(సంయుక్తనికాయ 22:94)

భిక్షువులారా, నేను లోకంతో వివాదపడటం లేదు. లోకమే నాతో వివాదపడుతుంది.  ధర్మవాది యీ లోకంలో ఎవరితోనూ వివాదపడడు.  భిక్షువులారా, లోకంలో పండితులు ఏది లేదని అంగీకరిస్తున్నారో, నేను కూడా అది లేదని చెబుతున్నాను. వారు ఏది ఉందని అంగీకరిస్తున్నారో, నేను కూడా అది ఉందని చెబుతున్నాను.

భిక్షువులారా, లోకంలో పండితులు లేదని అంగీకరించేది, నేను లేదని చెబుతున్నది ఏమిటి?  నిత్యమైన, స్థిరమైన, శాశ్వతమైన, మార్పులేని రూపం (దేహం) లేదని లోకంలో పండితులు అంగీకరిస్తున్నారు. నేను కూడా అటువంటి రూపం లేదని చెబుతున్నాను. లోకంలో నిత్యమైన, స్థిరమైన, శాశ్వతమైన, మార్పులేని వేదన…. సంజ్ఞ…. సంఖార…. విజ్ఞాన లేదని లోకంలో పండితులు అంగీకరిస్తున్నారు. నేను కూడా అటువంటి వేదన…. సంజ్ఞ…. సంఖార…. విజ్ఞాన లేదని చెబుతున్నాను. భిక్షువులారా, లోకంలో పండితులు లేదని అంగీకరించేది, నేను లేదని చెబుతున్నది యిదే.

భిక్షువులారా, లోకంలో పండితులు ఉందని అంగీకరించేది, నేను ఉందని చెబుతున్నది ఏమిటి? అనిత్యమైన, దుక్ఖ భరితమైన, మార్పుచెందే రూప (దేహం) ఉందని  లోకంలో పండితులు అంగీకరిస్తున్నారు. నేను కూడా అటువంటి రూపం ఉందని చెబుతున్నాను.  భిక్షువులారా, అనిత్యమైన, దుక్ఖ భరితమైన, మార్పుచెందే వేదన…. సంజ్ఞ…. సంఖార…. విజ్ఞాన ఉందని లోకంలో పండితులు అంగీకరిస్తున్నారు, నేను కూడా అటువంటి వేదన…. సంజ్ఞ…. సంఖార…. విజ్ఞాన ఉందని చెబుతున్నాను. భిక్షువులారా, లోకంలో పండితులు ఉందని అంగీకరించేది, నేను ఉందని చెబుతున్నది యిదే.

భిక్షువులారా, లోకంలో ఒక లోకధర్మం ఉంది. తథాగతుడు దానిని సంపూర్ణంగా తెలుసుకున్నాడు, గ్రహించాడు. సంపూర్ణంగా తెలుసుకుని గ్రహించి, దానిని చూపించాడు, బోధించాడు, ప్రకటించాడు, స్థిరీకరించాడు, విశ్లేషించాడు, విశదపరిచాడు. తథాగతుడు సంపూర్ణ జ్ఞానంతో గ్రహించిన ఆ లోకధర్మం ఏమిటి?  భిక్షువులారా, తథాగతుడు సంపూర్ణ జ్ఞానంతో గ్రహించిన లోకధర్మం రూపం (దేహం); ఆయన దానిని చూపించాడు, బోధించాడు, ప్రకటించాడు, స్థిరీకరించాడు, విశ్లేషించాడు, విశదపరిచాడు.  (అలాగే) తథాగతుడు సంపూర్ణ జ్ఞానంతో గ్రహించిన లోకధర్మం వేదన…. సంజ్ఞ…. సంఖార…. విజ్ఞాన. ఆయన దానిని చూపించాడు, బోధించాడు, ప్రకటించాడు, స్థిరీకరించాడు, విశ్లేషించాడు, విశదపరిచాడు.

అలాంటప్పుడు, ఎవరయినా తెలివిలేని, చూడలేని అంధుడైన బుద్ధిహీనుడు దానిని తెలుసుకోలేకపోతే, చూడలేకపోతే నేనేమి చేయగలను?

భిక్షువులారా, ఒక నీలి లేదా ఎర్రని లేదా తెల్లని తామరపూవు బురదలో పుట్టి, బురదలో పెరిగి, బురద అంటకుండా నీటిపై ఎలా నిలిచివుంటుందో, అలాగే తథాగతుడు లోకంలో పుట్టి, లోకంలో పెరిగి, లోకాన్ని అధిగమించి, నిష్కళంకంగా లోకంలో జీవిస్తాడు.

అనువాదం: డి.చంద్రశేఖర్