బౌద్ధం మీద ఎంతో రాశాను, ఎంతో కూశాను కానీ “లోపలకు” చేరలేకపోయాను. బోధి అవబోధ, ఆలోకనం, అవలోకనం జరగలేదు. కొంతమంది ఉన్నారు. వారికి బోధి అవబోధమైంది, ఆలోకనం అయింది. వారు తమ పేర్ల చివర “బోధి” అని పెట్టుకుంటున్నారు. అంతటి “బోధి” పొందిన వారికి అభివాదాలు తెలియజేస్తున్నాను. వారు నిజంగా ధన్యులు.

నేను బుద్ధఘోషుడు అని నా పేరులో చేర్చాను. కాని నేను ఆ బుద్ధఘోషుని అంతటి వాడిని కాను. నేను కేవలం బుద్ధఘోష (వాణి) ను వినిపించే వాణ్ణి మాత్రమే. ఆ లోతులకు ఎదగని వాడినని వినమ్రంగా ఒప్పుకొంటాను. నాకు జ్ఞాన-దర్శనం (knowledge and vision), అంటే బోధి అవబోధం కాలేదు.

నేటి ప్రపంచంలో ఇద్దరు ఆ స్థాయికి ఎదిగారని భావిస్తాను. ఒకరు భిక్ఖు బోధి, రెండోవారు వియత్నాం దేశ బహిష్కృతుడై, ఫ్రాన్స్ ప్రవాసి అయి, మొన్న నవంబరులో, చాలా ఏళ్ల తర్వాత, స్వదేశంలో తన పగోడకు పునఃప్రవేశం చేసిన థిచ్ న్హాత్ హన్. ఈయన జెన్ బుద్ధిస్ట్ మాంక్. (వీరి దగ్గరే నేను 1997 మార్చి 9వ తేదీన, మద్రాసు థియోసాఫికల్ సొసైటీలో నిర్వహించిన వర్షావాసంలో ఉపాసక దీక్ష తీసుకొన్నాను.)

పొతే బోధి “లోపలికి” ప్రవేశించే ప్రయత్నం గురించి ప్రస్తావిస్తాను. “బోధి” అంటే enlightenment, ప్రజ్ఞ (wisdom); బౌద్ధిక నైతిక ఆదర్శ స్థితి. దీనిని మనిషి మానుష సాధనాల ద్వారా మాత్రమే చేరగలడు. ఏ అతీత, అతిప్రాకృతిక శక్తుల ద్వారా కాదు. అసలు “బుద్ధ” అనే పదానికి శబ్దార్థమే బోధి.

ఇటువంటి బోధి, ప్రపంచం ఆవిర్భవించినప్పటి నుంచి నేటి వరకు, ఒక్క చారిత్రక సిద్ధార్థ గోతమునికి  తప్ప, మరెవరికీ – వామక, అట్ఠక, అంగీరస, భృగు, భారద్వాజ, వశిష్ట, విశ్వామిత్రాదులతో సహా – ఎవరికీ బోధి కలుగలేదు. మరి అటువంటి ఈ బోధి ఏమిటి? బోధి అంటే ఈ ధర్మాల (దృగ్గోచర ప్రపంచ, దృగ్విషయ ధర్మాల) వాస్తవికతను సాక్షాత్కారం (penetration) చేసుకోవడం. అంటే insight తో చూడటం. ధర్మ అంటే ప్రపంచం మొత్తం, దాని విషయ గత, వస్తుగత లక్షణాల, స్వభావాల సమాచారం. దీనికి ఆంగ్లంలో thing అనే పదం ఇంచుమించు సమానార్ధకం. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచం అంతా. ప్రపంచం అంటే proliferation. ఇటువంటి దృగ్విషయక ధర్మాల ప్రపంచం లోతులకు పోయి, ఎవరూ వినని, కనని, ధర్మాల వాస్తవికతా స్వభావాన్ని (reality of nature ని) సాక్షాత్కారం చేసుకొన్నాడు బుద్ధుడు.

