కిక గందరగోళాన్ని అలా ఉంచితే, పైన పేర్కొన్న దోషాలకు కారణం అవగాహనా లోపమే గాని, అనుభవ రాహిత్యం కాదని కచ్చితంగా చెప్పవచ్చు.

*        *        *

ఆర్యసత్యాలను, వాటిలో భాగమైన అష్టాంగమార్గాన్ని వివరించటం అంటే, ఒకరకంగా, బుద్ధధర్మ సారం మొత్తాన్ని వివరించటమే. అందుకే అష్టాంగమార్గం గురించి చెబుతూ వల్పోల రాహుల మహాథేర, “బుద్ధుడు నలభైఐదు సంవత్సరాల పాటు బోధించినదంతా ఏదోఒక రూపంలో యిదే” అని అన్నారు. ఇటువంటి గంభీరమైన విషయం గురించి రాయదలచిన వారు, దాన్ని మూలవనరుల నుండి సమగ్రంగా అధ్యయనం చేసి, సరైన అవగాహన ఏర్పరచుకోవటం అవసరం. దీన్ని సులభంగా అర్థమయ్యేట్లు రాయటానికి, సదరు విషయంపై మరింత పట్టు ఉండాలి. ‘ఒకే ఒక్కదారి’లో యివి లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే అది ఉద్దేశించిన లక్ష్యాన్ని సాధించకపోగా, బుద్ధుని అష్టాంగమార్గాన్ని అపార్థం చేసుకోటానికి తావిచ్చేదిగా ఉంది.

పుస్తక విమర్శ: డి. చంద్రశేఖర్

⇐శీర్షికలు