[The Ancient Path of The Buddha అనే పుస్తకంలోని 7వ అధ్యాయం నుండి ఎంపికచేసిన పాఠం ఇది.]

అష్టాంగమార్గంలోని మొదటి అంగం సమ్యక్ దృష్టి లేక సరైన అవగాహన. అంటే వస్తువులను యధాతధంగా, ఉన్న వాటిని ఉన్నట్లు అర్ధం చేసుకోవడం, చూడడం. సరైన అవగాహన, సమ్యక్ దృష్టి  అంటే మామూలు జనం అర్థం చేసుకొనేదానికి, బౌద్ధం చెప్పేదానికి చాలా తేడా ఉంది. బౌద్ధంలో సమ్యక్ దృష్టి అంటే ‘ఎరుక’ (insight) ను పంచ ఉపాదాన స్కoధాలకు అన్వయించి, వాటి అసలు స్వభావాన్ని తెలుసు కోవడం. అంటే, వ్యక్తి తనను తాను అర్థం చేసుకోవడం. ఇది తనను తాను పరీక్షించుకోవడం. ఇప్పుడు మనం ఈ విషయాన్ని చర్చిద్దాం.

సమ్యక్ దృష్టి  అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటె, అష్టాంగమార్గంలో మిగతా ఏడు అంగాలు, దీని మార్గ నిర్దేశకత్వంలో కొనసాగావలసిందే. మన ఆలోచనలు సరైనవే అని అది హామీ ఇస్తుంది. మన భావాలను అది సమన్వయం చేస్తుంది. దీని ఫలితంగా ఆలోచనలు భావాలు, స్పష్టమై, కుశలాలైతే, మనిషి వాక్కు చర్యల మధ్య సరైన సంబంధం ఏర్పడుతుంది – మళ్ళీ ఈ సమ్యక్ దృష్టి  ద్వారానే ఒకడు నిరర్థక వృధా ప్రయత్నాలను వదిలిపెట్టి, సమ్యక్ సతిని పెంచి పోషించే సమ్యక్ యత్నాన్ని అలవరుచుకొంటాడు. సమ్యక్ దృష్టితో కూడిన సమ్యక్ యత్నం, సమ్యక్ సతి, సమ్యక్ సమాధికి చేరుస్తాయి. ఈ విధంగా బౌద్ధానికి ఆయువు పట్టైన  ఈ  సమ్యక్ దృష్టి, ఈ సహకార వ్యవస్తలోని  ఇతర అంగాలను సరైన దిశలో నడిపిస్తుంది.

సమ్యక్ దృష్టికి దోహదంచేసే  రెండు పరిస్థితులు (షరతులు) ఉన్నాయి. అవి: 1. ఇతరుల నుంచి వినడం, అంటే సద్ధర్మాన్ని వినడం (పరతొ ఘోష) 2. తెలివిగా మనస్సులో నిలుపుకోవడం (యోనిసొ మనసికార).  మొదటి  షరతు బాహ్యమైనది. అంటే  బయటి నుంచి మనం పొందేది, గ్రహించేది.  రెండోది అంతరంగికం – అంటే మనం అభ్యాసం ద్వారా అలవరుచుకోనేది. (మనసికార  అంటే  మనస్సుతో  చేయడం).

మనం వినే విషయం ఆలోచనకు మేత వేస్తుంది. మన దృష్టులను ఏర్పరుచుకోవడంలో అది  దారి చూపుతుంది. అందుకని వినడం అనేది చాల ఆవశ్యకం. కాని ఆ వినేది సమ్యక్ అవగాహనకు దోహదం చేసేదిగా ఉండాలి. ఋజు ఆలోచనకు అడ్డంకులయ్యే ఇతరుల అకుశల, హానికర వాక్కులను వినరాదు.