మరి ఆరేళ్లు కష్టపడి, శ్రమించి, పొట్ట ఎండ గట్టుకొని, తపస్సు చేసి ఎందుకు సాధించాడు? కేవలం ఆయన లక్ష్యం వస్తువు అసలు ధర్మాన్ని ఒక శాస్త్రజ్ఞునిలా (అతడు నిజంగా శాస్త్రవేత్త అనుకొండి) కేవలం తెలుసుకోవడం కోసం కాదు. ఇదంతా చేసింది దుఃఖ మయమైన ఈ ప్రపంచం కంటనీరు తుడవడానికి. ఇదే అతని కేంద్రీయ భావన. నేను ఇక్కడ దుఃఖాన్ని వివరించను. దానికి ఎవరూ సరైన నిర్వచనాన్ని, వివరణను ఇవ్వలేకపోయారు. దానిని అలా వదిలేసి, సర్వవ్యాప్తమైన సర్వపరివేష్టితమైన దుఃఖాన్ని – అందుకే “సబ్బే సంఖార దుక్ఖ” అని అన్నాడు. అటువంటి ఈ దుఃఖ నిర్మూలనం చుట్టే బౌద్ధం తిరుగుతుంది.

మరి ఈ దుఃఖం ఎందుకున్నట్లు? బుద్ధుడంటాడు, ఈ దుఃఖానికి అవ్యవహిత కారణం (immediate cause) ఆకర్షణలు వికర్షణలు. మరి ఈ ఆకర్షణ వికర్షణలకు మూలకారణం ఏమిటి? అది మోహం (confusion). మరి ఈ మొహం దేని గురించి? ప్రపంచ “వాస్తవికతా స్వభావం” గురించి. బుద్ధుడు దీనికి విరుగుడుగా, తాను సాక్షాత్కారం చేసుకున్న ప్రపంచ వాస్తవికతా స్వభావాన్ని చెప్పాడు. ఈ సాక్షాత్కారం మోహానికి విరుగుడైతే, దీని కారణంగా జనించిన ఆకర్షణ వికర్షణ విరిగి పోతాయి. అందుకని ఇది దుఃఖానికి అంతం పలుకుతుంది. దీనినే ధర్మచక్ర ప్రవర్తన సూత్రంలో చెప్పాడు. ఇదే బౌద్ధం మొత్తానికి మూల కేంద్రం.

దృగ్విషయక ప్రపంచం, సాంసారిక ప్రపంచం దుఃఖమయ ప్రపంచంగా ఎందుకు కనిపిస్తుంది? మోహం వలన. మోహం ఎందుకుంది? ప్రపంచ మౌలిక వాస్తవికతా స్వభావాన్ని (fundamental nature of reality) యధాతధంగా – ఉన్న దానిని ఉన్నట్లు – చూడలేకపోవడం వలన;  సమ్మాదిట్టి లేకపోవడం వలన. అందుకే బుద్ధుడు సమ్మాదిట్టిని వివరించి, ప్రపంచ భౌతిక వాస్తవికతా స్వభావాన్ని విశ్లేషించి, విభాజ్యవాది (analyst) అయ్యాడు. విశ్లేషణను అర్థం చేసుకుంటే తలకిందులుగా కనిపించే ప్రపంచం తిన్నగా కనిపిస్తుంది.

ఇక్కడ ప్రపంచం తలకిందులుగా కనిపించడం అంటే ఏమిటో క్లుప్తంగా వివరిస్తాను. మనకు ఎన్నో సుత్తాలలో చివర – ఒక బ్రాహ్మణుడో, సమణుడో, గృహస్తుడో, బుద్ధుని నోటి నుంచి ధర్మకథనం విని చివరకు, “భన్తే, అది ఆశ్చర్యం, అద్భుతం. ధర్మాన్ని చక్కగా వివరించారు. ఆ వివరణ ఎలా ఉందంటే,  ‘తలకిందులుగా ఉన్నదాన్ని తిన్నగా నిలిపినట్లుగా, చీకటి గదిలో చూపు బాగా ఉన్నవాడు, రూపాలను చూడటానికి వీలుగా మీరు దీపం పట్టినట్లుగా’  …. ఉంది”. ఆ సుత్తాలన్నిటినీ ఇలాగే అనువదించాను. నేటి వరకు, నాకు “తలకిందులు” అంటే ఏమిటో, రూపాలు కనిపించడానికి దీపం పట్టడం అంటే ఏమిటో అర్థంకాలేదు. నిన్ననే (14-12-2018) ఒక విపస్సన – లోచూపు, insight – అంతఃదృష్టి మెరిసింది. దీన్ని ఒక దృష్టాంతంతో వివరిస్తాను.

మా ఇంటి ముందు అరవై ఏళ్లుగా ఒక వేపచెట్టు ఉంది. నేను నా మనోనిర్మితి అయిన “వేపచెట్టు” అనే పదాన్ని (concept లేక lable ను) దానికి అంటించాను. ఈ అరవై ఏళ్లుగా దానిని “వేపచెట్టు” అనే పిలుస్తున్నా. పేరు మారలేదు. కాని అది సూచించే అసలు చెట్టు క్షణక్షణం మారుకొంటూ వస్తుంది. Concept మారదు, అది సూచించే వస్తువు మారుతుంది. మన మనసు లోపల పుట్టిన – మనోనిర్మితి అయిన – పదాన్ని లోపల నుంచి బయటకు లాక్కెళ్ళి దానికి అంటించాము. మారే చెట్టుకు మారని లోపలి మనోనిర్మితిని అంటించాం. ఈ కారణంగా చెట్టులోని మార్పును చూడలేకపోతున్నాం. లోపలి మనసులోని చెట్టు వేరు, బయటి చెట్టు వేరు. ఇదే తారుమారు. ఈ తారుమారును సమ్మాదృష్టితో బుద్ధుడు సరిగా నిలబెట్టాడు.

ఇహ రెండో సంగతి – దీపం పట్టడం చీకట్లో వస్తువులను చూడటానికి. దీనికి ప్లేటో “గుహ”ను ఉదహరిస్తాను. ఇది ప్రతి పాశ్చాత్య తత్వశాస్త్ర విద్యార్థికి తెలుసు. ఒక గుహలో కొంత మందిని వరుసగా నిలబెట్టి, వారిని మెడలు అటూ ఇటూ తిరగకుండా, ఎదురుగా ఉన్న గోడను మాత్రమే చూడగలిగే వీలుగా, నిలబెట్టి గొలుసులతో బంధించి, వారి వెనుక కొంత దూరంలో దివిటీలను వెలిగిస్తారు. అప్పుడు ఈ బంధితుల నీడలు ఎదురుగా ఉన్న గోడపై ప్రతిబింబిత మవుతాయి. అంటే ఆ బంధితులు తమ నీడలను తప్ప మరి దేనినీ ఎప్పటికీ చూడలేరు. వారు తమ నీడలే ప్రపంచమంతా అనే భావనకు సంఖతం (condition) అయిపోతారు. కొంతకాలానికి వీరిలో ఒక బంధితుడు గొలుసు తెగగొట్టుకొని గుహ బయటకు వస్తాడు (బుద్ధుడు అలాంటివాడు). సూర్యకాంతిలో అతనికి తన నీడల ప్రపంచం కాక యథార్థ ప్రపంచం కనిపిస్తుంది.

బుద్ధుడు దీపం పట్టాడంటే – సంఖత ప్రపంచానికి బందీలమైన మనం, బుద్ధ ధర్మ కాంతిలో మనస్సును సంఖత స్థితి (చీకటి) నుంచి బయటపడి – ప్రపంచాన్ని యథాభూతంగా చూస్తాము. ఇక్కడ బుద్ధుడు పట్టిన దీపం సమ్మాదిట్టి. దీనిని తరువాత మరో సందర్భంలో వివరిస్తాను.