రెండవ షరతు క్రమబద్ద అవధానం. దీనిని పెంపొందించటం చాల కష్టం. ఎందుకంటే నిత్య జీవితంలో ఎప్పుడూ ఎదురయ్యే అనేక విషయాలు మన దృష్టిని, సావధానతను ఆకట్టుకొంటాయి. సూత్రాలలో తరచూ ఉపయోగించే ‘యోనిసొ-మనసికార’ పదబంధం చాల ముఖ్యమైంది. ఎందుకంటే, విషయాలను లోతుగా చూడడానికి దోహదం చేస్తుంది. అసలు యోనిసొ అంటే శబ్దార్థ పరంగా గర్భం. అంటే పైపైన చూడడానికి కాక గర్భంలోకి వెళ్ళి, లోతులకు వెళ్ళి చూడడానికి దోహదం చేస్తుంది. రూపకంగా చెప్పాలంటే, అది ‘సమూల హేత్వీకృత’ అవధానం (మనసికార) అవుతుంది. ‘ఆయోనిసొ – మనసికార’ అంటే తెలివిలేని, అక్రమ అవధానాన్ని బుద్ధుడు ఎప్పుడూ గర్హించాడు. ఎందుకని అంటే, అది  ఎప్పుడూ ప్రత్యయాలతో కూడి ఉండడాన పరిశీలించడానికి గాని లేదా స్కంధాలను విశ్లేసించడానికి గాని అనుమతించదు. అందుకని క్రమ అవధానాన్ని పెంపొందించుకొని, అక్రమ అవధానాన్ని వదిలి పెట్టాలి. ఈ రెండు షరతులు – విని నేర్చుకోవడం, క్రమబద్ధ అవధానం రెండు కలిసి సమ్యక్ దృష్టిని పెంపొందిస్తాయి.

నిజంగా సత్యాన్ని అన్వేషించేవాడు పైపై జ్ఞానంతో, వస్తువులు పైకి బాహ్యంగా కనిపించే తీరుతో సంతృప్తి చెందడు. అతడు మామూలు కంటికి కనిపించే దానిని దాటి, లోతులకు పోయి చూడాలనుకొంటాడు. బౌద్ధం ప్రోత్సహించేది ఇటువంటి పరిశోధననే. ఎందుకంటే అది సమ్యక్ దృష్టికి దారి తీస్తుంది. ఒక విశ్లేషకుడు ఒక వస్తువును దాని వివిధ గుణాలలోకి విభజించి, పరిశీలించి, వాటిని ఒక క్రమ పద్ధతిలో పేర్చి, ఆ తరువాతనే దానిని గురించి ఒక విస్పష్ట  ప్రకటన చేస్తాడు. వాటన్నింటిని ఒక మొత్తంగా, ఒక రాశిగా చూసి, ఏకంగా ఒకే మాటుగా చెప్పడు. కాని వాటి వాటి ముఖ్య లక్షణాలను గుర్తించి, విభజించి, వ్యావహారిక సత్యం, పరమ సత్యం రెండూ కలగాపులగం కాలేదని నిర్థారించుకొన్న తరువాత వాటిని ప్రకటిస్తాడు.

బుద్ధుడు అత్యన్తంగా విభాజ్యవాది అంటే విచక్షణ, విశ్లేషణలు ఉన్నవాడు. ఒక విజ్ఞాన శాస్త్రవేత్త ఒక అవయవాన్ని కణజాలంలోకి, దానిని తిరిగి కణాలలోకి ఎలా విభజిస్తాడో, ఆయన కూడా సంఘటిత,  సప్రత్యయ (conditioned) వస్తువులన్నింటిని, వాటి ప్రాథమిక మూల కణాలలోకి విశ్లేషించాడు. పసలేని ఆలోచన, అక్రమ అవధానం అనేవి మనిషిని ఆందోళిత మనస్కుని చేసి, వస్తువుల అసలు స్వభావాన్ని  చూడనీయవు, కనుక ఆయన వాటిని గర్హించాడు. ఒకడు సమ్యక్ దృష్టి ద్వారానే, కార్య-కారణాన్ని,  ప్రత్యయిత వస్తువుల ఉత్పాద భంగాలను, ధర్మంలో ఇమిడివున్న సత్యాన్ని అలా తెలుసుకోవలసిందే తప్ప, అంధవిశ్వాసంతో గాని, మిధ్యా దృష్టితో గాని, ఊహలతోగాని, తత్త్వం ద్వారా  గాని  తెలుసుకోలేము.

బుద్ధుడు అంటాడు: ‘ధర్మం తెలివైన వారికే, మూర్ఖులకు కాదు’. ఆ తరువాత దశల వారీగా, మిధ్యా దృష్టులను పరిహరిస్తూ ప్రజ్ఞను ఎలా పొందాలో వివరించాడు. సమ్యక్ దృష్టి మొత్తం బోధ అంతా నిండి ఉంది. ధర్మం ప్రతి భాగంలోను ప్రతి పక్షంలోను అభివ్యక్తమైంది; బౌద్ధానికి ఇది కీలకంగా పని చేస్తుంది.

రచన: పియదస్సి మహాథేర

అనువాదం: అన్నపరెడ్డి బుద్ధఘోషుడు

 

⇐శీర్షికలు