బుద్ధుడు సంఖతమనే చీకటి నుంచి వెలుతురులోకి వచ్చాక, ఈ మిరుమిట్ల వెలుగులో కనిపించిన సత్యదృష్టి, వాస్తవికతా స్వభావం ఏమిటి? లోకపు త్రిలక్షణాలు. అవి సబ్బే సంఖారా అనిత్య, సబ్బే సంఖారా దుఃఖ, సబ్బే ధమ్మా అనత్తా. ఇంతకు ముందు చీకట్లో ఉన్నప్పుడు, సంఖతలో ఉన్నప్పుడు, అనిత్యాన్ని నిత్యంగా, చెదరనిదిగా, మారనిదిగా, స్వతంత్ర సత్తాగా, ప్రత్యేక సత్వంగా, గుర్తింపు ఉన్నదానిగా, ఏ ఇతరం మీద ఆధారపడని దానిగా చూచాము. ఉదాహరణకు నా టేబుల్ ఉంది, దాని వయసు డెబ్భై ఏళ్లు. మొత్తం మీద ఎదో అల్ప మార్పు ఉన్నా, దానిని a table గా గాక, The table గా చూశాను. అది సర్వస్వతంత్రమైంది, మారనిది, అది ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన table. నా గదిలో ఒక మూల, ఒక స్థలంలో, ఒక కాలంలో ఒకరికి చెంది, ఒక పేరును (table) కలిగి, వ్యక్తికమైన, individual identity ఉన్నదానిగా చూశాను. ఇప్పుడు మరి కొత్త వెలుగులో క్షణక్షణం మారుతున్న దానిగా, ఒక ప్రవాహంగా, ఒకానొక గుర్తింపు (identity) లేని దానిగా, కాల-దేశాలు లేనిదానిగా, అస్వతంత్రమైన దానిగా, మార్పు (పరిణామం) వెనుక మారనిదేమీ లేనట్లుగా, పరతంత్రంగా, నిస్సారమైన అంటే మారని ఏ సారం (substance) లేనిదానిగా చూస్తున్నాను.

సారం చూడటం అంటే “మారని ఆత్మ” అందులో లేదని తెలుసుకోవటం. ఎలాగైతే సారం లేని, మారనిది ఏది అందులో లేదు అనే టేబుల్ వలే, ఈ ప్రపంచంలోని ధర్మాలన్నీ, వస్తువులన్నీ నిస్సారాలు, మారని, స్థిరమైన, స్వతంత్ర, సర్వసత్తాక ఆత్మలేనివే. సంఖతమై (చీకట్లో) మనం ఉన్నప్పుడు ఈ “అనత్త”ను గుర్తించము. అనాత్మ అర్థంకాకపోవడం అంటే, బౌద్ధంలో ఓనమాలు కూడా దిద్దకకపోవడమే.

సబ్బే సంఖారా దుఃఖ అనేది – దుఃఖం అంటే ఏమిటో తరువాత మరో వ్యాసంలో వివరిస్తాను. ఎందుకంటే అది చాలా పెద్ద విషయం. పెద్దలకే అది – బౌద్ధం చెప్పే దుఃఖం – అర్థం కాలేదు. నా పరిస్థితీ అదే. నేను కూడా, నాకు సరిగా అవగాహన లేని దుఃఖాన్ని ఇంకోసారి వివరిస్తాను.

ఉపసంహారం: మొహం వలన మనం లేని దానిని ఉన్నట్లు – లేని ఆత్మను ఉన్నట్లుగా, మారేదాని వెనుక మారనిది  – సారం, ఆత్మ, భూమిక, ఆధారం – ఉన్నట్లుగా, క్షణం క్షణం మారుతున్నా, దానిని ‘అది అదే’గా చూడడం, ఏ రెండు క్షణాల పాటు ‘అది అదిగా’ ఉండదని గుర్తించకపోవటం, ఈ వ్యవహారిక ప్రపంచంలో జరుగుతుంది. మోహాన్ని తొలగించుకొని సంఖతస్థితి నుంచి మనస్సును, మడిచి, శుద్ధిచేస్తే, ప్రపంచాన్ని యథాభూతంగా దర్శించగలుగుతాం.

రచన: అన్నపరెడ్డి బుద్దఘోషుడు

⇐శీర్షికలు